Padma puranam in Telugu

Padma puranam

పద్మపురాణము

ఈ పురాణం విస్తృతిలో స్కాందపురాణానికి తరువాతదిగా ఉండి, మిగిలిన 16 పురాణాలకంటే పెద్దది. దీనిలోని శ్లోక సంఖ్య అర్థలక్ష (యాభైవేలు). అంటే లక్ష శ్లోకాల విస్తృతిగల మహాభారతంలో సగము, భాగవతానికి దాదాపు మూడురెట్లు పెద్దదైన పురాణం ఇది. ఈ పురాణం రెండు రకాలైన పాఠాలతో లభిస్తున్నది. వంగదేశ పాఠం ఒకటి. ఇది ఇప్పటికీ ముద్రితం కాలేదు. వ్రాతప్రతిగానే ఉన్నది. రెండవది ఆనందాశ్రమ పాఠ ప్రతి. ఇది ఆరుఖండాలు అనగా…. 1) ఆదిఖండం, 2) భూమిఖండం, 3) బ్రహ్మఖండం, 4) పాతాళఖండం, 5) సృష్టిఖండం, 6) ఉత్తరఖండం అనే ఆరు భాగాలుగా ముద్రితమైంది.ఇందులోని 125వ అధ్యాయంలోని శ్లో. 48-49 శ్లోకాల ప్రకారం ఈ ఖండ విభజన అనంతర కాలంలో జరిగినట్లు తెలుస్తున్నది. మూలంలో ఐదు ఖండాలు మాత్రమే ఉన్నాయని అముద్రిత వంగప్రతిలో అదే రకమైన విభజన ఉన్నదని పురాణ పండితులు తెలుపుతున్నారు. దీనికే

ప్రథమం సృష్టిఖండం హి భూమిఖండం ద్వితీయకమ్ తృతీయం స్వర్గఖండంచ పాతాలశ్చ చతుర్థకమ్ పంచమంచోత్తరంఖండం సర్వపాప ప్రణాశనమ్ – అని తెలుపుతున్నది.

1. సృష్టి ఖండం : దీనిలో 82 అధ్యాయాలున్నాయి. ఇందులోని ప్రథమ అధ్యాయం వలన ఈ పురాణంలో 55,000 శ్లోకాలున్నాయని, ఈ పురాణం అయిదు పర్వాలతో విభజింపబడిందని తెలుస్తున్నది. అవి 1) పౌష్కర పర్వం – ఇందులో దేవతలు, మునులు ,పితరులు, మనుష్యుల వంటి తొమ్మిది రకాల సృష్టిని గురించిన విపులవర్ణన ఉన్నది. 2) తీర్థపర్వం : ఇందులో పర్వత, ద్వీప, సప్తసాగర వర్ణన ఉన్నది. 3) తృతీయ పర్వం: దీనిలో ఎక్కువగా దక్షిణలను ఇచ్చే రాజుల వర్ణన ఉన్నది. 4) చతుర్థపర్వం : రాజుల వంశాను కీర్తనం ఉన్నది. 5) మోక్షపర్వం: మోక్షము దాని సాధన మార్గాల గురించిన వివరణ ఉన్నది. ఈ ఖండంలోనే సముద్రమథనం, పృథుజననం పుష్కర తీర్థవాసుల ధర్మవృత్తాంతం, వృత్రాసుర సంగ్రామం, వామనావతారము, మార్కండేయముని ఉత్పత్తి, కార్తికేయ జననం,శ్రీరామచరిత్రం, తారకాసుర వధ మొదలైన వృత్తాంతాలు విస్తారంగా వర్ణింపబడ్డాయి.

2. భూమి ఖండం : ఈ ఖండం మొదట్లోనే శివశర్మ అనే పేరుగల బ్రాహ్మణుడు పితృ భక్తి చేత స్వర్గాన్ని పొందటం, పృథుమహారాజు పుట్టుక, చరిత్ర వర్ణనము, ఒక మాయా వేషధారి యొక్క బోధల ద్వారా జైన ధర్మ విషయాలు విని వేనుడు చెడుమార్గాన్ని ప్రవేశించడం, అప్పుడు సప్తర్షులవలన అతడి భుజమథనం జరిగి, పృథువు జన్మించడం, అనేక విధాలైన నైమిత్తిక, ఆభ్యాదాయక దానాల తరువాత, సతీసుకళ యొక్క పాతివ్రత్య సూచక కథలు చాలా విపులంగా వివరించబడ్డాయి. యయాతి, మాతలుల ఆధ్యాత్మిక విషయ సంవాదాలు, పాపపుణ్య ఫలవివరణలు, విష్ణుభక్తి ప్రశంస తెలుపబడ్డాయి. చ్యవన మహర్షి వృత్తాంతం సుదీర్ఘంగా తెలుపబడింది. పద్మపురాణం ముఖ్యంగా విష్ణు భక్తికి ప్రతిపాదితము. కానీ ఇందులో ఇతర దేవీ, దేవతల యొక్క అనాదరభావ ప్రకటన లేదు. ఇందులో శివకేశవ అభేదత్వమే ప్రకటించబడింది. ఈ తత్త్వమే

శైవం చ వైష్ణువం లోకమేకరూపం నరోత్తమ
ద్వయోశ్చాప్యనంతరం నాస్తిఏకరూపం మహాత్మనోః


శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే
శివశ్చహృదయే విష్ణు: విష్ణోశ్చహృదయే శివః


ఏకమూర్తిస్త్రయోదేవాః బ్రహ్మవిష్ణు మహేశ్వరాః
త్రయాణామంతరంనాస్తి, గుణభేదా: ప్రకీర్తితా

అనే శ్లోకం ద్వారా తెలుపబడింది.

