Pippalaad

Pippalad Avataram

Pippalad Avataram

శని గ్రహ దోష నివారణ కొరకు

పిప్పలాద అవతారం

శివ అవతారాలలో మొట్టమొదటి అవతారం పిప్పలాదుడు. పిప్పలాద అవతారానికి ముఖ్య కారణం శని దేవుడు చేసిన ఒక అనుచిత కార్యం. ముందు శని దేవుని జననం గురించి చెప్పుకుందాం.

శనిదేవుని జననం


సూర్య దేవుని వివాహం, విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ దేవితో జరుగుతుంది. కానీ సంజ్ఞ దేవి, సూర్య తాపాన్ని భరించలేక తన ఛాయను సూర్య దేవుని దగ్గర వదిలి, తను స్వయంగా అశ్వ రూపం ధరించి తపస్సు చేసుకోవడానికి తరలి వెళ్ళి పోతుంది. ఇక్కడ ఛాయాదేవి, సూర్య దేవుని పట్ల భక్తి శ్రద్ధలతో పతిగా భావించి పూజిస్తూ సంజ్ఞ దేవి కి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత సూర్యుడు, ఛాయా దేవిల పుత్రుడు – శని దేవుడి జనన సమయం ఆసన్నమైంది. ఇంతలో తపస్సు పూర్తి చేసుకొని స్వగృహానికి తిరిగి వచ్చిన సంజ్ఞ దేవి పుత్రుడైన యముడు, తన తల్లి స్థానంలో ఉన్న స్త్రీ తన తల్లి కాదని గ్రహిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న సూర్యుడు ఛాయాదేవిని విషయం అడగగా జరిగినది అంతా సూర్యునికి విశదీకరిస్తుంది.

విషయం తెలుసుకున్న సూర్యుడు తన తాపాన్ని తగ్గించుకునే మార్గం కోసం విశ్వకర్మను సంప్రదిస్తాడు. విశ్వకర్మ కొన్ని కిరణాలను తీసి, ఆ కిరణాలతో దేవతలకు అస్త్రాలను చేస్తాడు. తన తాపాన్ని తగ్గించుకున్న సూర్యుడు అశ్వ రూపంలో ఉన్న సంజ్ఞ దేవి వద్దకు వెళ్లి తాను కూడా అశ్వ రూపం ధరించి, కొంతకాలం గృహస్థ జీవితం గడుపుతారు. వారికి అత్యంత సుందరమైన కవల పుత్రులు జన్మిస్తారు. అశ్వ రూపంలో ఉన్న సూర్యునికి జన్మించినందున వారు అశ్వినీ దేవతలు గా ప్రసిద్ధి పొందారు.

ఇటు ఛాయాదేవి గురించి పూర్తిగా మరచి వారి జీవితాలలో సంతోషంగా ఉంటారు. ఇది ఛాయాదేవిని విపరీతంగా బాధిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో శని దేవుని జననం సంభవిస్తుంది. కానీ సూర్య దేవుడి నిరాకరణతో, శని దేవుడు శివుని గురించి కఠోర తపస్సు చేసి నవగ్రహాలలో స్థానం పొందుతాడు. శని దేవుడు తన తపస్సమయంలో సంపూర్ణ నిష్టతో తనకు సేవ చేసిన, తనను వివాహం చేసుకోదలచిన గాంధర్వ రాజకుమారి మాందను వివాహమాడతాడు. భర్త కోసం అలంకరించుకుని ఎదురు చూస్తున్న మాంద, భర్త నిరాదరణకు గురై, కోపంతో, “మీ దృష్టి ఎవరి మీద ప్రసరిస్తుందో వారు సర్వ నాశనం అవుతారు” అని శపిస్తుంది.

