Sri Bramarambika Ashtakam

Sri Bramarambika Ashtakam

Bramarambika Ashtakam

భ్రమరాంబిక అష్టకం

 

రవి సుధాకర వహ్ని లోచన రత్నకుండల భూషిణి 
ప్రవిమలంబుగా మమ్మునేలిన భక్తజన చింతామణి 
అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి  
శివుని పట్టపురాణి గుణమణి శ్రీ గిరి భ్రమరాంబికా || 
కలియుగంబున మానవులను కల్పతరువై యుండవా 
వెలయు శ్రీ గిరి శిఖరమందున విభవమై విలసిల్లవా 
ఆలసింపక భక్త వరులకు అష్ట సంపద లీయావా 
జిలుగు కుంకుమ కాంతిరేకుల  శ్రీ గిరి  భ్రమరాంబిక || 

అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్
పొంగుచును వరహాల కొంకణ భూములయందునన్ 
రంగుగా కర్ణాట మగధ మరాఠ దేశములందునన్ 
శృంఖలా దేశముల వెలసిన శ్రీ గిరి భ్రమరాంబిక || 

అక్షయంబుగా కాశి లోపల అన్నపూర్ణ భవానివై 
సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి 
మోక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణశక్తివి 
శిక్షజేతువు ఘోర భవముల శ్రీ గిరి భ్రమరాంబిక ||  

 
ఉగ్ర లోచన వర వధూమణి యొప్పుగల్గిన భామిని
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనాకారిణి 
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణి 
శీఘ్రమేకని వరము లిత్తువు శ్రీ గిరి భ్రమరాంబికా ||

నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ
మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ
చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా ||

సోమశేఖర పల్లవారధి  సుందరీమణీ ధీమణీ
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ
నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీ
సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా || 
 
భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివి 
ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివి 
పాతకంబుల పాఱద్రోలుచు భక్తులను చేకొంటివా
శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమారాంబికా || 
 
ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున
పల్లవించును నీప్రభావము బ్రహ్మలోకము నందున
తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున
చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా || 
 
తరుణి శ్రీ గిరి మల్లికార్జున దైవరాయల భామినీ  
కరుణతో మమ్మేలు యెప్పుడు కల్పవృక్షము భంగినీ  
వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి  
సిరులనిచ్చెద వేల్ల కాలము శ్రీ గిరి భ్రమరాంబిక ||

 

Follow us on Social Media