sundarakanda-sarga-2.

Sundarakanda Sarga 2 – సుందరకాండ ద్వితీయ సర్గ

Sundarakanda Sarga 2

సుందరకాండ ద్వితీయ సర్గ

స సాగరమనాధృష్యమతిక్రమ్య మహాబలః |
త్రికూటశిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హ || 1

మహాబలుడగు హనుమంతుడు అట్లు దాటరాని సముద్రమును దాటి, సేదతీరి, త్రికూట పర్వత శిఖరం పై నున్న లంకానగరమును చూచెను.

తతః పాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ |
అభివృష్టః స్థితస్తత్ర బభౌ పుష్పమయో యథా || 2

అపుడా పర్వతమందలి చెట్లు పూలవాన కురిపించెను. పరాక్రమశాలి యగు హనుమంతు డా పూలతో నిండి, పూలతో చేయబడిన కోతివలె నుండెను.

యోజనానాం శతం శ్రీమాంస్తీర్త్వాఽప్యుత్తమవిక్రమః |
అనిశ్శ్వసన్కపిస్తత్ర న గ్లానిమధిగచ్ఛతి || 3

శ్రీమంతుడు, శ్రేష్ఠమైన వేగము (లేక గొప్ప పరాక్రమము) కలవాడగు హనుమంతు డట్లు నూరు యోజనముల వెడలుపు కల సముద్రము దాటియు, కొంచెమైనను నిట్టూర్చలేదు. ఆయాసపడలేదు.

శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి |
కిం పునస్సాగరస్యాన్తం సంఖ్యాతం శతయోజనమ్ || 4

“వందలాది యోజనములు కూడ దాటగల నాకు నూరు యోజనముల దూరమే యున్న యీ సాగరము దాటుటెంత” అని హనుమ తలంచెను.

స తు వీర్యవతాం శ్రేష్ఠః ప్లవతామపి చోత్తమః |
జగామ వేగవాన్లంకాం లంఘయిత్వా మహోదధిమ్ || 5

పరాక్రమశాలులు, ఎగురుటలో సమర్థులగు వానరులలో మేటియగు హనుమంతుడు గొప్ప వేగంగా మహాసముద్రమును దాటి లంకను చేరెను.

శాద్వలాని చ నీలాని గన్ధవన్తి వనాని చ |
గణ్డవన్తి చ మధ్యేన జగామ నగవన్తి చ || 6

శైలాంశ్చ తరుసంఛన్నాన్వనరాజీశ్చ పుష్పితాః |
అభిచక్రామ తేజస్వీ హనుమాన్ప్లవగర్షభః || 7

వానరశ్రేష్ఠుడు, తేజశ్శాలియగు హనుమంతుడు నల్లని లేత పచ్చికపట్టులను, మంచి వాసనలు గుబాళించు అడవులను, పెనురాలతో కూడి, నడుమ ప్రశస్తవృక్షములు కల వనములను దాటి, చెట్లతో నిండిన కొండలను, పూచిన వనసమూహములను గడచి ముందునకు పోయెను.

స తస్మిన్నచలే తిష్ఠన్వనాన్యుపవనాని చ |
స నగాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజః || 8

ఆ వాయుపుత్రుడు లంబగిరిపై నిలిచి అడవులను, పూదోటలను చూచుచు, త్రికూట జల శిఖరమున లంకానగరమును తిలకించెను.

సరలాన్కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ |
ప్రియాళాన్ ముచుళిన్దాంశ్చ కుటజాన్కేతకానపి || 9

ప్రియంగూన్గన్ధపూర్ణాంశ్చ నీపాన్సప్తచ్ఛదాం స్తథా |
అసనాన్కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్ || 10

పుష్పభారనిబద్ధాంశ్చ తథా ముకుళితానపి |
పాదపాన్విహగాకీర్ణాన్ పవనాధూతమస్తకాన్ || 11

హంసకారండవాకీర్ణా వాపీః పద్మోత్పలాయుతాః |
ఆక్రీడాన్వివిధాన్రమ్యాన్వివిధాంశ్చ జలాశయాన్ || 12

సంతతాన్వివిధైర్వృక్షైః సర్వర్తుఫలపుష్పితైః |
ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః || 13

