Deepavali
Deepavali
దీపావళి
జ్ఞానం, సంపద, శాంతి – ఈ మూడింటికీ ప్రతీకగా దీపాన్ని భావిస్తారు. సకల దేవతలు దీపం లో నిక్షిప్తమై ఉంటారన్నది శాస్త్ర వచనం. దేవీ దేవతలకు అందించే షోడశోపచారాల్లో ప్రధానమైంది దీపారాధన. హోమాది కార్యాల్లో, ముక్కోటి దేవతలకు వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం.
“దీపేన సాధ్యతే సర్వం” అంటే దీపంతో దేనినైనా సాధించవచ్చు అని రుషుల వచనం.
దీపం ప్రసరించే వెలుగు పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ అంటే ఈ సకల చరాచర జగత్తును నడిపించే అనంతమైన అద్భుత శక్తి! అందువల్లే ఆ దీపం మనోవికాసానికీ, సద్గుణ సంపత్తికీ, ఆనంద ఐశ్వర్యాలకు ప్రతిరూపం! గ్రహ దోషాలు తొలగాలన్నా, ఆయువు పెరగాలన్నా, అభీష్టాలు సిద్ధించాలన్నా, దీపాలను వెలిగించి నమస్కరిస్తే చాలునని పురాణ గ్రంథాల వచనం.
వేదన కలిగించే స్థితికి ‘నరకం’ అని నిర్వచనం. రోగ, భయ, దుఃఖ దారిద్ర్యాలు లేని జీవితం ఆనందమయం. నరకాన్ని పోగొట్టి ఆనందాన్నిచ్చే సంతోష కాంతి సాధనం, దీపావళి పర్వం. దీపావళి అంటే ‘దీపాల వరుస’ అని అర్థం.
దీపావళీ అమావాస్యకు అటూ ఇటూ ఉన్న నరక చతుర్దశి, కార్తీక పాడ్యమి – ఈ మూడు రాత్రులూ దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతోంది.
కొన్ని సాంప్రదాయాల ప్రకారం దీపావళిని ఐదు రోజుల వేడుకగా జరుపుకుంటారు.
ఈ ఐదు రోజులూ ఐశ్వర్యానికి అధిదేవత అయిన మహాలక్ష్మిని పూజించడం, స్థిర సంపద కోసం కుబేర పూజ, జగదంబ కళా స్వరూపార్చన, పితృదేవతా స్మరణ మరియు యముడి స్మరణలతో దివ్యంగా సాగుతాయి.
శుచి, సద్గుణం, సదాచార భావాలకు ప్రతీక అయిన లక్ష్మీదేవి ఆ భావాలతో ఆరాధించేవారిని అనుగ్రహిస్తుంది. దుర్భావాలనే అలక్ష్మిని తొలగించేందుకు వెలుగు రవ్వలను జ్వలింపచేస్తారు. అలాగే, దీప జ్యోతుల వల్ల కాంతిశరీరులైన దేవతా శక్తులు ఆహ్వానితులై అనుగ్రహిస్తారనే విశ్వాసం కూడా ఉంది.
పితృదేవతలు ఎవరైనా చీకటి లాంటి నరకంలో ఉండిపోతే వాళ్లందరికీ స్వర్గానికి దారి చూపిస్తాయట మనం వెలిగించే దీపాలు.
కన్నడ రాష్ట్రంలోని మైసూరు, బెంగుళూరులో దీపావళి నాడు ఒకే ఒక దీపం వెలిగించి, ధాన్యం నింపిన పళ్లెంలో ఆ దీపాన్ని పెట్టి భూ దేవిని పూజిస్తారు. పూజ పూర్తి కాగానే దీపాన్ని ఇంటి బయట, లోపల, మూల మూలలా ఆ వెలుగు పడేలా తిప్పి, తిరిగి మళ్ళీ దేవుడి దగ్గర ఉంచుతారు. అలా దీపం చూపించిన చోటంతా ఎలా వెలుగు నింపుతుందో, అలాగే మన మనస్సులో ఏ మాత్రం చెడు భావాలు ఉన్నా అవన్నీ పూర్తిగా పోయి స్వచ్ఛంగా మంచి భావాలు పెరగాలని దేవుణ్ణి ప్రార్థించడమే ఈ ప్రక్రియ.
