sundarakanda-sarga1

Sundarakanda Sarga 1 – సుందరకాండ ప్రథమ సర్గ

Sundarakanda Sarga 1

సుందరకాండ ప్రథమ సర్గ

తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి || 1

అంతట (జాంబవంతుడు ప్రోత్సహించిన పిమ్మట) స్వకార్యము (సీతాన్వేషణము) నకు విరోధులను సంహరింప సమర్థుడగు హనుమంతుడు, రావణుడపహరించిన సీతాదేవి యున్న తావును, చారణులు (దేవగాయకులు) సంచరించు ఆకాశమార్గమున వెదుక దలంచెను.

దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్కర్మ వానరః |
సముదగ్రశిరోగ్రీవో గవాం పతి రివాబభౌ || 2

అన్యుల కలవికాని సముద్రలంఘన మను కార్యమును ఎదురులేకుండునట్లు చేయ గోరినవాడై హనుమంతుడు మెడ చాచి, తల పైకెత్తి ఆబోతు వలె విరాజిల్లెను.

అథ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలః |
ధీరః సలిలకల్పేషు విచచార యథాసుఖమ్ || 3

అంతట ధీరుడు, మహాబలుడగు హనుమంతుడు కొంచెం తెలుపు తో కూడిన వైడూర్యవర్ణము (ఆకుపచ్చ రంగు) కలవై, చల్లదనముచే నీటిని పోలుచున్న పచ్చికబయళ్లపై సుఖముగా (స్వేచ్ఛగా) సంచరించెను.

ద్విజాన్విత్రాసయన్ ధీమానురసా పాదపాన్ హరన్ |
మృగాంశ్చ సుబాహున్నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ || 4

ధీమంతుడగు హనుమంతుడు విజృంభించిన సింహమువలె విహరించుచుండగా అతని రొమ్ము తాకి చెట్లు కూలెను. ఆ చెట్లపై ఉన్న పక్షులు బెదరెను. చాలా మృగములును (బెదరి) చెల్లాచెదరై నశించెను.

నీలలోహితమాంజిష్ఠపత్రవర్ణైః సితాసితైః |
స్వభావవిహితైశ్చిత్రైర్ధాతుభిః సమలంకృతమ్ || 5

నల్లనివి, ఎఱ్ఱనివి, పసుపువన్నె కలవి, ఆకుపచ్చ రంగు కలవి, తెలుపు-నలుపుల మిశ్రవర్ణము కలవి, చిత్రవర్ణము కలవి అగు సహజసిద్ధమైన ధాతువులు హనుమ నిలచిన మహేంద్రగిరిని తమ కాంతులతో అలంకరించినవి.

కామరూపిభి రావిష్ట మభీక్ష్ణం సపరిచ్ఛదైః |
యక్షకిన్నరగంధర్వై ర్దేవకల్పైశ్చ పన్నగైః || 6

అచ్చట కామరూపులగు యక్షులు, కిన్నరులు, గంధర్వు లను దేవతలును, దేవ సమానులగు పన్నగులును అలంకరించుకొని ఎల్లెడల విహరించుచుండిరి.

స తస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే |
తిష్ఠన్కపివర స్తత్ర హ్రదే నాగ ఇవాబభౌ || 7

శ్రేష్ఠములగు ఏనుగులు సంచరించు ఆ మహేంద్రపర్వతపు సుందరప్రదేశముపై నిలిచిన హనుమంతుడు మడుగులోని యేనుగువలె మిక్కిలి ప్రకాశించెను.

స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే |
భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిమ్ || 8

ఆయన తనకు విద్యాగురువగు సూర్యునకు, దేవరాజగు మహేంద్రునకు, వాయుదేవునికి, బ్రహ్మకు, భూతములు అను దేవతా విశేషములకును ప్రణమిల్లి అటనుండి బయలు దేరవలెనని సంకల్పించెను.

అంజలిం ప్రాఙ్ముఖః కృత్వా పవనాయాత్మయోనయే |
తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశమ్ || 9

ఆయన తూర్పుదిశకు తిరిగి, తన తండ్రియగు వాయుదేవునకు మరొక్కమారు నమస్కరించి, పిమ్మట సమర్థుడగుటచే దక్షిణ దిశగా పోవుటకై తన శరీరమును పెంచెను.

ప్లవంగప్రవరై ర్దృష్టః ప్లవనే కృతనిశ్చయః |
వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు || 10

హనుమంతు డట్లు ఎగురుట నిశ్చయించి, రాముని అభ్యుదయమును కోరుచు, కపిశ్రేష్ఠులు చూచుచుండగనే పున్నమి వంటి పర్వదినములందు సముద్రము పొంగునట్లు పెరిగెను.

నిష్ప్రమాణశరీరః సన్ లిలంఘయిషు రర్ణవమ్ |
బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతమ్ || 11

అతడు సముద్రమును దాటగోరుచు, తన దేహమును కొలువరానంతగా పెంచి, చేతులతో, కాళ్ళతో ఆ పర్వతమును గట్టిగా తొక్కిపట్టెను.