ఆ హనుమంతు డచట చక్కగా పూసిన సరళవృక్షములను, కొండగోగులను, ఖర్జూరపు చెట్లను, మోరటచెట్లను, నిమ్మచెట్లను, కొండమల్లెచెట్లను, మొగలిచెట్లను, సుగంధము గల పిప్పలి చెట్లను, మంకెన చెట్లను, ఏడాకుల అరటులను, వేగిసచెట్లను, దేవకాంచన వృక్షములను పూచిన గన్నేరు చెట్లు, పూలబరువునకు కొంచెము వంగినవి, మొగ్గలు తొడిగినవి, పక్షులతో నిండినవి, గాలికి కదలాడు కొమ్మల కొనలు కలవి అగు చెట్లను, హంసలు కారండవము లను పక్షులు వ్యాపించియుండగా, తామరలతో కలువలతో వ్యాపించియున్న పెద్ద బావులను, పలువిధములగు జన సామాన్య యోగ్యములగు సుందర క్రీడాస్థానములను, సర్వర్తువులలో లభించు పండ్లతో, పూలతో శోభిల్లు పలుచెట్లతో వ్యాప్తమైన రాజవిహారయోగ్య సుందరోద్యానములను, వివిధ సరోవరములను చూచెను.

సమాసాద్య చ లక్ష్మీవాఁల్లంకాం రావణపాలితామ్ |
పరిఖాభిః సపద్మాభిః సోత్పలాభిరలంకృతామ్ || 14

సీతాపహరణార్థేన రావణేన సురక్షితామ్ |
సమన్తాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః || 15

కాంచనే నావృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీమ్ |
గృహైశ్చ గ్రహసంకాశైః శారదామ్బుదసన్నిభైః || 16

పాండురాభిః ప్రతోలీభిరుచ్చాభిరభిసంవృతామ్ |
అట్టాలకశతాకీర్ణాం పతాకాధ్వజమాలినీమ్ || 17

తోరణైః కాంచనైర్దివ్యైర్లతాపంక్తివిచిత్రితైః |
దదర్శ హనుమాఁల్లంకాం దివి దేవపురీమివ || 18

అట్లు ప్రశస్తమగు కాంతితో విలసిల్లు హనుమంతుడు, రావణుడు పాలించు లంకను చేరెను. ఆ లంకాపురి చుట్టును గల అగడ్తలు తామరలు, కలువలతో విలసిల్లు చుండెను. సీత నపహరించుకొని వచ్చిన రావణుడు, పెద్ద పెద్ద విండ్లు ధరించి నలు దిక్కులందు తిరుగాడు రాక్షసుల నా లంకకు కావలి యుంచెను. ఆ మహానగరము బంగారుపూతతో కూడిన ప్రాకారములతో సుందరముగ నుండెను. గ్రహములవలెను, శరత్కాలపు మేఘముల వలెను అచటి గృహములు ఉన్నతములు, ప్రకాశమానములై యుండెను. వీధులు గృహసంబంధముచే ఉన్నతములు, ధవళములై కన్పట్టెను. నూర్లకొలది కోటబురుజులతో, పతాకలతో, ధ్వజములతో ఆ నగరము వెలుగొందుచుండెను. బంగారు వికారములు, శ్రేష్ఠములు, తీగెల వంటి రేఖలు చిత్రింపబడిన ద్వారప్రదేశములతో కూడి స్వర్గమున అమరావతివలె నున్న యా నగరమును హనుమంతుడు చూచెను.

గిరిమూర్ధ్ని స్థితాం లంకాం పాండురైర్భవనైః శుభైః |
దదర్శ స కపిశ్రేష్ఠః పురమాకాశగం యథా || 19

తెల్లని శుభకరములగు గృహములతో పర్వతశిఖరముపై ఆకాశమును తాకుచున్నట్లు మహోన్నతమై విలసిల్లు లంకను హనుమ దర్శించెను.

పాలితాం రాక్షసేన్ద్రేణ నిర్మితాం విశ్వకర్మణా |
ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్పురీమ్ || 20

విశ్వకర్మనిర్మితమై రావణుడు పరిపాలించుచున్న ఆ పట్టణము కొండకొనపై నుండుటచే ఆకాశమున తేలుచున్నటులుండగా హనుమ చూచెను.