దధీచి మహర్షి శివుడికి గొప్ప భక్తుడు.  సంతానం కోసం శివుని గురించి కొన్ని సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేస్తాడు. దధీచి మహర్షి తపోభంగం చేయడానికి స్వయంగా ఇంద్రుడు విపరీతమైన జలధారలతో వర్షాన్ని కురిపిస్తాడు. దానివల్ల నదులలో నీటి మట్టం పెరిగి, వరద రూపంలో నీరు దధీచి మహర్షి తపో ప్రాంతాన్ని ముంచుతుంది. వరదనీటి నుండి స్వయంగా శివలింగం మహర్షిని కాపాడుతుంది. పెద్ద పెద్ద బండ రాళ్లు వరద నీటితో కొట్టుకు రావడం గమనించి, శివలింగాన్ని కాపాడడం కోసం లింగానికి అడ్డుగా నిలబడతాడు. మహర్షి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా సంతానం ఆపేక్షిస్తాడు.  అప్పుడు శివుడు, తన లింగాన్ని తన రూపంగా భావించి కాపాడిన దధీచి మహర్షిని తండ్రిగా స్వీకరించి తనకే పుత్రునిగా జన్మిస్తాను అని వరం ప్రసాదిస్తాడు.

పిప్పలాద జననం

దధీచి మహర్షి పత్ని సువర్చలా దేవి గర్భం దాల్చింది. ఆ దంపతులు ఎంతో సంతోషంగా శివుని ఆగమనం కోసం ఎదురు చూడసాగారు. సత్య పరాయణుడు, ధర్మనిష్ఠుడు అయిన దధీచి మహర్షిని పరీక్షదలచి, శనీశ్వరుడు తన దృష్టిని మహర్షి పై ప్రసరింపచేస్తాడు. జీవుల యొక్క కర్మ ఫలాలను, వారి వారి కర్మలను బట్టి అనుభవింప చేయవలసిన శని దేవుడు కేవలం పరీక్ష కోసం దధీచి పై దృష్టి సారించడం అనే అనుచిత కార్యం చేస్తాడు. అదే సమయంలో ఇంద్రుని పై కూడా శని దృష్టి ప్రభావం పడుతుంది. అటు కొంతకాలానికి ఇంద్రుడు చేసిన కొన్ని అనుచిత కార్యాల వల్ల వృత్తా సురుడు అనే రాక్షసుడు సమస్త సృష్టిని పీడించసాగాడు.  

వృత్రాసుర వృత్తాంతం గురించి మరొక మారు చెప్పుకుందాం.

వృత్తా సురుని చంపడం కోసం ఎవరూ చేయని, లోహం కాని ఆయుధం కావాల్సి వస్తుంది. వాడిని చంపే ఆయుధం మహర్షి వెన్నెముక అని తెలుసుకున్న దేవతలు, వెళ్ళి మహర్షిని ప్రార్థిస్తారు. సమస్త లోకాల సంరక్షణ కోసం, గర్భవతి అయిన భార్య అనుమతి తీసుకుని దధీచి మహర్షి ప్రాణత్యాగం చేసి, తన అస్తికలను దానం చేస్తాడు. ఆయన వెన్నెముక వజ్రాయుధమై వృత్రాసుర సంహారం చేస్తుంది.

సువర్చలా దేవి బిడ్డకు జన్మనిస్తుంది. కానీ భర్త మరణం జీర్ణించుకోలేక, బిడ్డను వట వృక్షం (రావి చెట్టు) క్రింద ఉంచి తాను కూడా ప్రాణత్యాగం చేస్తుంది. వటవృక్షాన్ని విష్ణుమూర్తి ప్రతిరూపంగా పూజిస్తారు. వట వృక్షం విశేష గుణాలను కలిగి ఉంటుంది.  వటవృక్షం నీడలో 100% ప్రాణవాయువు (ఆక్సిజన్) ను కలిగి ఉంటుంది.  దానిలో ఉన్న విశేష ఔషధ గుణాల వల్ల దాని గాలి పీల్చినంత మాత్రం చేతనే, స్త్రీ, పురుషులలో ఉండే గర్భధారణ అవరోధాలను పోగొడుతుంది.  అందుకే పూర్వకాలంలో పిల్లలు కలుగకపోతే వటవృక్షానికి ప్రదక్షిణ చేయమనే వారు.  ఇది పూర్తి శాస్త్రీయంగానే మనకు పూర్వీకులు చెప్పారు.  ఇందులో మూఢవిశ్వాసం కానీ, అశాస్త్రీయత గాని ఏమీ లేదు.