స చచా లాచల శ్చాపి ముహూర్తం కపిపీడితః |
తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్ప మశాతయత్ || 12

ఆ మహేంద్ర పర్వతం అచలము (కదలనిది) అయినా, హనుమంతుడు మర్దింపగా ఆ ఒక్కక్షణము చలించెను. ఆ కదలికకు కొండపై నున్న చెట్ల కొమ్మల కొనలవరకు విరబూసిన పూవు లన్నియు రాలిపడెను.

తేన పాదపముక్తేన పుష్పౌఘేణ సుగంధినా |
సర్వతః సంవృతః శైలో బభౌ పుష్పమయో యథా || 13

ఆ చెట్లు సుగంధము కల పుష్పరాశులను రాల్చి శిలాతలమును అన్నివైపుల నుండి కప్పివేయగా ఆ కొండ పూలకొండవలె ప్రకాశించెను.

తేన చోత్తమవీర్యేణ పీడ్యమానః స పర్వతః |
సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః || 14

మెచ్చదగిన పరాక్రమము గల హనుమంతుడు మర్దించగా ఆ మహేంద్రపర్వతము మదించిన యేనుగు మదజలము కార్చినట్లు, మిక్కుటముగా జలము కార్చెను.

పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః |
రీతీర్నిర్వర్తయామాస కాంచనాంజనరాజతీః || 15

బలశాలియగు హనుమంతు డట్లు పీడింపగా, ఆ పర్వతమునందలి బంగారు, నీలము, వెండి ఖనిజ రాళ్ళు బ్రద్దలై ఆ యా లోహముల రేఖ లగపడెను.

ముమోచ చ శిలాః శైలో విశాలాః సమనః శిలాః |
మధ్యమేనార్చిషా జుష్టో ధూమరాజీరివానలః || 16

మండుచున్న అగ్ని తన ఏడు జ్వాలలలో నాల్గవదగు ధూమ్రవర్ణ యను నడిమి జ్వాలతో కూడి పొగలు గ్రక్కిన ట్లా మహేంద్రపర్వతము మణిశిలలతో గూడిన పెనురాలను విరజిమ్మెను.

గిరిణా పీడ్యమానేన పీడ్యమానాని సర్వతః |
గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైః స్వరైః || 17

హనుమంతు డట్లు మహేంద్రపర్వతమును మర్థించుచుండగా దిగులుపడి, అంతటను గుహలలో దాగిన జంతువులు దీనస్వరముతో బిగ్గరగా అరచెను.

స మహాసత్త్వసన్నాదః శైలపీడానిమిత్తజః |
పృథివీం పూరయామాస దిశశ్చోపవనాని చ || 18

మారుతి అట్లా కొండను మర్దించుటచే అందు నివసించిన పెద్ద పెద్ద జీవులు చేసిన ఆక్రందనధ్వని భూమిని, దిక్కులను, వనములను దద్దరిల్ల జేసెను.

శిరోభిః పృథుభిః సర్పా వ్యక్తస్వస్తికలక్షణైః |
వమంతః పావకం ఘోరం దదంశుర్దశనైః శిలాః || 19

అట్టి మర్దనముచే తమ విపులములగు పడగల పై అర్ధచంద్రాకారపు చిహ్నములు స్పష్టముగ అగపడగా, నోటినుండి భయంకరమగు అగ్ని వంటి విషము గ్రక్కుచు సర్పములు కోరలతో రాలను కరచినవి.

తాస్తదా సవిషైర్దష్టాః కుపితైస్తైర్మహాశిలాః |
జజ్జ్వలుః పావకోద్దీప్తా బిభిదుశ్చ సహస్రధా || 20

కోపించిన విషసర్పములు పెద్ద రాళ్ళను కరవగా అవి విషాగ్నిచే ప్రజ్వలించి, వేలకొలదిగా ముక్కలయ్యెను.

యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే |
విషఘ్నా న్యపి నాగానాం న శేకుః శమితుం విషమ్ || 21

ఆ కొండపై మొలచిన ఓషధు లేవియును, విషము హరింపగలపైనను, ఆ సర్పముల విషమును పోగొట్టజాలవయ్యొను.

భిద్యతేఽయం గిరిర్భూతైరితి మత్త్వా తపస్వినః |
త్రస్తా విద్యాధరాస్తస్మాదుత్పేతుః స్త్రీగణైస్సహ || 22

ఈ కొండను భూతము లేవో బ్రద్దలు చేయుచున్నవని తలచి తపస్వులు అచటనుండి ఆకసమున కెగసిరి.

పానభూమిగతం హిత్వా హైమమాసవభాజనమ్ |
పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్ || 23

లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ |
ఆర్షభాణి చ చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సరూన్ || 24

తమ స్త్రీలతో కలిసి మద్యం త్రాగుచు, మధురభక్ష్యములు తినుచున్న విద్యాధరులు పానభూమిపై గల బంగారు సారాయిగిన్నెను, విలువైన భోజన పాత్రలను, బంగారు కమండలములను, నాకదగిన పూదేనె మున్నగువానిని, ఆస్వాదింపదగిన వివిధ భక్ష్యములను పలురకముల మాంసములను, ఎద్దుతోలుతో చేయబడిన డాళ్లు, బంగారు పిడుల కత్తులను విడచి, తమ స్త్రీలతో గూడి భీతితో ఆకసమున కెగసిరి.