మనం జరుపుకునే పండగల్లో ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సామాజిక అంశాలు మిళితమై ఉంటాయి. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో అంటే భారతీయ కాలమానం ప్రకారం వర్ష ఋతువు ముగిసిపోయి శరదృతువు మొదట్లో ఈ దీపావళి పండుగ వస్తుంది. అప్పటివరకూ పడిన వానలతో నేల, గాలి, చెట్లు తేమతో నిండిపోయి రకరకాల పురుగులు, క్రిమికీటకాదులకు ఆవాసంగా మారిన మన పరిసరాలు రకరకాల జబ్బులకు కారణంగా ఉంటాయి. దీపావళి పండుగ నాడు మనం వెలిగించే దీపాలు, బాణాసంచాల వెలుగుకు, పొగకు, శబ్దానికి క్రిమి కీటకాదులు నశించి, వాతావరణం చక్కగా మారి, మన ఆరోగ్యానికి ఏ విధమైన కీడు కలగదు. అలాగే, మనమందరమూ కూడా ఇంగిత జ్ఞానంతో, పెరుగుతున్న జనాభా దృష్ట్యా, పర్యావరణ హితం కోసం, పరిమిత సంఖ్యలోనే బాణాసంచాను వినియోగించవలసి ఉంది.
దీపావళి నాడు చేసే లక్ష్మి పూజకు సంబంధించిన వృత్తాంతం గురించి తెలుసుకుందాం – ఒకరోజు దేవలోకానికి వచ్చిన దూర్వాస మహర్షి దేవేంద్రుడు చేసిన గౌరవమర్యాదలకు సంతోషించి గొప్ప మహిమగల హారమొకటి బహూకరించాడట. దాని విలువ తెలియని ఇంద్రుడు ఆ హారాన్ని తన వాహనమైన ఐరావతానికి వేశాడట. ఆ ఐరావతము దానిని కాళ్ళతో తొక్కి నుజ్జు చేసింది. అది చూసిన మహర్షికి విపరీతమైన కోపం కలిగి దేవేంద్రుణ్ణి శపిస్తాడు. సర్వాధికారాలతో పరిపాలన చేస్తున్న దేవేంద్రుడు ఆ శాప ప్రభావంతో కటిక దరిద్రుడుగా మారిపోతాడు. దేవాదిదేవుడైన శ్రీ మహా విష్ణువు దగ్గర తన పరిస్థితిని మొరపెట్టుకుంటాడు. దయతలచిన మహావిష్ణువు ఇంద్రుడికి ఒక సూచన చేస్తాడు. అదేమిటంటే దీపావళి సమయంలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి దాన్ని మహాలక్ష్మి రూపంగా అర్చించమంటాడు శ్రీహరి. అలా చేయడంతో ఇంద్రుడు సిరిసంపదలు తిరిగి పొందాడట. అప్పుడు జగన్మాత లక్ష్మీ దేవితో ఇంద్రుడు ఇలా అంటాడు – “అమ్మా! ఇంత మహిమగల నువ్వు ఒక్క విష్ణుమూర్తి దగ్గరే ఉండటం న్యాయమా! జనులందరినీ అనుగ్రహించు తల్లీ” అని కోరాడట. అప్పుడామె మునులకు మోక్షలక్ష్మిగా, సిరిసంపదలు కోరేవారికి ధనలక్ష్మిగా, సంతానం కావాలనుకునే వారికి సంతానలక్ష్మిగా, విద్యను కోరుకునే బుద్ధిమంతులకు విద్యాలక్ష్మిగా, విజయం కాంక్షించే కార్య శూరులకు విజయలక్ష్మిగా తప్పక కరుణిస్తాను అని అనుగ్రహించిందట. అప్పటి నుంచే అమ్మవారు అష్టలక్ష్మీ రూపాల్లో కొలువయిందట. అందుకే దీపాలు పెట్టి అమ్మను పూజించిన వారింట సకల సంపదలూ కొలువవుతాయన్నది పురాణ వాక్కు. లక్ష్మీ పూజ ప్రభావం దీపావళి రోజున మరింత శక్తివంతంగా, సత్వర ఫలితంగా ఉంటుంది గనుక ఈ లక్ష్మి పూజను తప్పక చేసుకోవాలి.
దీపావళి కి సంబంధించి ఎన్నో పురాణ, చారిత్రక ఘట్టాలు ప్రచారంలో ఉన్నాయి –
వామనావతారంలో
మహావిష్ణువు బలిచక్రవర్తి అహంకారాన్ని అణచడం, శ్రీ రామావతారంలో చక్రవర్తిగా రాజ్య
పట్టాభిషేకం జరగటం, కృష్ణావతారంలో సత్యా సమేతుడై నరకాసురుని సంహరించడం, రాజా
విక్రమార్కుని పేరిట శకం ఏర్పడటం.. ఇలా ఎన్నో కథలు దీపావళి పర్వదినం తో ముడిపడి
ఉన్నాయి.
అయితే,
సత్యభామా శ్రీకృష్ణులు నరకాసుర సంహారం చేసిన సందర్భమే దీపావళి కథగా ప్రాచుర్యంలో ఉంది.