బాలుడి రోదన విన్న అన్నపూర్ణాదేవి వట వృక్ష ఆకులతో అతని ఆకలి తీరుస్తుంది.  వటవృక్ష నీడలో, ఆకులతో బాలుడి పాలన, పోషణ జరుగుతుంది. వట వృక్ష ఆకులలో ఓం అనే శబ్దం వినిపిస్తుంది.  అలా ఓంకారాన్ని ధ్యానిస్తూ బాలుడు పెరుగుతూ ఉంటాడు. ఓంకార జపం వల్ల అతని లోని జ్ఞానం ప్రకాశిస్తుంది.  ‘వట’ అనగా సంస్కృతంలో ‘పిప్పల్’. “పిప్పల్” వృక్ష సంరక్షణలో పెరుగుతాడు గనుక అన్నపూర్ణ దేవి “పిప్పలాద” అని నామకరణం చేస్తుంది. జ్ఞానం ప్రకాశించిన ఆ బాలుడికి, తను ఈ వనవాసంలో ఎందుకు ఉన్నాడో, తన నామం గురించి, తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలన్న ఇచ్ఛ క్షణ క్షణానికి పెరుగుతూనే ఉంటుంది.

అలా ఓంకారం జపిస్తూ సంవత్సరాలు గడుపుతాడు పిప్పలాద. ఒకసారి ఆ వనంలోకి నారద మహర్షి విచ్చేస్తారు. మహర్షిని చూసిన పిప్పలాదుడు, నమస్కరించి, తను ఎవరు, తన తల్లిదండ్రులు ఎవరని ప్రశ్నిస్తాడు.  నారదుడు పిప్పలాదుడి లో శివుని అంశను చూసి నమస్కరించినా, బాలుడిగా ఉండటంవల్ల అమాయకంగా అతడు అడిగే ప్రశ్నలకు పూర్వ వృత్తాంతమంతా విశదీకరిస్తాడు. శనీశ్వరుడు చేసిన అనుచిత కార్యం వల్ల పిప్పలాదుడు ఆగ్రహావేశాలకు గురి అవుతాడు. తన తల్లిదండ్రులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి సూర్య మండలానికి పయనమవుతాడు.

ఈ విషయం తెలుసుకున్న శని దేవుడు, సూర్య, చంద్ర, బుధ, గురు, శుక్రులకు చెబుతాడు. కానీ వారు ఆ బాలుడిలో శివుని ప్రతిరూపం చూసి నమస్కరించి పిప్పలాదుడు కి దారి ఇస్తారు.  రాహు కేతువులు మాత్రం కాల సర్ప యోగం ఏర్పడేలా చేస్తారు.  కాల సర్ప యోగం కేవలం ఆర్థిక, శారీరక సమస్యల్నే కాకుండా మానసిక వికారాలను కూడా కలుగజేస్తుంది. పిప్పలాదుడి తల్లిదండ్రులు నరక లోక యాతనలు పడుతున్నట్లు భ్రాంతి కలిగేలా చేయాలని వాళ్ల ఆలోచన.  కానీ దానికి విరుద్ధంగా వారికి కైలాస ప్రాప్తి కలగడాన్ని, అంటే యదార్థాన్ని చూపిస్తాడు పిప్పలాదుడు. ఆ దృశ్యం వాళ్లకి ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఆ బాలుడే తమకు భ్రాంతిని కలుగజేశాడని తెలుసుకుని కోపంతో యుద్ధానికి దిగుతారు.