కృతకంఠగుణాః క్షీబా రక్తమాల్యానులేపనాః |
రక్తక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే || 25

మెడలలో పుష్పమాలలు దాల్చి, మత్తులై, ఎర్రనైన మాలలు శిరమున ధరించి, ఎర్ర చందనము దేహమున కలదికొని, సహజముగ పద్మములవంటివైనను మద్యపానముచే ఎర్రబారిన కన్నులు గల విద్యాధరు లాకాశమున కెగిరిపోయిరి.

హారనూపురకేయూరపారిహార్యధరాః స్త్రియః |
విస్మితాః సస్మితాస్తస్థురాకాశే రమణైః సహ || 26

ముత్యాలసరులు, అందెలు, భుజకీర్తులు, కంకణములు ధరించి రాజిల్లు విద్యాధరాంగనలు ఆ పర్వత మట్లు కదలుటకు ఆశ్చర్యపడి, తమ రమణులను కూడి చిరునగవు లొలికించుచు ఆకసమున నిలిచిరి.

దర్శయన్తో మహావిద్యాం విద్యాధరమహర్షయః |
సహితాస్తస్థురాకాశే వీక్షాంచక్రుశ్చ పర్వతమ్ || 27

విద్యాధరశ్రేష్ఠులు అణిమాది అష్టమహాసిద్ధిరూపమగు తమ మహాశక్తిని ప్రయోగించి ఆకసమున నొక్కచోట నిలచి ఆ పర్వతము నవలోకించిరి.

శుశ్రువుశ్చ తదా శబ్దమృషీణాం భావితాత్మనామ్ |
చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలేఽంబరే || 28

వా రపుడు నిర్మలాకాశమున నిలచిన పరమాత్మనిష్ఠులగు మునులు, చారణులు, సిద్ధులు పలికిన ఈ వాక్యములు వినిరి.

ఏష పర్వతసంకాశో హనుమాన్మారుతాత్మజః |
తితీర్షతి మహావేగః సముద్రం మకరాలయమ్ || 29

పర్వతం వలె పెద్ద శరీరంతో విలసిల్లు వాయుపుత్రుడగు ఈ హనుమంతుడు మహా వేగంతో మొసళ్ళకు నెలవగు సముద్రమును దాటగోరుచున్నాడు.

రామార్థం వానరార్థం చ చికీర్షన్కర్మ దుష్కరమ్ |
సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్ఛతి || 30

రామునికొరకు, రామకార్యసాధనోద్యుక్తులగు వానరులకొరకును కష్టసాధ్యమగు కార్యము సాధింపగోరుచు, ఇతరులకు దాటశక్యముగాని సముద్రపు టవ్వలియొడ్డు నితడు చేరగోరుచున్నాడు”.

ఇతి విద్యాధరాః శ్రుత్వా వచస్తేషాం మహాత్మనామ్ |
తమప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభమ్ || 31

విద్యాధరు లా మహాత్ములగు ఋషులు మున్నగువారి పై వాక్యములు విని అట్లు అంతులేని పెనురూపు దాల్చి కొండపై నున్న కపిశ్రేష్ఠుడగు హనుమంతుని చూచిరి.

దుధువే చ స రోమాణి చకంపే చాచలోపమః |
ననాద సుమహానాదం సుమహానివ తోయదః || 32

పర్వతమువలె పెద్ద శరీరము దాల్చిన హనుమంతుడు తన మేని వెండ్రుకలను ఉత్సాహముతో విదల్చెను. శరీరమును కంపింపజేసెను. పెనుమబ్బు వలె గర్జించెను.

ఆనుపూర్వ్యేణ వృత్తం చ లాంగూలం రోమభిశ్చితమ్ |
ఉత్పతిష్యన్విచిక్షేప పక్షిరాజ ఇవోరగమ్ || 33

అతడు ఆకాశమున ఎగురబోవుచు గుండ్రముగా వెండ్రుకలతో చుట్టచుట్టుకొని పైన లావుగా నుండి క్రమముగా సన్నబడిన తన తోకను గరుత్మంతుడు సర్పమును విదిలించునట్లు విదిల్చెను.

తస్య లాంగూలమావిద్ధమాత్తవేగస్య పృష్ఠతః |
దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః || 34

హనుమంతుడు వేగము పెంచగా అతని వెనుకనున్న తోక గరుత్మంతుడు పట్టి తీసికొనిపోవుచున్న మహాసర్పమువలె నుండెను.

బాహూ సంస్తంభయామాస మహాపరిఘసన్నిభౌ |
ససాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ చ || 35

ఆ హనుమంతుడు గొప్ప యినుపగుదియల వలె నున్న తన భుజములను కొండపై గట్టిగా నొక్కిపట్టి, నడుము సన్నము చేసికొని, కాళ్ళను కుంచింపజేసికొనెను.

సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరామ్ |
తేజః సత్త్వం తథా వీర్యమావివేశ స వీర్యవాన్ || 36

శ్రీమంతుడు, మహాబలుడగు హనుమంతుడు తన బాహువులను, మెడను సంకోచింపజేసి, తనలో సహజముగనే గూఢముగ నున్న తేజస్సును, సత్త్వమును, వీర్యమును, పైకి తెచ్చుకొనెను.

మార్గమాలోకయన్దూరాదూర్ధ్వం ప్రణిహితేక్షణః |
రురోధ హృదయే ప్రాణానాకాశమవలోకయన్ || 37

అతడు తన చూపును పైకి ప్రసరింపజేసి దూరమునుండియే తాను పోవలసిన మార్గము నాలోకించుచు, ఉచ్ఛ్వాసనిశ్వాసములను హృదయముననే బిగబట్టెను.

పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపికుంజరః |
నికుంచ్య కర్ణౌ హనుమానుత్పతిష్యన్మహాబలః |
వానరాన్వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ || 38

మహాబలుడు, కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు పాదములతో కొండ నదిమిపెట్టి, చెవులు ముడుచుకొని, ఎగురబోవుచు వానరులతో ఇట్లనెను.

యథా రాఘవనిర్ముక్తః శరః శ్వసనవిక్రమః |
గచ్ఛేత్తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితామ్ || 39

రాముడు విడచిన బాణం మెట్లు వాయువేగముతో పోవునో, నేనును అట్లే రావణుడు పాలించు లంకాపురి కేగెదను.

న హి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజామ్ |
అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయమ్ || 40

సీతాదేవి లంకలో కనబడనిచో, ఇదే వేగంతో దేవలోకమున కేగెదను.

యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామ్యకృతశ్రమః |
బద్ధ్వా రాక్షసరాజానమానయిష్యామి రావణమ్ || 41

స్వర్గమునను ఆమె కనబడదేని, ఎంతమాత్రము శ్రమచెందక, రాక్షసరాజగు రావణుని బంధించి వచ్చెదను.

సర్వథా కృతకార్యోఽహమేష్యామి సహ సీతయా |
ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణామ్ || 42

సర్వవిధములుగను కార్యము సాధించియే నేను సీతమ్మతో తిరిగి వత్తును. అట్లు కాదేని రావణునితో గూడ లంకనే పెకలించి యిటకు తెచ్చెదను.

ఏవముక్త్వా తు హనుమాన్వానరాన్వానరోత్తమః |
ఉత్పపాతాథ వేగేన వేగవానవిచారయన్ || 43

సుపర్ణమివ చాత్మానం మేనే స కపికుంజరః || 44

అని వానరశ్రేష్ఠుడు, వేగవంతుడగు హనుమంతుడు వానరులతో పలికి, దూర మని కాని, సముద్ర మని కాని ఆలోచింపక, వేగముగ ఎగిరెను. అట్లెగురుచు తన్ను తాను గరుత్మంతునికి సాటిగా భావించెను.

సముత్పతతి తస్మింస్తు వేగాత్తే నగరోహిణః |
సంహృత్య విటపాన్సర్వాన్సముత్పేతుః సమన్తతః || 45

హనుమంతుడు అట్లు ఎగురుచుండగా ఆ కొండపై నున్న చెట్లు అతని వేగమువలన తమ కొమ్మలను ముడుచుకొని పైకెగసినవి.

స మత్తకోయష్టిభకాన్ పాదపాన్ పుష్పశాలినః |
ఉద్వహన్నూరువేగేన జగామ విమలేఽంబరే || 46

అతడు మదించిన కొంగలతో, విరబూసిన పూలతో ఒప్పారు చెట్లు తన తొడల వేగముచే పెకలించి తనతో పైకెగురజేయుచు నిర్మలాకాశమున పయనించెను.

ఊరువేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయుః |
ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబన్ధుమివ బాన్ధవాః || 47

అట్లతని శరీరవేగముచే పై కెగసిన చెట్లు, దూరప్రయాణము చేయుటకు బయలుదేరిన తమ బంధువులు సాగనంప వచ్చిన చుట్టములవలె క్షణకాలము హనుమంతు ననుసరించినవి.

తమూరువేగోన్మథితాః సాలాశ్చాన్యే నగోత్తమాః |
అనుజగ్ముర్హనూమన్తం సైన్యా ఇవ మహీపతిమ్ ||
48

అట్లు గమనవేగముచే ఎగురగొట్టబడిన చెట్లు, తక్కిన శ్రేష్ఠవృక్షములును, రాజు వెంట పోవు సైన్యములు వలె హనుమంతుని అనుసరించినవి.

సుపుష్పితాగ్రైర్బహుభిః పాదపైరన్వితః కపిః |
హనుమాన్పర్వతాకారో బభూవాద్భుతదర్శనః ||
49

కొనవరకు విరియబూసిన అనేక వృక్షములు చుట్టును కుదురుకొని యుండగా, వాని నడుమ హనుమంతుడు, మహాపర్వతమువలె ఆశ్చర్యము గొలుపుచు కానవచ్చెను.