వప్రప్రాకారజఘనాం విపులాంబునవాంబరామ్ |
శతఘ్నీశూలకేశాన్తామట్టాలకవతంసకామ్ || 21

మనసేవ కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణా |
ద్వారముత్తరమాసాద్య చింతయామాస వానరః || 22

కోటగోడల కాధారముగ నిర్మించిన తిన్నెలు కటిప్రదేశముగా గలది, అగడ్తజలములే నూతన వస్త్రములుగా గలది, శతఘ్నులు (ఇనుపముండ్లు గల ఆయుధములు) శూలములు వెండ్రుకల మొనలుగా గలది, కోట బురుజులే కర్ణాభరణములుగా గలదియు నై, విశ్వకర్మ యే నిర్మించినను, వైభవమునుబట్టి ఎవ్వడో మహానుభావుడు సంకల్పమాత్రముననే సృజించినట్టిది వలె నున్న లంకానగరపు ఉత్తరద్వారమునకు చేరిన హనుమ సీత నెట్లు వెదకుటా యని ఆలోచింప సాగెను.

కైలాసశిఖరప్రఖ్యామాలిఖన్తీమివామ్బరమ్ |
డీయమానామివాకాశముచ్ఛ్రితైర్భవనోత్తమైః ||23

సంపూర్ణాం రాక్షసైర్ఘోరైర్నాగైర్భోగవతీమివ |
అచిన్త్యాం సుకృతాం స్పష్టాం కుబేరాధ్యుషితాం పురా || 24

దంష్ట్రిభిర్బహుభిః శూరైః శూలపట్టిసపాణిభిః |
రక్షితాం రాక్షసైర్ఘోరైర్గుహామాశీవిషైరివ || 25

తస్యాశ్చ మహతీం గుప్తిం సాగరం చ నిరీక్ష్య సః |
రావణం చ రిపుం ఘోరం చిన్తయామాస వానరః || 26

కైలాసపర్వతశిఖరమువలె మహోన్నతమై ఆకాశము నొఱయుచున్నదివలె నొప్పుచు ఉన్నతములైన మహాభవనములచే ఆకాశమున కెగురుచున్నట్లు కనుపించుచు, సర్పములతో పాతాళము వలె భీకరులైన రాక్షసులతో కూడి ఊహింపరానిదై, చక్కని నిర్మాణము కలిగి, చూడ చక్కనై, పూర్వము కుబేరుని నివాసమై, సర్పములచే కాపాడబడు గుహవలె కోఱలుగలిగి శూలములు అడ్డకత్తులు చేత ధరించిన శూరులు, భయంకరులగు రాక్షసుడు లనేకులు కాపాడుచున్న లంకను చూచి, దానిని రాక్షసులు కట్టుదిట్టముగా రక్షించుచుండుటను గమనించి దాని చుట్టును దాటరాని సముద్రమును పరికించి, రావణుడు భీకరశత్రు వగుటను ఊహించి హనుమంతు డిట్లు తలపోసెను.

ఆగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్థకాః |
నహి యుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైరపి || 27

‘వానరు లిచటకు వచ్చినను వారి రాక నిష్ఫలమే యగును. ఈ లంక దేవతలకైనను యుద్ధమున జయింపరానిది.’

ఇమాం తు విషమాం దుర్గాం లంకాం రావణపాలితామ్ |
ప్రాప్యాపి స మహాబాహుః కిం కరిష్యతి రాఘవః || 28

మిక్కిలి నిమ్నోన్నతమై, అన్యులకు చొరరాని రావణపాలితమగు ఈ లంకను చేరి మహాభుజుడగు రాముడు (ఒకే బాణంతో సాలములను-గిరిని-పాతాళమును కొట్టిన వాడయినను) మాత్ర మేమి చేయగలడు?

అవకాశో న సాన్త్వస్య రాక్షసేష్వభిగమ్యతే |
న దానస్య న భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే || 29

రాక్షసులు ఆసురస్వభావులు. వారికడ సాంత్వము (బుజ్జగింపుమాట) చెల్లదు. పోనీ దానమిత్తుమా యన్నను వారు మిగుల సంపన్నులుగాన ధనమునకు వశపడరు. బలదర్పితులు గాన భేదమున కవకాశము లేదు. బుద్ధి, పరాక్రమము కలవారు గాన యుద్ధముచేతను నిగ్రహింప రానివారు.

చతుర్ణామేవ హి గతిర్వానరాణాం మహాత్మనామ్ |
వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః || 30

ఈ లంకకు రాగలుగుట వాలిపుత్రుడగు అంగదునకు, నీలునకు, ధీమంతుడగు మా రాజు సుగ్రీవునకు, – ఈ మహాత్ములు ముగ్గురికినీ, నాకునూ – ఈ నలుగురు కపులకే సాధ్యము.

