Shailputri

శైలపుత్రి

Shailputri

నవరాత్రుల్లో మనం అమ్మవారిని తొమ్మిది రూపాలతో పూజిస్తాము. అందులో మొదటిది శైలపుత్రి.

శైలపుత్రి కన్నా ముందు అమ్మవారు దక్షుడి కుమార్తెగా జన్మిస్తుంది. దక్షుడు నీరీశ్వర యాగం చేయడం, ఆ దక్ష యజ్ఞంలో శివ నిందకు తట్టుకోలేక అమ్మవారు శరీరాన్ని దగ్ధం చేసుకోవడం మనకి తెలుసు. అమ్మవారు లుప్తం అయ్యాక శివుడు తపస్సులో విలీనం అయిపోతాడు.

తారకాసురుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి శివపార్వతుల యొక్క పుత్రుడి అవసరం ఏర్పడింది. అందువల్ల అమ్మవారు ఆవిర్భవించాల్సిన సమయం వచ్చింది. పర్వతరాజు, మైనావతి తపస్సుకు మెచ్చి అమ్మవారు వారికి కుమార్తెగా జన్మిస్తుంది.

పర్వతాన్ని సంస్కృతంలో శైలం అంటారు. పర్వతరాజు పుత్రికగా జన్మించింది కనుక శైలపుత్రి గా పేరుగాంచింది. హిమవంతుడు అంటే పర్వతరాజుకు మైనాకుడు, శైలపుత్రి అనే ఇద్దరు సంతానం. మైనాకుడు గురించి మనం సుందరకాండ లో వింటాం.

పర్వతరాజు అంటే పర్వతాలకు రాజు లేదా హిమవంతుడు. అమ్మవారు శైలపుత్రిగా జన్మించిన తర్వాత కఠోర తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకుని శివుడ్నే వివాహం చేసుకునే వరం పొందుతుంది. శివపార్వతుల వివాహం గురించి సప్తఋషులు, సప్తమాతృకలు పర్వతరాజును కలిసి మాట్లాడుతారు. పర్వతరాజు, మైనావతి ఎంతో సంతోషంతో అంగీకరిస్తారు. అప్పుడు దేవతల కి ఒక సమస్య ఎదురవుతుంది.

హిమవంతుడు కనుక చిత్తశుద్ధితో శివపార్వతుల కి వివాహం చేస్తే హిమవంతుడి కి మోక్షం వస్తుంది. దానివల్ల ఈ సృష్టి నుంచి హిమాలయాలు అదృశ్యమవుతాయి. హిమాలయాలలో ఎంతో మంది ఋషులు, యోగులు తపస్సు చేస్తూ ఉంటారు. అందుకే హిమవంతుడు, మైనావతి సంపూర్ణ చిత్తశుద్ధితో కాకుండా అన్యమనస్సుతో చేసేలా, శివుడి గురించి చిత్త భ్రాంతి కలిగేలా, శివుడే అఘోరాలా దర్శనమిస్తాడు. దాంతో భయపడిన మైనావతి, శివపార్వతుల వివాహానికి మొదట నిరాకరిస్తుంది.

కానీ శైలపుత్రి ప్రార్థనతో స్వామి తన విరాట్ రూపం తో దర్శనమిస్తారు. శివపార్వతుల వివాహం సంపూర్ణం అవుతుంది. హిమాలయాలు ఈ ప్రపంచం నుంచి లుప్తం కాకుండా ఉంటాయి.

అమ్మవారిని భవాని, హేమావతి అనే నామాలతో కూడా పిలుస్తారు.

అమ్మవారి కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం పట్టుకుని ఉంటుంది.

అమ్మ వృషభ వాహనం కలిగి ఉంటుంది.

శైలపుత్రి ఆరాధన వలన సాధకులకు మూలాధార చక్రం ఉత్తేజితమవుతుంది. మూలాధార చక్రం షట్చక్రాల్లో మొదటిది.

శైలపుత్రి ఆలయం వారణాసిలో మర్హియా ఘాట్ వద్ద ఉంది. కాశీలోని అలైపుర లో శైలపుత్రి ప్రాచీన దేవాలయం ఉంది.

ఈ అమ్మవారిని దర్శించి నంత మాత్రం చేతనే వైవాహిక సమస్యలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే నవరాత్రి రోజుల్లో ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.

శైలపుత్రీ దుర్గా ధ్యాన శ్లోకం

అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ శ్లోకాన్ని భక్తులు పఠిస్తారు.

వన్దే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం।

వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్॥

వృషభాన్ని అధిరోహించి, కిరీటంలో చంద్రవంకను ధరించి, యశశ్శు కలిగి, భక్తుల మనః వాంఛలను తీర్చే మాతా శైలపుత్రీ దుర్గా దేవికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్ధం.

అలంకరణ, నైవేద్యం

అమ్మవారిని ఈ రోజు బంగారం, ఎరుపు రంగు చీరతో, శైలపుత్రీ అవతారంలో అలంకరించి భక్తితో పూజిస్తారు. ఈ సందర్భంగా శైలపుత్రీ దేవికి చెక్కెర పొంగలి, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు.

Follow us on Social Media