సారవన్తోఽథ యే వృక్షా న్యమజ్జన్ లవణాంభసి |
భయాదివ మహేంద్రస్య పర్వతా వరుణాలయే || 50

అట్లు పై కెగసిన చెట్లలో చేవకలిగి బరువైన చెట్లు హనుమంతు ననుసరింపజాలక దేవేంద్రునివలన భయపడిన పర్వతములవలె సముద్రమున పడి మునిగినవి.

స నానాకుసుమైః కీర్ణః కపిః సాంకురకోరకైః |
శుశుభే మేఘసంకాశః ఖద్యోతైరివ పర్వతః ||
51

ఆకాశమున మేఘమువలె నున్న హనుమంతుని శరీరముపై వివిధ పుష్పాలు చిగురుటాకులు, మొగ్గలు పడుటచే అతడు మిణుగురులచే కొండవలె ప్రకాశించెను.

విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః |
అవశీర్యన్త సలిలే నివృత్తాః సుహృదో యథా || 52

ఆ వృక్షములు హనుమంతుని కొంతదూరము వెంబడించి, అతని వేగము క్రమముగా వృద్ధినొందుటచే విడివడి, అతనిపై పుష్పములు కురిపించి, ప్రియమిత్రుని నీటిపట్టువఱకు పంపి మఱలివచ్చిన మిత్రులవలె నీట మునిగెను.

లఘుత్వేనోపపన్నం తద్విచిత్రం సాగరేఽపతత్ |
ద్రుమాణాం వివిధం పుష్పం కపివాయుసమీరితమ్ || 53
తారాచితమివాకాశం ప్రబభౌ స మహార్ణవః || 54

హనుమంతుని శరీరవేగముచే పై కెగసిన ఆ చెట్లపూలు, మిక్కిలి తేలికగా నున్న వగుటచే నీటిలో పడి మునగకుండెను. అవి నీటిపై తేలియాడుచు విచిత్రమగు శోభ కలిగియుండెను. అట్లు పుష్పములతో కూడిన మహాసముద్రం వందలకొలది నక్షత్రములతో కూడిన ఆకాశమువలె ప్రకాశించెను.

పుష్పౌఘేణానుబద్ధేన నానావర్ణేన వానరః |
బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణవిభూషితః || 55

అనేకవర్ణములు గల ఆ పుష్పములు హనుమంతుని మేనిపై పడగా, వానితో ఆయన ఆకాశమున మెఱుపుతీగల సమూహముతో విలసిల్లు మేఘము వలె ప్రకాశించెను.

తస్య వేగసమాధూతైః పుష్పైస్తోయమదృశ్యత |
తారాభిరభిరామాభి-రుదితాభి రివాంబరమ్ || 56

హనుమంతుని గమన వేగముచే నింగి కెగసిన పుష్పములు సముద్రమున పడగా, వానిచే ఆ సముద్రము ఉదయించిన సుందరనక్షత్రములచే ఆకాశమువలె కనుపించెను.

తస్యాంబరగతౌ బాహూ దదృశాతే ప్రసారితౌ |
పర్వతాగ్రాద్వినిష్క్రాన్తౌ పంచాస్యావివ పన్నగౌ || 57

ఆకాశమున చేతులు చాచి హనుమ ఎగురుచుండగా అతని రెండు చేతులు పర్వతశిఖరమునుండి వెలువడిన రెండు ఐదు తలల పాము వలె నుండెను.

పిబన్నివ బభౌ చాపి సోర్మిజాలం మహార్ణవమ్ |
పిపాసురివ చాకాశం దదృశే స మహాకపిః || 58

కపివరు డగు హనుమంతుడు సముద్రజలమునకు చేరువగా పోవునపుడు తరంగపంక్తులతో గూడ సముద్రజలమును త్రాగివేయుచున్నట్లును, సముద్రునిపై దూరముగా సంచరించినపు డాకాశమును కబళింపగోరుచున్నట్లును అగపడెను.

తస్య విద్యుత్ప్రభాకారే వాయుమార్గానుసారిణః |
నయనే విప్రకాశేతే పర్వతస్థావివానలౌ || 59

హనుమంతు డట్లు వాయుమార్గమున పయనించుచుండగా మెరుపుల వలె వెలుగు అతని కన్నులు, పర్వతమండలి రెండగ్నులవలె ప్రకాశించెను.

పింగే పింగాక్షముఖ్యస్య బృహతీ పరిమణ్డలే |
చక్షుషీ సంప్రకాశేతే చంద్రసూర్యావివోదితౌ || 60

వాసర శ్రేష్టుడగు హనుమంతుని వృత్తాకారములైన పెద్ద పెద్ద కన్నులు పింగళవర్ణము కలవై, ఉదయించిన చంద్రసూర్యులవలె ప్రకాశించుచుండెను.

ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబభౌ |
సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలమ్ || 61

ఎర్రని ముక్కు చే ఎర్రబారిన హనుమంతుని ముఖము, సంధ్యారాగముతో కూడిన సూర్యమండలమువలె ప్రకాశించెను.

లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే |
అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితః || 62

హనుమంతుడు ఆకసమున ఎగురుచు తోకను పైకెత్తగా, అది యెత్తైన ఇంద్రధ్వజము (ఇంద్రుని ప్రీతికై చేయు ఉత్సవాదులలో ఉత్సవ సూచకంగా ఎగురవేయు జెండా) వలె శోభిల్లెను.

లాంగూలచక్రేణ మహాన్ శుక్లదంష్ట్రోఽనిలాత్మజః |
వ్యరోచత మహాప్రాజ్ఞః పరివేషీవ భాస్కరః || 63

తెల్లని కోరలు కలవాడు, మహాబుద్ధిశాలి యగు హనుమంతుడు, తన చుట్టును చక్రాకారముగ నున్న తోకచే పరిధి (గూడు)తో కూడిన సూర్యుని వలె భాసిల్లెను.

స్ఫిగ్దేశేనాభితామ్రేణ రరాజ స మహాకపిః |
మహతా దారితేనేవ గిరిర్గైరికధాతునా || 64

మిక్కిలి ఎర్రనైన వాలమూలప్రదేశము (తోక ప్రారంభమగు చోటు)తో కూడిన హనుమ చీల్చబడిన పెద్ద గైరికధాతువుతో కూడిన కొండవలె శోభిల్లెను.

తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరమ్ |
కక్షాన్తరగతో వాయుర్జీమూత ఇవ గర్జతి || 65

అట్లు పైనుండి సముద్రం దాటుతున్న వానరశ్రేష్ఠుడగు హనుమంతుని బాహుమూల (చంక) ప్రదేశమునుండి వెడలిన వాయువు మేఘమువలె గర్జింప సాగెను.

ఖే యథా నిపతన్త్యుల్కా హ్యుత్తరాన్తాద్వినిస్సృతా |
దృశ్యతే సానుబన్ధా చ తథా స కపికుంజరః || 66

ఆకాశమున ఉత్తర దిక్కు నుండి బయలుదేరిన ఉల్క, తోకతో కూడి ఎడతెగక యెట్లగపడునో అట్లే ఆ కపిశ్రేష్ఠుడును అగపడెను.

పతత్పతంగసంకాశో వ్యాయతః శుశుభే కపిః |
ప్రవృద్ధ ఇవ మాతంగః కక్ష్యయా బధ్యమానయా || 67

ఆకాశముపై పోవుచున్న సూర్యునివలె నున్న విశాలకాయుడగు హనుమంతుడు, స్తంభమునకు కట్టివేయుటచే నిడివిగా సాగుచున్న యేనుగువలె శోభిల్లెను.

ఉపరిష్టాచ్ఛరీరేణ ఛాయయా చావగాఢయా |
సాగరే మారుతావిష్టా నౌరివాసీత్తదా కపిః || 68

అతడు సముద్రం పై అగపడు శరీరముతోను, క్రింద నీటిలో కానవచ్చు తన ప్రతిబింబముతోను, పైన తెరచాప మున్నగునవి కలిగి, క్రిందిభాగము నీటిలో నున్నదై గాలి వాలుచే పోవుచున్న ఓడవలె నుండెను.

యం యం దేశం సముద్రస్య జగామ స మహాకపిః |
స స తస్యోరువేగేన సోన్మాద ఇవ లక్ష్యతే || 69

మహాకపి యగు హనుమంతుడు సముద్రముపై ఏ యే ప్రదేశమున సంచరించెనో ఆ యా సముద్రభాగమున ఎత్తైన తరంగాలు లేచుటచే, అది అపస్మారము కలది వలె (భ్రమణము, నురుగులతో నీరు కక్కుట, పెద్దగా ధ్వని చేయుట మున్నగు లక్షణములతో) కనిపించెను.

సాగర స్యోర్మిజాలానా మురసా శైలవర్ష్మణామ్ |
అభిఘ్నంస్తు మహావేగః పుప్లువే స మహాకపిః || 70

మహావానరుడగు ఆ హనుమంతుడు పర్వతాకారముతో ఎగసిపడుచున్న అలలను తన రొమ్ముతో ఎదుర్కొనుచు, మహావేగంతో సముద్రంపై ఎగిరెను.

కపివాతశ్చ బలవాన్మేఘవాతశ్చ నిస్సృతః |
సాగరం భీమనిర్ఘోషం కంపయామాసతుర్భృశమ్ || 71

మిక్కిలి బలముగల హనుమంతుని గమనవేగముచే వెడలిన వాయువు, మేఘముల వల్ల ఏర్పడిన గాలియును, భయంకరముగ గర్జించు సముద్రమును సైతము మిక్కిలి కలవరపరచెను.

వికర్షన్నూర్మిజాలాని బృహన్తి లవణాంభసి |
పుప్లువే కపిశార్దూలో వికిరన్నివ రోదసీ || 72

వానరశ్రేష్ఠుడగు హనుమంతుడు తన వేగముతో సముద్రమునందలి అలలను లాగుచు, వానిని భూమ్యాకాశముల నడుమ వెదజల్లుచున్నట్లు ఆకాశమున ఎగిరెను.