యావజ్జానామి వైదేహీం యది జీవతి వా నవా |
తత్రైవ చిన్తయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజామ్ || 31

సీతాదేవి బ్రతికియున్నదో లేదో మొదట తెలిసికొని, పిమ్మట ఆమెను దర్శించి, కర్తవ్య మాలోచించెదను.

తతః స చిన్తయామాస ముహూర్తం కపికుంజరః |
గిరిశృంగే స్థితస్తస్మిన్రామస్యాభ్యుదయే రతః || 32

మఱల రాముని అభ్యుదయమం దాసక్తి కలవాడై కపి శ్రేష్ఠుడు మారుతి యా పర్వతశిఖరమున నిలిచి యొక్క క్షణ మిట్లాలోచించెను.

అనేన రూపేణ మయా న శక్యా రక్షసాం పురీ |
ప్రవేష్టుం రాక్షసైర్గుప్తా క్రూరైర్బలసమన్వితైః || 33

క్రూరులు, బలవంతులగు రాక్షసులు ఈ నగరమును కాపాడుచున్నారు. నే నీ రూపముతోనే ఇందు ప్రవేశింప దగదు.

ఉగ్రౌజసో మహావీర్యా బలవన్తశ్చ రాక్షసాః |
వంచనీయా మయా సర్వే జానకీం పరిమార్గతా || 34

ఈ రాక్షసులు ప్రచండమగు తేజముకలవారు. మహాబలపరాక్రమసంపన్నులు. నేను సీతాదేవిని వెదకునపుడు వీరిని వంచింపక తప్పదు.

లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీ మయా |
ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్ || 35

నేను కనుపింతునా రాక్షసులు పట్టుకొందురు. కనుపించకుండునంత చిన్న రూపము ధరింతునా, అంత చిన్న రూపముతో లంకనెల్ల వెదకుట కష్టము. కావున చూడదగినంత పెద్దదిగాని, అగపడనంత చిన్నదిగాని కాక మధ్యమరూపము దాల్చి రాత్రికాలమున లంకలో ప్రవేశించి యీ మహాకార్యమును సాధించుట యుక్తము.

తాం పురీం తాదృశీం దృష్ట్వా దురాధర్షాం సురాసురైః |
హనుమాంశ్చిన్తయామాస వినిశ్చిత్య ముహుర్ముహుః || 36

అట్లు దేవదానవుల కెవ్వరికిని ఎదిరింపరానట్టి దుర్భేద్యనిర్మాణము గల ఆ లంకానగరమును చూచి హనుమంతుడు, సీతాన్వేషణ మెట్లు చేయవలెనా యని మాటిమాటికి నిశ్చయించుకొని, ఇట్లాలోచించెను.

కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజామ్ |
అదృష్టో రాక్షసేన్ద్రేణ రావణేన దురాత్మనా || 37

దురాత్ముడు రాక్షసరాజు రావణుని కగపడక ఏ యుపాయముచే జనకమహారాజు కూతురు సీతను దర్శింపగలను?

న వినశ్యేత్కథం కార్యం రామస్య విదితాత్మనః |
ఏకామేకశ్చ పశ్యేయం రహితే జనకాత్మజామ్ || 38

జగద్విదితుడగు రాముని కార్యము నశింపకుండు టెట్లు? సీతాదేవి ఒంటరిగా నుండగా నేను ఏకాంతమున ఆమె నెట్లు చూతును?

భూతాశ్చార్థా విపద్యన్తే దేశకాలవిరోధితాః |
విక్లబం దూతమాసాద్య తమః సూర్యోదయే యథా || 39

దాదాపు సిద్ధప్రాయములు (ఫలింపనున్నవి) అగు పనులు కూడ అవివేకియగు దూతచేతిలో పడి, దేశకాలవిరోధము నొంది (ప్రదేశం, కాలము అనుకూలించక) సూర్యోదయముచే 38 చీకట్లు నశించిన చందమున చెడిపోవును.

అర్థానర్థాన్తరే బుద్ధిర్నిశ్చితాఽపి న శోభతే |
ఘాతయన్తి హి కార్యాణి దూతాః పణ్డితమానినః || 40

రాజు, మంత్రులు కూడి కార్యాకార్యములకు సంబంధించి ఇది భార్య మిది అకార్యమని నిర్ణయించినను, ఆ నిశ్చయరూపమగు బుద్ధి, అవివేకి యగు దూతకడ శోభిల్లదు. తాము పండితులమని (తమ కన్నియు తెలియునని) భావించి అట్టి దూతలు పాటలు పాడు చేయుదురు.

