Chandraghanta Devi
చంద్రఘంటాదేవి
Chandraghanta Devi
నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవి గా పూజిస్తారు. శివుడిని వివాహం చేసుకోవడానికి అమ్మవారు ఎన్నోపరీక్షలు ఎదుర్కొంది. శివుడు, పార్వతిదేవిని వివాహం చేసుకోవడానికి సపరివారంగా తరలివస్తున్నాడు. శివ పరివారంలో శివగణాలు ,భూత గణాలు ప్రేతగణాలు, అఘోరాలు అంతా శివుని చుట్టూ నాట్యం చేస్తూ శరీరమంతా భస్మధారణతో ఎంతో భయంకరంగా తరలి వస్తుంటారు.
అక్కడ మైనాదేవి ఎంతో ఆత్రుతతో అల్లుడు రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మొదట చంద్రుని, సూర్యుని అటుపిమ్మట విష్ణుమూర్తిని చూసి అల్లుడని భ్రమిస్తుంది. కానీ తనకు కాబోయే అల్లుడు వాళ్లందరికీ ఆదిదేవుడ నారదుని ద్వారా తెలుసుకొని,వీరే ఇంత అందంగా ఉంటే నా అల్లుడు ఇంకా ఎంత అందంగా ఉంటాడో అని శివుని రాకకై ఎదురుచూస్తూ ఉంటుంది. అంతలో చుట్టూ భూతప్రేతాలతో శరీరమంతా భస్మధారణతో నాట్యం చేస్తూ వస్తున్న శివుని చూసి మైనాదేవి మూర్ఛపోతుంది.
మూర్ఛ నుండి తేరుకున్న మైనాదేవి, తన కుమార్తె వివాహం శివునితో జరగడానికి వీలులేదు అని పట్టుబడుతుంది. అప్పుడు, అమ్మవారు పది చేతులతో తలమీద చంద్రవంకతో, ఒక చేతిలో ఘంటని ధరించి భయంకరమైన రూపంతో దర్శనమిస్తుంది. తల మీద చంద్రవంక చేతిలో ఘంట ధరించి ఉంటుంది కనుక అమ్మవారిని చంద్రఘంటా అని పిలుస్తారు. చంద్రఘంటా రూపంలో శివుని కూడా కనిపించి, స్వామి నిజరూపంలో తనని వివాహం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తుంది. అప్పుడు శివుడు సుందరమైన పెళ్ళికొడుకుగా మారి, పార్వతీదేవిని వివాహమాడతాడు. శివ పార్వతుల వివాహం సంపూర్ణం అవుతుంది.
అమ్మవారు, శివుడు, శివ పరివారం సమేతంగా కైలాసం బయలుదేరి వెళ్తారు. శివుని వివాహం గురించి తెలుసుకున్న తారకాసురుడు అమ్మవారిని ఒక సాధారణ స్త్రీగా భ్రమించి అమ్మవారిని వధించడం కోసం రాక్షస సమూహాన్ని పంపిస్తాడు.
అక్కడ కైలాసంలో అమ్మవారు గృహిణిగా తన గృహ కార్యాలను చక్కపెట్టుకొని, శివు పూజ చేసుకుంటూ ఉంటుంది. పెద్ద సమూహంగా కైలాసం మీదకు వస్తున్న రాక్షస సమూహాన్ని చూసి తన చేతిలోని ఘంటానాద ప్రకంపనలతోనే రాక్షసులను మట్టు పెడుతుంది. అందుకే, పూజలలో ఘంటానాదానికి ప్రత్యేక స్థానం కల్పించబడింది.
ఎ ఇంట్లో అయితే నియమిత సమయంలో ప్రాతఃకాలం, సంధ్య వేళలో ఘంటానాదం వినిపిస్తుందో ఆ ఇంట్లో దుష్ట శక్తులు చేరవని ప్రతీతి.
గృహిణిగా అమ్మవారి స్వరూపాన్ని చంద్రఘంటగా పూజిస్తారు. అమ్మవారికి ఎర్రని పూలు చాలా ప్రియం.
చంద్రఘంటాదేవి సాధనవల్ల సాధువుల యొక్క మూడవ చక్రం అయినా మణిపూరక చక్రం జాగృతం అవుతుంది. మణిపూరక చక్రం జాగృతం కావడం వల్ల అమితమైన బుద్ధివికాసం కలుగుతుంది, మంచిచెడుల విచక్షణ స్పష్టంగా తెలిసేలా చేస్తుంది. ఈ అమ్మవారిని పూజించే భక్తులకు ఎటువంటి లోటు లేకుండా సౌకర్యవంతమైన జీవితం గడిపేలా అనుగ్రహిస్తుంది.
చంద్రఘంటా దేవి ఆలయం వారణాసి లో ఉంది.
అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ శ్లోకాన్ని భక్తులు పఠిస్తారు.
చంద్రఘంట దేవి స్తుతి:
యా దేవి సర్వభూతేషూ మా చంద్రఘంట రూపేనా సంస్తిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
చంద్రఘంట దేవి ధ్యానం :
వందే వాన్ఛితాభాయ చంద్రార్ధక్రితశేఖరం
సింహరుధ చంద్రఘంట యశస్వినీమ్
మణిపురా స్థితం తృతీయ దుర్గ త్రినేత్రం
ఖంగా, గద, త్రిశూల, చపశార, పద్మ కమండాలు మాల వరభిటకరం
***
*** శ్రీ మాత్రే నమః ***
Follow us on Social Media