3. స్వర్గఖండం : ఈ ఖండంలో దేవ, గంధర్వ, అప్సర, యక్షాదిలోకాల విస్తృతవర్ణన వున్నది. ఈ ఖండంలోనే శకుంతలోపాఖ్యానం కూడా ఉన్నది. ఇది మహాభారతంలోని శకుంతలోపాఖ్యానంతో పూర్తిగా విభేదిస్తున్నది. కానీ కాళిదాసు అభిజ్ఞానశాకుంతల కథతో పూర్తిగా ఏకీభవిస్తున్నది. అందుకే కొందరు పండితులు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల కథేతిహాసం మహాభారతం నుంచి కాక ఈ పద్మపురాణం నుంచి గ్రహించాడని తెలుపు తున్నారు. విక్రమోర్వశీయం గురించి కూడా ఇలాంటి వాదమే ఉన్నది.

4. పాతాళఖండం : ఈ ఖండంలో నాగలోకం యొక్క విస్తృత వర్ణన ఉన్నది. ప్రసంగతః రావణ విషయం వచ్చినప్పుడు మొత్తం రామాయణకథ ఇందులో చెప్పబడింది. ఇందులోని ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే కాశిదాసు తన రఘువంశంలో చెప్పిన రామకథతో ఇందలి వృత్తాంతం పూర్తిగా సరిపోలుతూ ఉన్నది. రావణవధానంతరం సీతాపరిత్యాగం, కుశలవ జననం, రామాశ్వమేధవృతాంతాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. ఈ వృత్తాంతం అంతా భవభూతి రచించిన ఉత్తర రామచరిత కథావృత్తాంతంతో ఏకీభవిస్తున్నది. ఈ పురాణంలో వ్యాసుడు అష్టాదశ పురాణాలను రచించిన విషయం తెల్పి అందులో భాగవతపురాణం యొక్క మహిమ విస్తృతంగా వివరించబడింది.

5. ఉత్తర ఖండం : ఈ అయిదవదైన ఉత్తరఖండంలో వివిధ రకాలైన ఆఖ్యానాల సంక్షిప్త వర్ణనం ఉన్నది. ఈ ఖండంలోనే విష్ణుభక్తిని గురించిన ప్రశంస విస్తృతంగా కనిపిస్తుంది .దీనికి పరిశిష్ట అంశంగా ‘క్రియాయోగసారం’ అనే భాగం కూడా లభిస్తున్నది. ఇందులో వ్రతాలు, తీర్ధసేవనం మొదలైన విషయాలతో శ్రీమహావిష్ణువు విశేషంగా ప్రసన్నుడై కోరికలు తీరుస్తాడని చెప్పబడింది.

పద్మపురాణం విష్ణుభక్తి ప్రతిపాదక పురాణాలలో ముందుగా నిలిచే గ్రంథం .భగవంతుని నామ గుణగానం ఎన్ని విధాలుగా చక్కగా చేయవచ్చునో, ఎన్ని పేర్లు అపరాధ యుక్తాలైనవో మొదలైన విషయాలకు సమాధానం చాలా ప్రామాణికంగా ఈ పురాణంలో లభిస్తాయి. అందువలననే తరువాత కాలంలో వచ్చిన వైష్ణవ సంప్రదాయక గ్రంథాలు ఈ పురాణాన్ని విశేషంగా స్తుతించి ప్రామాణికంగా స్వీకరించాయి. సాహిత్య దృష్టితో చూచినా ఈ పురాణ శైలి బహుసుందరంగా ఉంటుంది. సామాన్యంగా పురాణరచనలో అనుష్టుప్ ఛందం విశేషంగా ఉపయోగపడుతుండగా ఇందులో అనుష్టుప్ ఛందమేగాక ఇతర దీర్ఘ ఛందాలు కూడా విశేషంగా ఉపయోగించబడ్డాయి. ఉదాహరణ ఈ శ్లోకం చూడండి:

సంసారసాగరమత్వీ గభీరపారం, దుఃఖోర్నిభిర్వివిధ మోహమయైస్తరంగైః
సంపూర్ణమస్తి నిజదోషగుణైస్తు ప్రాప్తం, తస్మాత్ సముద్ధర జనార్దన మాంసుదీనం

ఇలాంటి చక్కని రచనా శైలితో ఉన్న పురాణం ఇది.

ఇందులో సృష్టి ఖండంలో 82 అధ్యాయాలు, భూ ఖండంలో 125 అధ్యాయాలు స్వర్గ ఖండంలో 39 అధ్యాయాలు, పాతాళ ఖండంలో 113 అధ్యాయాలు, చివరిదైన ఉత్తర ఖండంలో 282 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తంమీద ఈ గ్రంథంలో 641 అధ్యాయాలలో 55,000 శ్లోకాలు ఉన్నాయి.

Padma Puranam      Download PDF Book

Read Padma puranam Online here

Padma-Puranam

Follow us on Social Media