మేరుమన్దరసంకాశానుద్ధతాన్స మహార్ణవే |
అతిక్రామన్మహావేగస్తరంగాన్ గణయన్నివ || 73

మహావేగముగల హనుమంతుడు మేరు, మందర పర్వతముల వలె మహోన్నతము లైన సముద్రతరంగములను దాటిపోవుచు, వానిని లెక్కించుచు పోవుచుండెనో యన్నట్లుండెను.

తస్య వేగసముద్ధూతం జలం సజలదం తదా |
అంబరస్థం విబభ్రాజ శారదాభ్రమివాతతమ్ || 74

హనుమంతుని వేగముచే పై కెగసిన నీరు, మేఘములతో కూడి తెల్లనై, ఆకాశమున వ్యాపించిన శరత్కాలమేఘమువలె కనుపించెను.

తిమినక్రఝషాః కూర్మా దృశ్యన్తే వివృతాస్తదా |
వస్త్రాపకర్షణేనేవ శరీరాణి శరీరిణామ్ || 75

వస్త్రము తొలగింపగా మనుజుల అవయవము లగపడునట్లు, నీరు పై కెగయుటచే సముద్రమందలి పెను చేపలు, మొసళ్ళు, పిల్ల చేపలు, తాబేళ్లు కనుపించెను.

ప్లవమానం సమీక్ష్యాథ భుజంగాః సాగరాలయాః |
వ్యోమ్ని తం కపిశార్దూలం సుపర్ణ ఇతి మేనిరే || 76

అపుడు సముద్రమున నివసించు సర్పము లాకసమున మహావేగముతో ఎగురుచున్న హనుమంతుడు చూసి గరుత్మంతుడని తలంచినవి.

దశయోజనవిస్తీర్ణా త్రింశద్యోజనమాయతా |
ఛాయా వానరసింహస్య జలే చారుతరాఽభవత్ || 77

ఆ కపిశ్రేష్ఠుని నీడ పదియోజనముల వెడల్పు, ముప్పది యోజనముల పొడవు కలిగి సముద్రపు నీటిలో మిక్కిలి సుందరముగ కనుపించెను.

శ్వేతాభ్రఘనరాజీవ వాయుపుత్రానుగామినీ |
తస్య సా శుశుభే ఛాయా వితతా లవణాంభసి || 78

హనుమ వెంట పోవుచున్న ఆ నీడ సముద్రమున వ్యాపించి తెల్లని మేఘముల దట్టమగు వరుసవలె ప్రకాశించెను.

శుశుభే స మహాతేజా మహాకాయో మహాకపిః |
వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః || 79

మహాతేజస్వి, మహాశరీరధారి యగు హనుమంతుడు నిరాధారమగు ఆకాశమున రెక్కలుగల పర్వతమువలె ప్రకాశించెను.

యేనాసౌ యాతి బలవాన్వేగేన కపికుంజరః |
తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః || 80

బలవంతుడగు హనుమంతు డే మార్గమున వేగముగ పోవుచుండెనో ఆ మార్గమం దంతటను అతని గమనవేగముచే జల మడుగంటగా అపు డచట సముద్ర మొక్కమారుగా పెద్ద దొన్నె వలె కనిపించెను.

ఆపాతే పక్షిసంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్ |
హనుమాన్మేఘజాలాని ప్రకర్షన్మారుతో యథా || 81

హనుమంతుడు పక్షిసమూహము సంచరించు ఆకాశమార్గమున పోవుచు పక్షిరాజగు గరుత్మంతునివలెను, వాయువువలెను మేఘములను తన వేగముతో కొనిపోవుచు విలసిల్లెను.

పాణ్డురారుణవర్ణాని నీలమాంజిష్ఠకాని చ |
కపినాఽఽకృష్యమాణాని మహాభ్రాణి చకాశిరే || 82

అట్లు హనుమంతునిచే కొనిపోబడుచున్న మహామేఘము లొకింత పసుపు కలిసిన ఎరుపు, ఎరుపు, నలుపు, పసుపు రంగు కలవై ప్రకాశించెను.

ప్రవిశన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః |
ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే || 83

హనుమంతుడు మబ్బులలో మాటిమాటికి ప్రవేశించుచు, వెలువడుచు, కొంతతడవు మబ్బుల మాటున దాగి మఱల వెలువడుచుండు చంద్రునివలె కనుపించుచుండెను.

ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా |
వవర్షుః పుష్పవర్షాణి దేవగన్ధర్వదానవాః || 84

అట్లు వేగముగా సముద్రము దాటు హనుమంతుని చూచి, దేవతలు, గంధర్వులు దానవులును పూలవానలు కురిపించిరి.

తతాప న హి తం సూర్యః ప్లవన్తం వానరోత్తమమ్ |
సిషేవే చ తదా వాయూ రామకార్యార్థసిద్ధయే || 85

రామకార్యము సిద్ధింపవలెనని సముద్రముపై ఎగురుచున్న కపిశ్రేష్ఠుడగు హనుమంతునిపై సూర్యుడు తన వేడిమిని ప్రసరింపజేయలేదు. వాయువు కూడా అనుకూలుడై చల్లగా వీచెను.

