Bhavishya puranam in Telugu
భవిష్య పురాణం
ఈ పురాణ విషయంలో పండితులలో ఉన్నంత గందరగోళం వేరు ఏ పురాణం విషయంలో కూడా లేదు. రాబోయేకాలంలో జరుగబోయే వృత్తాంతాలను వివరించదలచిన పురాణం కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఇందువలన ఈ పేరును సార్థకం చేయటానికి ఆయా కాలాలలో పండితులు రాబోయే చరిత్ర అంటూ అనేక అర్వాచీన విషయాలను చేర్చటం జరిగింది. తత్ఫలితంగా ‘ఇంగ్రేజ’ అనే పేరుతో ఇంగ్లీషువారు భారతదేశం రావటం కూడా చెప్పబడింది. జ్వాలాప్రసాద్ మిశ్రా అనే పండితుడు తమ దగ్గర నాలుగు భవిష్య పురాణ లిఖిత ప్రతులున్నట్లు, ఒకదానితో మరొకదానికి అంతగా సంబంధం లేనట్లు తెలిపారట. ఇవి అన్నీ కలిపివేయగా ఏర్పడిన పురాణం ఈనాడు భవిష్యపురాణంగా ప్రచారంలో ఉన్నది. ఈ పురాణాన్ని నారద, అగ్ని, మత్స్య, వాయు పురాణాలు పేర్కొంటున్నవి. అందుచేత ఇది ప్రాచీన పురాణమేనని చెప్పటంలో ఏమాత్రం సందేహించవలసిన అవసరం లేదు. నారద పురాణాన్ని అనుసరించి ఇందులో అయిదు పర్వాలున్నాయి.
ఈ పురాణంలో సూర్యోపాసన విస్తృతంగా వర్ణించబడింది. శ్రీకృష్ణుని పుత్రుడైన సాంబునికి కుష్ఠురోగం సంప్రాప్తించగా దాని నివారణకోసం గరుత్మంతుడు శాకద్వీపం నుంచి బ్రాహ్మణులను తీసుకొనిరాగా వారు సూర్యోపాసనా విధానంచేత ఆ వ్యాధిని నయం చేశారని ఈ పురాణం తెలుపుతున్నది. సూర్యోపాసన రహస్యాలు, కలియుగంలో ఆవిర్భవించిన అనేక రాజుల వంశవర్ణన కూడా ఈ పురాణంలో విస్తృతంగా ఉన్నది. ఆ రాజుల చరిత్రను అధ్యయనం చేయటానికి ఈ భాగ అధ్యయనం చాలా ముఖ్యం. సృష్టి, స్థితి, లయలకు సంబంధించిన విషయాలు, ఆదిత్య చరిత్ర వర్ణన, పుస్తకములు వ్రాయుట లేక రచయితల లక్షణాలు, అన్ని సంస్కారాలు లేక కల్పాల వర్ణన, బ్రహ్మ, విష్ణు, శివుల మహిమ వర్ణన, ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే పురుషార్థాల చతుష్టయ వివరణ ఈ పురాణంలో ఉన్నది.
భవిష్య పురాణం ఐదు పర్వాలుగా విభజించబడింది. అవి –
- 1. బ్రహ్మ పర్వం
- 2. వైష్ణవ పర్వం
- 3. శైవ పర్వం
- 4. సౌరపర్వం
- 5. ప్రతి సర్గ పర్వం
ఈ మొత్తం అయిదు పర్వాలలోను 605 అధ్యాయాలు ఉన్నాయి. నారద పురాణానుసారం 14 వేల శ్లోకాలు, మత్స్యపురాణానుసారం 14,500 శ్లోకాలు ఇందులో ఉన్నాయి.
Bhavishya puranam in telugu pdf online. Bhavishya puranam is one of the Brahma puranam. You can find the Telugu purana books at Greater Telugu Absolutely Free.