
Skandamata
స్కందమాత
Skandamata
నవరాత్రులలో 5వ రోజు అమ్మవారిని స్కందమాతగా పూజిస్తారు. సతీదేవి దక్షయజ్ఞంలో తన శరీరాన్ని త్యజించడం; శివుడు తీవ్ర తపస్సు, సమాధిలో ఉన్న సంగతి తెలుసుకున్న తారకాసురుడు, అదే అదనుగా భావించి బ్రహ్మదేవుని గురించి తీవ్ర తపస్సు చేసి, కేవలం శివపుత్రుడు చేతుల్లో మాత్రమే మరణం సంభవించేలా వరం పొందుతాడు. ఇక వరగర్వం వల్ల తారకాసురుడు తన చర్యలతో సమస్త ప్రపంచాన్ని పీడిస్తూ ఉంటాడు. తారకాసురుడి ఆగడాలు భరించలేని దేవతలు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంటారు.
అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో “శివపార్వతులకళ్యాణం సంపూర్ణమైంది, కాబట్టి మీరు వెళ్ళి శివుని ప్రార్థించండి” అని సలహా చెబుతాడు. శివుడు దేవతలందరికీ ఆశ్వాసన ఇస్తాడు. అంతలోనే దేవతల మనసులో ఒక సందేహం ఉత్పన్నమవుతుంది. తేజోవంతమైన ఆదిపురుషునికి, శక్తిస్వరూపిణి అయిన ఆదిశక్తి కి పుట్టే బిడ్డ ఎంతో తేజోవంతంగా ఉంటాడు కదా! అతని తేజస్సు ఈ బ్రహ్మాండం భరించగలదా అని సందేహిస్తారు.
దానితో భయపడిన దేవతలు కైలాసానికి వెళ్లి కేవలం శివ అంశతో మాత్రమే పుత్రుడు కలిగేలా శివుని నుంచి వరం పొందుతారు. అది తెలుసుకున్న పార్వతీదేవి కోపంతో దేవతలకు కూడా వారి భార్యయందు బిడ్డలు కలుగరని శపిస్తుంది.
అప్పుడు శివుడు పార్వతీదేవికి సనత్కుమారుడు ఇచ్చిన వరం గురించి జ్ఞాపకానికి తీసుకొస్తాడు.
ఒకసారి శివపార్వతులు విశ్వ భ్రమణం చేస్తుండగా ఒక ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న సనత్కుమారుడుని చూస్తారు. సనత్కుమారుడు కూడా శివుని చూసి తిరిగి తపస్సులో మునిగిపోతాడు. అతడి చర్యకి ఆశ్చర్యపడి శివుడు, తనని చూసి కూడా ఎందుకు నమస్కరించలేదు అని సనత్ కుమారుడిని ప్రశ్నిస్తాడు . దానికి నాలో ఉన్నది కూడా నువ్వే, మన ఇద్దరికీ అభేదం కదా అని సమాధానం చెప్తాడు. అతని జ్ఞానానికి ఆశ్చర్యపోయిన శివుడు వరం కోరుకోమంటాడు . దానికి సనత్కుమారుడు నాకు శాపానికి, వరానికి కూడా అభేదమే, నేనే నీకు వరం ఇస్తాను ఏం కావాలో కోరుకోమంటాడు. తనకి పుత్రుడిగా జన్మించమని శివుడు వరం అడుగుతాడు. మీకు మాత్రమే పుత్రునిగా జన్మిస్తాను అని వరమిస్తాడు.
స్కందోత్పత్తి సమయం ఆసన్నం అవుతుంది. శివ తేజస్సును మొదట భూదేవి, అగ్నిదేవుడు ఆ పై వాయుదేవుడు భరించడానికి ప్రయత్నించి విఫలమవుతారు. ఆపైన గంగాదేవి ప్రయత్నించి భరించలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకంలో శివ తేజస్సుని విడిచిపెడుతుంది. ఆ శరవణంలో ఒక బాలుడు జన్మిస్తాడు, ఆ బాలుని చూసిన కృత్తికలకు తల్లి ప్రేమ పొంగగా పాలతో ఆకలి తీరుస్తారు. కృత్తికలను తల్లిగా పొందాడు గనుక కార్తికేయుడు గా పేరుగాంచాడు.
కార్తికేయుడు పెరిగి పెద్దవాడై ఎన్నో యుద్ధ విద్యలు తెలిసిన యోధుడిగా తయారవుతాడు. దేవసేనాపతి పదవిని స్వీకరించి తారకాసురుడు మీదకు యుద్ధానికి వెళ్తాడు వారిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది చివరికి కార్తికేయుడు తారకాసురుని అంతం చేస్తాడు. కార్తికేయునకు యుద్ధంలో కలిగిన ఆగ్రహావేశాలను శాంతింప చేయడానికి దేవతలు అమ్మవారిని ఆవాహన చేస్తారు. అమ్మవారు ప్రత్యక్షమై కార్తికేయుని యొక్క ఆవేశాన్ని శాంతింపచేస్తుంది.
యోధుడు అంటే సంస్కృతంలో స్కంధ అని అర్థం. అందుకే కార్తికేయుని స్కంద అనే నామంతో పిలుస్తారు. అమ్మవారిని స్కందమాత గా పూజిస్తారు.
ఉపాసకులకు స్కందమాత ఆరాధనవల్ల పంచమ చక్రం అనగా విశుద్ధ చక్రం ఉత్తేజితం అవుతుంది. విశుద్ధ చక్రం ఉత్తేజితం అవడం వల్ల సాధకుల లో మద మాత్సర్యాలు అంతమవుతాయి.
ఈ అవతారంలో అమ్మవారు చతుర్భుజాలతో ఉంటుంది రెండు చేతులలో కమలాలను ధరించి, ఒక చేతితో అభయముద్ర, మరొక చేతిలో స్కందుని పట్టుకుని ఉంటుంది. స్కందమాతను పూజించడంవల్ల కార్తికేయుడు కూడా ప్రసన్నం అవుతాడు.
స్కందమాత ఆలయం వారణాసిలోని జైట్ పురాలో ఉంది. భక్తుల జీవితంలో ఎటువంటి కష్టాలనైనా తల్లీబిడ్డలు తీరుస్తారని అక్కడ స్థానిక ప్రజల నమ్మకం.
యా దేవి సర్వభూతేషూ మా స్కందమాత రూపేన శాస్తిత
నమస్తే సేయ నమస్తే సేయ నమస్తే సేయ నమోహ్ నమ:
***
*** శ్రీ మాత్రే నమః ***
Follow us on Social Media