బాలుడైన పిప్పలాదుడు వారిని బంధించగా, అతనిని శివునిగా గుర్తించి, నమస్కరించి పిప్పలాదుడిని శాంతింపచేయడానికి రాహు కేతువులు ఇలా అంటారు, “స్వామీ! కాల సర్ప దోషం ఉన్నప్పుడు ఎవరైతే శివుని పూజాభిషేకాలు చేస్తారో, ఎవరైతే శ్రద్ధా భక్తులతో శివ పంచాక్షరీ జపం చేస్తారో వారికి దోష ఉపశమనం కలుగుతుంది. నీ భక్తులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టము” అని మాట ఇస్తారు.

ఆపైన పిప్పలాదుడు శని దేవుని సమక్షానికి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు. దానికి శని దేవుడు కేవలం తాను కర్మ ఫలాలను అనుభవింప చేస్తాను తప్ప ఎవరి మీద తనకు ద్వేషం ఉండదని సమాధానం ఇస్తాడు.

అప్పుడు పిప్పలాదుడు, ఎవరికైనా మంచి, చెడు – రెండూ  కర్మ ఫలితాలను ఇవ్వాలి తప్ప, కేవలం చెడు ఫలితాలు ఇచ్చి, మంచి కర్మలకు ఫలితాలను ఇవ్వడంలో ఎందుకు విఫలమైయ్యావని నిలదీస్తాడు. తనను నిలదీస్తున్నది, తనకు ఈ పదవి ఇచ్చిన శివునిగా గుర్తించి శరణు వేడుకుంటాడు.

పిప్పలాదుడు, జీవులకు కొన్ని హద్దులు, పరిమితులు, నివారణ మార్గాలు నిర్ణయించాడు. అవి –

  1. బాల్య కాలంలో జీవులపై శని ప్రభావం ఉండదు
  2. ఒకసారి శని ప్రభావం ప్రారంభమయ్యాక ఏడున్నర సంవత్సరాలకు మించి ఉండకూడదు
  3. ఏడున్నర సంవత్సరాలు మూడు విధాలుగా ఉంటుంది – మొదటి దశలో శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. రెండవ దశలో మాధ్యమంగా, చరమ దశలో శుభాలను కలుగజేస్తుంది.
  4. మనిషి జీవితకాలంలో 18 సంవత్సరములకు మించి శని దశ ఉండదు
  5. శ్రద్ధా భక్తులతో నిర్ణయించబడిన నివారణ మార్గాలను అనుసరించి, సత్కార్యాలను చేస్తే శని ప్రభావం తగ్గుతుంది అని చెబుతాడు.

పిప్పలాదుడు, శని ప్రభావం గురించి కొన్ని నివారణోపాయాలు కూడా చెప్పాడు –

  1. వట వృక్షానికి లేదా రావిచెట్టుకు కృతజ్ఞతగా నీరు పోసి వృక్షాన్ని సంరక్షించడం
  2. వట వృక్ష మొదలులో నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనీశ్వరుడిని నామ జపం చేస్తూ ప్రదక్షిణాలు చేయడం
  3. అవసరంలో ఉన్నవారికి, పేదలకు నల్లని వస్త్రాలు, చెప్పులు ఇలా ఎవరెవరి శక్తిని అనుసరించి దానధర్మాలు చేయడం
  4. సమస్త దేవతలు నివాసం ఉండే గోమాతను పూజించడం
  5. కుక్కలకు, కాకులకు ఆహారం ఇవ్వడం.

అన్నింటికీ మించి సత్కార్యాలను చేస్తూ, ధర్మ నిష్టతో ఎవరైతే జీవనం గడుపుతారో వారిని శని పీడ ప్రభావం బాధించిందని నివారణ మార్గాలు తెలియజేసి, వాటికి కట్టుబడి ఉండాలని శని దేవునికి ఆజ్ఞ ఇచ్చి పిప్పలాదుడు తపస్సులో నిమగ్నమవుతాడు.

ఇది శివుని మొదటి అవతారమైన పిప్పలాదుడి చరిత్ర, సంగ్రహంగా.

శివాయ నమః

Follow us on Social Media