న వినశ్యేత్కథం కార్యం వైక్లబ్యం న కథం భవేత్ |
లంఘనం చ సముద్రస్య కథం ను న వృథా భవేత్ || 41

రామకార్యము చెడకుండు టెట్లు? నే నవివేకిని కాకుండు టెట్లు? నే నీ దుస్తరసముద్రము దాటుట ఫలవంత మగుట ఎట్లు?

మయి దృష్టే తు రక్షోభీ రామస్య విదితాత్మనః |
భవేద్వ్యర్థమిదం కార్యం రావణానర్థమిచ్ఛతః || 42

నన్ను రాక్షసులు చూచిరేని రావణుని వినాశము కోరు మహాత్ముడగు రాముని కార్యము నిష్ఫలమగును.

న హి శక్యం క్వచిత్స్థాతు మవిజ్ఞాతేన రాక్షసైః |
అపి రాక్షసరూపేణ కిముతాన్యేన కేనచిత్ || 43

ఈ రాక్షసులకు తెలియకుండా ఎచటనైన ఉండుట సాధ్యము కాదు. (వాళ్ళు తెలిసి కొనగలరు). అట్టిచో మరి ఏ రూపమున నున్నను తెలిసికొనగలరని వేరుగా చెప్పవలెనా?

వాయురప్యత్ర నాజ్ఞాత శ్చరేదితి మతిర్మమ |
న హ్యస్త్యవిదితం కించిద్రాక్షసానాం బలీయసామ్ || 44

రాక్షసులకు తెలియక వాయువు గూడ సంచరింపదని నా యభిప్రాయము. బలీయులగు రాక్షసులకు తెలియని దేదియు లేదు.

ఇహాహం యది తిష్ఠామి స్వేన రూపేణ సంవృతః |
వినాశముపయాస్యామి భర్తు రర్థశ్చ హీయతే || 45

నేను సహజమగు నా పెద్దరూపముతో నెచటనైన దాగియుందునా తప్పక నశించెదను. నా స్వామి కార్యమును చెడును.

తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాం గతః |
లంకామధిపతిష్యామి రాఘవ స్యార్థసిద్ధయే || 46

కావున నేను చిన్నరూపు దాల్చి రాముని సీతాన్వేషణరూపమగు కార్యము సఫలమగు కొఱకు రాత్రివేళ లంకలో ప్రవేశింతును.

రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసదామ్ |
విచిన్వన్భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజామ్ || 47

ఇతి సంచిన్త్య హనుమాన్సూర్యస్యాస్తమయం కపిః |
ఆచకాంక్షే తదా వీరో వైదేహ్యా దర్శనోత్సుకః || 48

సామాన్యులకు చేరరాని లంకానగరమును రాత్రివేళ ప్రవేశించి, రావణుని భవనమంతయు వెదకి సీతాదేవిని కనుగొనెదను. వీరుడగు హనుమంతుడిట్లు తలచి, సీతాదేవిని చూడవలెనను కుతూహలము కలవాడై, సూర్యాస్తమయ మెప్పుడగునా యని వేచియుండెను.

సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః |
వృషదంశకమాత్రః సన్బభూవాద్భుతదర్శనః || 49

సూర్యుడు డస్తమించి రాత్రి అగుటతోడనే హనుమ తన రూపమును సంకోచపఱచి, చూచువారి కాశ్చర్యము కలిగించుచు పిల్లియంత చిన్నరూపము దాల్చెను.

ప్రదోషకాలే హనుమాంస్తూర్ణముత్ప్లుత్య వీర్యవాన్ |
ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్తమహాపథామ్ || 50

చీకటి పడగానే పరాక్రమశాలియగు హనుమంతుడు శీఘ్రమే ఎగిరి చక్కగా నిర్మింపబడిన పెద్ద పెద్ద రాజమార్గములు కల సుందరమగు లంకానగరమున ప్రవేశించెను.

