
Nandikeswarudu (Lord Siva’s Second Avatar )History In Telugu
Nandikeswarudu
నందీశ్వరుడు
శివుడి అవతారములలో మరొక అవతారం నందీశ్వరుడు. నందికి, ఈశ్వరుడికి అందుకే అభేదం అని చెబుతారు పెద్దలు. నందీశ్వరుడి జననానికి సమయం ఆసన్నమైనది. నంది జననం నిమిత్తం పూర్వం శివుడు రచించిన లీలను ఇప్పుడు చూద్దాం.
శివుడికి తనను వాహించడానికి వాహనం మరియు మిత్రుడు కావాలనిపిస్తుంది. సమస్త బ్రహ్మాండాల్ని తన ఉదరంలో వాహించే ఈశ్వరుడిని భరించడం అంటే సాధారణ విషయం కాదు. శివ అంశకు తప్ప అన్యులకు అసాధ్యమైన విషయం. శివ అంశ నందీశ్వరుడిగా ఉద్భవించడానికి జరిగిన విషయ క్రమం ముందుగా తెలుసుకుందాం.
ఒకానొకప్పుడు శివుడికి అమ్మవారు తోడు ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. తన ఒంటరితనం పోగొట్టే ఒక మిత్రుని అవసరం ఉన్నట్లు అనిపిస్తుంది. తన మనసులో ఉన్న కోరికను అమ్మ దగ్గర వ్యక్తపరుస్తాడు. కానీ శివ అంశతో కుమారుడిని పొందే అర్హత గల వ్యక్తి ఎవరు అనే సందేహం పార్వతీదేవి తన సోదరుడు అయిన విష్ణుమూర్తి దగ్గర వ్యక్తపరుస్తుంది. దానికి విష్ణుమూర్తి, శిలాదుడు అనే మహర్షి, శివుడిని పుత్రుడిగా పొందగల అర్హత కలవాడు అని శిలాద మహర్షి గురించి చెబుతాడు.
శిలాద మహర్షి ఎటువంటి ప్రలోభాలకు లొంగక, కేవలం శివ భక్తితో సన్యాస జీవితం గడుపుతూ ఉంటాడు. సూర్యుడు అయినా ఒక గడియ ఆలస్యం కావచ్చేమో కానీ మహర్షి మాత్రం నిత్యకర్మలు ఒక అరగడియ కూడా ఆలస్యం చేయరు. నిత్యకర్మ, శివ పూజ, ధ్యానం తప్ప వేరే ఆలోచన లేకుండా జీవనయానం చేస్తూ, శివారాధన తప్ప వేరే ఇచ్ఛ లేకుండా ఉంటాడు.
“ఇచ్ఛ లేని మహర్షికి, పుత్రకాంక్ష కల్పించి, అతనికి శివుడు పుత్రునిగా జన్మించాలి” ఇది పార్వతీదేవిని వేధిస్తున్న విషయం. దానికి స్వయంగా విష్ణుమూర్తే శిలాద మహర్షికి పుత్రకాంక్ష కలిగించడానికి సిద్ధపడ్డాడు.
ఒకరోజు విష్ణుమూర్తి ఒక మహర్షి వేషధారణతో శిలాద మహర్షికి కనిపించి, స్వర్గంలో ఇంద్రుడు చేస్తున్న గొప్ప యజ్ఞానికి వెళుతున్నట్లు, యజ్ఞంతో పాటు అక్కడ జరిగే సత్సంగంలో కూడా పాల్గొనవచ్చునని ప్రేరేపిస్తాడు. విష్ణు ప్రేరణతో మహర్షి స్వర్గానికి వెళతాడు కానీ స్వర్గ ద్వారపాలకులు లోనికి పంపడానికి నిరాకరిస్తారు.
మహర్షి తన స్వర్గ ప్రవేశ నిరాకరణకి గల కారణం విచారించగా, స్వర్గ ప్రవేశం కేవలం స్వర్గంలో ఉన్న పూర్వజుల యొక్క అనుమతితో మాత్రమే సాధ్యమని, శిలాద మహర్షి వివాహం చేసుకుని, సంతానం కలగకపోవడం వల్ల స్వర్గ ప్రవేశం నిషిద్ధం చేయబడింది అని తెలుసుకొన్న మహర్షి విపరీతమైన వ్యాకులతకి గురి అవుతారు.
