Brahma puranam in Telugu
బ్రహ్మ పురాణానికి ‘ఆదిబ్రాహ్మ్యం’ అనే పేరు కూడా వ్యాప్తిలో ఉన్నది. పురాణాలలో ఉండవలసినవిగా చెప్పబడే సమస్త విషయాలు ఇందులో ఉన్నాయి. సృష్టి వివరణ తరువాత సూర్యవంశం, చంద్రవంశ రాజుల వృత్తాంతం అతి సంక్షిప్తంగా ఉన్నది. పార్వతీ వృత్తాంతం చాలా ఎక్కువగా దాదాపు పది (30 నుంచి 40 వరకు) అధ్యాయాలలో వర్ణించబడింది. మార్కండేయాఖ్యానం తరువాత గౌతమీ, గంగ, కృత్తికా తీర్థం, చక్రతీర్థం, పుత్రతీర్థం, యమతీర్థం, ఆపస్తంబ తీర్థం మొదలైన అనేక ప్రాచీన తీర్థ విశేషాలు గౌతమీ మాహాత్మ్యంలో భాగంగా (అధ్యాయాలు 70 నుండి 175) వివరించ బడ్డాయి. శ్రీకృష్ణ భగవానుడి చరిత్ర 180 నుంచి 212వ అధ్యాయం వరకు 326 అధ్యాయాలలో విస్తృతంగా వర్ణించబడింది. శ్రీకృష్ణుని చరిత్ర అంతా భాగవతం దశమ స్కంధంలో చెప్పినట్లే ఉన్నది. భేదం ఏమాత్రం లేదు. ఇంతేకాకుండా ఈ పురాణంలో జీవుడు మరణించిన తరువాత పొందే వివిధ అవస్థల వర్ణనకూడా అనేక అధ్యాయాలలో కన్పిస్తుంది. అయితే పురాణాలలో మనకు సహజంగా కనపబడే భూగోళ వర్ణన అంత ఎక్కువగా దీనిలో కనిపించదు. కానీ ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న కోణాదిత్య (కోణార్క) అనే పేరుగల తీర్థ వివరణ దానికి సంబంధించిన సూర్య ఆరాధన గురించి వివరణ ఈ పురాణంలోని ప్రత్యేకత. సూర్యమహిమ, ఆయన ప్రసరించే శక్తిని గురించిన వివరణ ఆరు అధ్యాయాలలో ఉన్నది.
ఈ పురాణంలో దాదాపు పది అధ్యాయాలలో సాంఖ్యయోగ వివరణ చాలా విస్తృతంగా (234 నుండి 244) ఉన్నది. కరాళజనకుడు ప్రశ్నించటం వలన వశిష్ఠ మహర్షి చేత మహిమాన్మితమైన సాంఖ్యయోగ సిద్ధాంతాలు వివరించబడ్డాయి. ఇక్కడ గమనించ వలసిన ముఖ్య విషయం ఒకటి ఉన్నది. తరువాత కాలంలో ప్రచారంలోకి వచ్చిన సాంఖ్య యోగ విషయాలు అనేకం ఇందులో చెప్పబడిన ముఖ్య సాంఖ్య విషయాలతో విభేదిస్తున్నాయి. అంతకుపూర్వపు సాంఖ్యంలో తత్త్వాలు 25 అని చెప్పబడగా, ఇందులో మూర్ధస్థానీయంగా 26వ తత్త్వం యొక్క వివరణ ఉన్నది. పౌరాణిక సాంఖ్యంలో నిరీశ్వర వాదం ప్రతిపాదితంకాదు. ఇందులో జ్ఞానంతోపాటు భక్తికి కూడా విశిష్టమైన స్థానం ఇవ్వబడింది. ఈ పురాణంలోని ఇంకొక విశేషమేమంటే ఇందులోని కొన్ని అధ్యా యాలు వ్యాస మహాభారతంలోని పన్నెండవదైన శాంతిపర్వంలోని కొన్ని అధ్యాయాలతో అక్షరం అక్షరం ఏకీభవిస్తున్నవి. ధర్మమే పరమ పురుషార్థమని ఈ పురాణం ఉద్ఘోషి స్తున్నది.
ధర్మేమతిర్భవతు వః పురుషోత్తమానాం
(బ్ర.పు. 255-35)
సహ్యేక ఏవ పరలోకగతస్య బంధుః
అర్ధా: స్త్రియశ్చ నిపుణైరపి సేవ్యమానా
నైవ ప్రభావ ముపయంతి న చ స్థిరత్వమ్
పురుషోత్తములైన వారి కందరకు ధర్మమునందే బుద్ధి స్థిరమగుగాక. పరలోకము నకు పోయినప్పుడు అది ఒక్కటియే బంధువు కాగలదు. అర్థకామములను రెండింటిని ఎంత జాగ్రత్తగలవారుగా సేవించినను వాని వలన లభించు ఫలము స్థిరములు కావు. అవి ఎట్టి సత్ఫలములను చూపలేవు.
ఇది రెండు భాగాలుగా చేయబడింది. 1. పూర్వభాగం, 2. ఉత్తర భాగం. రెండు భాగాలలోనూ కలిపి 245 అధ్యాయాలున్నాయి. నారదపురాణాన్ని అనుసరించి ఇందులో పదివేల శ్లోకాలు ఉండగా మత్స్య పురాణానుసారము 13,000 శ్లోకాలు ఉన్నాయి.