ప్రాసాదమాలావితతాం స్తంభైః కాంచనరాజతైః |
శాతకుంభమయైర్జాలైర్గన్ధర్వనగరోపమామ్ || 51

సప్తభూమాష్టభూమైశ్చ స దదర్శ మహాపురీమ్ |
తలైః స్ఫటికసంకీర్ణైః కార్తస్వరవిభూషితైః || 52

బారులుగా నున్న మహాభవనములతో కూడినదై, బంగారము, వెండితో నిర్మింపబడిన స్తంభములు కలిగి, బంగారముతో నిర్మింపబడిన కిటికీలతో, గంధర్వనగరము వలె నున్నది ఏడంతస్తులు ఎనిమిదంతస్తులు గలిగి, స్ఫటికమణులు పొదిగిన నేలలు కలిగిన, బంగారం చే నలంకరింపబడిన మహాభవనములతో విలసిల్లు ఆ మహానగరమును హనుమంతుడు దర్శించెను.

వైడూర్యమణిచిత్రైశ్చ ముక్తాజాలవిభూషితైః |
తలైః శుశుభిరే తాని భవనాన్యత్ర రక్షసామ్ || 53

ఆ లంకలోని భవనములు వైడూర్యమణి చిత్రితములై యుండగా భూతలములు ముత్యాల ముగ్గులు నలంకరింపబడి యుండెను.

కాంచనాని చ చిత్రాణి తోరణాని చ రక్షసామ్ |
లంకాముద్ద్యోతయామాసుః సర్వతః సమలంకృతామ్ || 54

సువర్ణనిర్మితము లగుటచే విచిత్రములగు బహిర్ద్వారములు అంతటను సుందరముగ అలంకరింపబడిన ఆ రాక్షసుల లంకను మిక్కిలి ప్రకాశింపజేయుచుండెను.

అచిన్త్యామద్భుతాకారాం దృష్ట్వా లంకాం మహాకపిః |
ఆసీద్విషణ్ణో హృష్టశ్చ వైదేహ్యా దర్శనోత్సుకః || 55

హనుమయు సీతాదేవి నెప్పుడు దర్శింతునా యని యువ్విళ్లూరుచు, ఊహింప నలవి కానిది, అద్భుతరూపము గలది అగు లంకను చూచి దుఃఖితుడు, ఆనందించినవాడును అయ్యెను. (లంకానగరము దుష్ప్రవేశమగుటచే ఎట్లు ప్రవేశింపగలనా అని విషాదం అద్భుతముగ నుండుటచే హర్షము.)

స పాండురోద్విద్ధవిమానమాలినీం, మహార్హజామ్బూనదజాలతోరణామ్ |
యశస్వినీం రావణబాహుపాలితాం, క్షపాచరైర్భీమబలైః సమావృతామ్ || 56

సున్నము (వెల్ల) వేయబడిన ఉన్నతములైన ఏడంతస్తుల గృహములు వరుసగా గలది, విలువైన బంగారు వికారములగు కిటికీలు బహిర్ద్వారములు కలది, కీర్తిమంత మైనది, రావణుని బాహుబలముచే కాపాడబడినది, మహాబలులగు రాక్షసులతో కూడినదగు ఆ లంకానగరమును చూచి హనుమంతుడు విషాదమును, హర్షమును పొందెను.

చంద్రోఽపి సాచివ్యమివాస్య కుర్వం, స్తారాగణైర్మధ్యగతో విరాజన్ |
జ్యోత్స్నావితానేన వితత్య లోక, ముత్తిష్ఠతే నైకసహస్రరశ్మిః || 57

చంద్రుడును-సముద్రుడు, మైనాకుడు, సూర్యులవలె తానును ఆ హనుమంతునకు సహాయపడుచున్నట్లు చుక్కల నడుమ వెలుగుచు, తన వెన్నెలతో లోకమును ప్రకాశింప జేయుచు, వేలకొలది కిరణములతో ఉదయించెను.

శంఖప్రభం క్షీరమృణాలవర్ణ, ముద్గచ్ఛమానం వ్యవభాసమానమ్ |
దదర్శ చంద్రం స హరిప్రవీరః, పోప్లూయమానం సరసీవ హంసమ్ || 58

వానరవీరుడగు హనుమంతుడును శంఖము, పాలు తామరతూడులవలె ధవళకాంతితో ప్రకాశించుచు, సరస్సు నుండి ఎగురుతున్న హంసవలె ఆకాశమున పైపైకి పోవుచున్న చంద్రుని దర్శించెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే ద్వితీయః సర్గః ||
ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణమందు సుందరకాండ ద్వితీయ సర్గము సమాప్తము.

Follow us on Social Media