ఆ ఆవేశంలో వేరొక స్వర్గం సృష్టించడానికి తీవ్ర తపస్సులో నిమగ్నమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు సహాయం కోసం విశ్వామిత్రుడిని కలిసి శిలాదుడిని వారించమని ప్రార్థిస్తాడు. విశ్వామిత్రుడు వెళ్ళి శిలాదుడిని సృష్టికి ప్రతిసృష్టి చేయడం ప్రకృతికి విరుద్ధమని, నేను చేసిన పని నువ్వు కూడా చేయవద్దని వారిస్తాడు. విశ్వామిత్ర మహర్షి త్రిశంకు స్వర్గం సృష్టించిన విషయం, దానికి సంబంధించిన కథ అందరికీ తెలిసిందే.
విశ్వామిత్రుడు శిలాదుడితో ప్రతిసృష్టితో స్వర్గ నిర్మాణం విరమింపజేసి, పుత్ర సంతానం కోసం తపస్సు చేసేలా ప్రేరేపిస్తాడు.ఇక శిలాద మహర్షి శివుని గురించి తపస్సు ప్రారంభిస్తాడు. మహర్షి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో వరం కోరుకోమంటాడు. పరమేశ్వరుడిని చూచిన ఆనందంతో కన్నుల నీరు రాగా, నోట మాట రాక స్వామిని చూస్తూ నిలబడిపోతాడు. ఇక సరస్వతి దేవి అతని వాణిలో నిలచి పుత్రసంతానం కోసం ప్రార్థించేలా చేస్తుంది. స్వామి తన అంశకు తండ్రి కాగలడని వరం ఇస్తాడు.
శిలాదుడు పరమేశ్వరుడి అవతారం కోసం వేచి చూస్తూ ఉంటాడు. ఒక శుభదినమున మహర్షి పొలం దున్నుతుండగా నాగటి చలురాయికి తగిలి, అందు నుండి ఒక బాలుడు ఉద్భవిస్తాడు. ఆ బాలుడిని శిలాద మహర్షి కుమారుడిగా స్వీకరించి, నంది అని నామకరణం చేస్తాడు.
ఇటుపక్క శివుడు వైరాగ్యంతో భూభ్రమణం చేస్తూ ఉంటాడు.
మరొక ప్రక్క నంది మందబుద్ధితో ఒక పలుకు కూడా పలుకక స్తబ్దంగా ఉంటాడు.శిలాదుడు ఇది శివ పరీక్షగా భావించి ధైర్యంగా, రెట్టించిన భక్తితో శివారాధన చేస్తూ, కుమారుడికి విద్యా బుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఎంత ప్రయత్నించినా నంది నోట వెంట ఒక్క మాట కూడా వెలువడదు. రోజులు గడుస్తున్నా ఒకనాడు శిలాదుడు పరాకుగా ఉన్న సమయంలో నంది అప్రయత్నంగా పక్కన ఉన్న అడవిలోకి ప్రవేశిస్తాడు. ప్రమాదాలకు వెరువక, రోజంతా అలా తిరుగుతూ ఉంటాడు. నందిని చూసి జాలిపడి ఆహారం దొరికేలా చేస్తుంది. ఆహారం కోసం ఆశపడక అంతా పరమేశ్వరుడిని చూస్తూ శివధ్యానం చేస్తూ ఉంటాడు. భూభ్రమణం చేస్తున్న శివుని దర్శించిన నందికి జ్ఞానం కలిగి, తిరిగి తండ్రి దగ్గరకి వెళ్లి మాట్లాడడం మొదలు పెడతాడు.
శిలాద మహర్షి ఎంతో సంతోషించి నందికి విద్యాబుద్ధులు నేర్పుతాడు. తండ్రి దగ్గర విద్య సంపూర్ణం అయిన తరువాత ఇంద్రాది దేవతలు నంది ధర్మదీక్ష, న్యాయ నిరత పరీక్షించి సంతుష్టులు అవుతారు.
ఇంద్రుడి మార్గదర్శంతో తపస్సు చేయాలని నిర్ణయించుకుంటాడు.
Follow us on Social Media