MahaGauri

Mahagauri

మహాగౌరి

Mahagauri

నవదుర్గల్లో ఎనిమిదవ అవతారం “మహాగౌరి”. శివుని అర్ధాంగి అవ్వడం కోసం పార్వతీదేవి ఎంత కఠిన తపస్సు చేసిందో మన అందరికీ తెలిసిన విషయమే. అమ్మ అడవుల్లోనే ఉండి ఆకులు అలములు తింటూ ఎండ, వాన, చలిని లెక్కచేయక తీవ్రమైన తపస్సు చేసింది. ఆ కటోర నియమాల వల్ల అమ్మ శరీర ఛాయ నల్లగా మారింది. శివపార్వతుల కళ్యాణం అనంతరం ఒకసారి శివుడు సరదాగా అమ్మవారిని కాళి అని సంబోధిస్తారు. కాళి అనగా నల్లని వర్ణం కలిగినది అని అర్థం.

https://youtu.be/1Bjh6-4Hz1Q?rel=0

స్వామి పరిహాసానికి అమ్మ కోపగించుకొని తపస్సు చేసుకోవడానికి భూలోకం తరలి వస్తుంది. బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మ దేవుని ప్రసన్నం చేసుకుంటుంది. బ్రహ్మదేవుడు సలహా మేరకు మానస సరోవరంలో స్నానం చేయగా, నల్లని వర్ణం ఆమె నుండి విడివడి, ఒక స్త్రీ రూపం పొందుతుంది. ఆ స్త్రీ అత్యంత సౌందర్యరాశి. ఆమె శక్తికి అనుబంధం మరియు పార్వతి దేవి నుండి ఉద్భవించిన కౌశికిదేవి. ఈమెను జ్వాలా దేవి అని కూడా పిలుస్తారు.

ఒకప్పుడు శంభునిశంభులు కేవలం స్త్రీ చేతిలోనే మరణం పొందేలా బ్రహ్మ దేవుని నుంచి వరం పొందుతారు. కౌశికిదేవి శంభునిశంభులను వధిస్తుంది. అమ్మవారు బంగారు ఛాయతో భయంకరమైన అగ్నిలా వెలిగిపోతూ ఉంటుంది.

గౌరీ అనగా తెలుపు, అందుకనే అమ్మవారిని మహాగౌరీ అని పిలుస్తారు. ఈ రూపంలో అమ్మవారు చతుర్భుజాలతో ఒక చేతిలో త్రిశూలం , మరొక చేతిలో డమరుకం , మరి రెండు చేతిలో ఒకటి అభయముద్ర రెండవ వరద ముద్రలలో ఉంటాయి. అమ్మవారు తెల్లని వృషభ వాహనం మీద, తెల్లని వస్త్రాలు, తెల్లని ఆభరణాలను ధరించి ఉంటుంది.

ఈ రూపంలో అమ్మవారు తొమ్మిది సంవత్సరాల బాలిక రూపంలో ఉంటుందని ప్రతీతి. అందుకనే చాలా ప్రాంతాలలో అమ్మవారి ప్రతిరూపంగా పెళ్లి కాని కన్యలకు కన్య పూజ చేస్తూ ఉంటారు.

రాముణ్ణి పొందడం కోసం సీతాదేవి గౌరీవ్రతం చేసిందని పురాణ ప్రశస్తి. వివాహం కానీ స్త్రీలు, కన్యలు, మహాగౌరి అమ్మవారిని తెల్లని పూలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది.

మంత్రము:

ఓం దేవీ మహాగౌర్యై నమః॥

ధ్యాన మంత్రము:

పూర్ణే న్దు నిభాం గౌరీ సోమచక్రస్థితాం అష్టమం మహాగౌరీ త్రినేత్రామ్।
వరాభీతికరాం త్రిశూల డమరూధరాం మహాగౌరీ భజేమ్॥

హే గౌరీ శంకరార్ధాంగీ
యథా త్వం శంకర ప్రియా,
తథా మాం కురూ కల్యాణీ
కాన్తాకాంతా సుదుర్లభామ

జగజ్జననిని మహాగౌరిగా కొలిచేటప్పుడు, క్రింద ఇచ్చిన మంత్రాన్ని తప్పక చదవాలి –

శ్వేతే వృషే సమారూఢా శ్వేతామ్బరధరా శుచిః
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా

***

*** శ్రీ మాత్రే నమః ***

Follow us on Social Media