భక్త ప్రహ్లాదుని తండ్రి అయినా హిరణ్యకశిపుడికి ఒక సోదరుడు ఉన్నాడు. వాడి పేరు హిరణ్యాక్షుడు. వాడు బ్రహ్మ దేవుడు ఇచ్చిన వరాలతో రెట్టించిన అహంకారంతో ప్రకృతికి ఆధారమైన భూమిని ఒక చాపలా చుట్టేసి ఒంటి చేత్తో తీసుకొని వెళ్ళిపోతుంటే భూమాత విలవిల్లాడి పోవటం చూసిన శ్రీ మహావిష్ణువు విపరీతమైన కోపంతో ఆది వరాహ రూపం ధరించి ఆ రాక్షసుణ్ణి సంహరించి భూదేవిని కాపాడాడు. ఆ ఆనంద సమయంలో దేవతలు, దేవర్షులు, గంధర్వులు అందరూ ఆదిదేవునీ, భూదేవినీ, ప్రకృతీ పురుషులుగా చూడముచ్చట పడి ఆ కోరికను మన్నించ వలసిందిగా స్వామిని వేడుకుంటారు. శ్రీ మహావిష్ణువు వాళ్ల కోరికను మన్నించాడు. ఆ ఫలితమే నరకాసుర జననం.
ద్వాపరయుగంలో నరకుడి ఆగడాలు విపరీతమయ్యాయి. ఒక్క భూమినే కాదు పదునాల్గు భువనాలనూ శాసిస్తూ, జనాన్ని హింసిస్తూ జీవించసాగాడు. రాజుల్ని చంపి వారి పిల్లల్ని బంధించేవాడు. అలా పదహారువేల మంది కన్యలను తెచ్చి చెరసాలలో ఉంచాడు. తల్లి చేతిలో తప్ప చావు లేదన్న బ్రహ్మవర గర్వితుడయిన నరకుడు దేవతల జోలికి వెళ్లడమూ మొదలు పెట్టాడు. దేవతల తల్లి అదితి కుండలాలను తస్కరించాడు. సురులు సంచరించే మణి పర్వతాన్ని ఎత్తుకుపోయాడు. చివరికి వరుణుడి ఛత్రాన్నే దొంగిలించాడు. వాడి ఆగడాలు పెచ్చుమీరుతుండటంతో దేవతలంతా శ్రీ మహావిష్ణు స్వరూపుడయిన కృష్ణపరమాత్మను శరణు వేడారు. అసుర సంహారం తప్పక చేస్తానని మాటిచ్చాడు శ్రీకృష్ణుడు. అదే సమయంలో పక్కనున్న సత్యాదేవి నేనూ వస్తానంది. అంతా ఆయన లీలే కాబట్టి సరేనన్నాడు ఆ పరమాత్మ. భూదేవి యొక్క అంశమే సత్యభామ!
శ్రీకృష్ణ నరకాసురల పోరు సాగుతుండగా ఒకానొక ఘడియ లో నరకుడి బాణానికి మూర్ఛపోయినట్టు నటించాడు ఆ నిరంజనుడు. మరు నిమిషంలోనే సత్యభామ ధనస్సు చేతబట్టింది. అంతే ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టిన ఆ నరకుడు మూడు క్షణాల్లో ఆ ప్రళయ మూర్తి పాదాల చెంత నేలకొరిగాడు. ‘నరక’ అనే పదానికి అర్థం చీకటి, ‘సత్య’ అంటే వెలుగు. వెలుగు చేతిలో చీకటి ఓడిపోయింది. చరిత్ర నిలిపిన ఈ సత్యభామా సత్ ప్రబోధమే ఒక భవ్య ఆదర్శం.
నరకాసుర వధతో దేవతలంతా “దీపాలు వెలిగించండి” అంటూ ఆనంద నాదాలు చేశారు. అన్ని లోకాలు ప్రకాశవంతం అయ్యాయి. ఆ జ్ఞానజ్యోతి జనమందరిలో వెలుగులు నింపాలనే నరకాసుర వధనాడే దీపావళి పండుగను జరుపుకుంటాం. ఈ రోజు ఒక్క భూమి మాత్రమే కాదు పద్నాలుగు భువనాలూ దివ్యకాంతులతో వెలిగిపోతాయట.
పండగ రోజుల్లో మనం, ఉదయ కాలంలో చేసే అభ్యంగనస్నానం అమంగళాలను తొలగిస్తే, సాయంత్రం చేసే దీపారాధన మంగళాలను ఆహ్వానిస్తుంది. మన మనస్సులోని అజ్ఞానాంధకారాన్ని తొలగించాలంటే జ్ఞాన దీపాన్ని వెలిగించాలి. అధర్మంపైన ధర్మం సాధించిన విజయానికి, చెడు మీద గెలిచిన మంచికి ప్రతీకగా జరుపుకునే దివ్య కాంతుల పండుగ దీపావళి. సకల ప్రాణుల వదనాల్లో చిరునవ్వుల దీపాలను వెలిగించి, ఆనందించే వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడమే దీపావళి పరమార్థం.
Watch Deepavali visistatha Online here.
Follow us on Social Media