ఋషయస్తుష్టువుశ్చైనం ప్లవమానం విహాయసా |
జగుశ్చ దేవగన్ధర్వాః ప్రశంసన్తో మహౌజసమ్ || 86

ఆకాశమార్గమున పోవుచున్న హనుమను ఋషులు స్తుతించిరి. దేవతలు, గంధర్వులును మహాతేజశ్శాలియగు ఆయనను ప్రశంసించుచు పాడిరి.

నాగాశ్చ తుష్టువుర్యక్షా రక్షాంసి విబుధాః ఖగాః |
ప్రేక్ష్య సర్వే కపివరం సహసా విగతక్లమమ్ || 87

ఎంతమాత్రము శ్రమనొందని హనుమంతుని అకస్మాత్తుగా చూచి నాగులు, యక్షులు, రక్షస్సులు (వీరు దిక్పాలకులగు రక్షస్సులకు సంబంధించినవారు) దేవతలు, పక్షులును స్తోత్రము చేసిరి.

తస్మిన్ ప్లవగశార్దూలే ప్లవమానే హనూమతి |
ఇక్ష్వాకుకులమానార్థీ చిన్తయామాస సాగరః || 88

కపిశ్రేష్ఠుడగు హనుమంతు డట్లు సముద్రము దాటుచుండగా ఇక్ష్వాకువంశప్రతిష్ఠ కోరు సాగరుడు ఇట్లు తలంచెను.

సాహాయ్యం వానరేన్ద్రస్య యది నాహం హనూమతః |
కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతామ్ || 89

వానర శ్రేష్ఠుడు హనుమంతుని నే నిపుడు తోడ్పడకున్నచో నోరుగల ప్రతివాడును నన్ను అన్ని విధములుగ నిందింపక మానడు.

అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః |
ఇక్ష్వాకుసచివశ్చాయం నావసీదితుమర్హతి || 90

నేను ఇక్ష్వాకు ప్రభువగు సగరునిచే సంవర్ధితుడ నైతిని. ఇత డిక్ష్వాకువంశజుడగు రాముని దూత. ఇతనికి కష్టము కలుగరాదు.

తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపిః |
శేషం చ మయి విశ్రాన్తః సుఖేనాతిపతిష్యతి || 91

కావున ఈ హనుమంతుడు నడుమ విశ్రమించునట్లు చేయుట నాకు కర్తవ్యము. అట్లు నా వద్ద విశ్రమించి, తక్కిన మార్గము నవలీలగ హనుమ దాటగలడు.

ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్ఛన్నమంభసి |
హిరణ్యనాభం మైనాకమువాచ గిరిసత్తమమ్ || 92

సముద్రు డిట్లు ఉత్తమమగు ఆలోచన చేసి, తన జలములలో దాగియున్న బంగారు శిఖరాలు గల పర్వతశ్రేష్ఠుడు మైనాకుని చూచి యిట్లనెను.

త్వమిహాసురసంఘానాం పాతాలతలవాసినామ్ |
దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిఘః సన్నివేశితః || 93

ఓ పర్వతశ్రేష్ఠుడా! దేవేంద్రుడు పాతాళలోకమున నున్న రాక్షసులు భూమిపైకి రాకుండునట్లు ఇనుపగడియవలె నిన్నడ్డముగా నుంచినాడు.

త్వమేషాం జాతవీర్యాణాం పునరేవోత్పతిష్యతామ్ |
పాతాలస్యాఽప్రమేయస్య ద్వారమావృత్య తిష్ఠసి || 94

బలము కూడగట్టుకొని, మఱల భూమిపైకి రాబోవు ఈ రాక్షసులను నివారించుచు నీవు మిగుల విస్తృతమగు పాతాళలోకపు ద్వారమును కప్పివైచి నిలిచియున్నావు.

తిర్యగూర్ధ్వమధశ్చైవ శక్తిస్తే శైల వర్ధితుమ్ |
తస్మాత్సంచోదయామి త్వాముత్తిష్ఠ గిరిసత్తమ || 95

ఓ పర్వతశ్రేష్ఠుడా! నీవు అడ్డముగను, పైకి, క్రిందకు గూడ పెరుగగలవాడవు. కావున నిన్నే ప్రేరణ చేయుచున్నాను. నీ వింక లెమ్ము.

స ఏష కపిశార్దూలస్త్వాముపర్యేతి వీర్యవాన్ |
హనూమాన్రామకార్యార్థం భీమకర్మా ఖమాప్లుతః || 96

ఈ కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు ఎల్లరకు భయము గొల్పు గొప్పపనులు నిర్వహింప జాలినవాడు. పరాక్రమశాలి. సీతాన్వేషణ మను రామకార్యము సాధించుటకు నీమీదుగా ఆకాశమార్గమున పోవుచున్నాడు.

అస్య సాహ్యం మయా కార్యమిక్ష్వాకుకులవర్తినః |
మమ హీక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాస్తవ || 97

ఇక్ష్వాకువంశ్యుడగు రాముని సేవించు ఈ హనుమంతుని నేను సహాయము చేయవలయును. నాకు ఇక్ష్వాకువంశ్యులు పూజనీయులు. నీకు మిక్కిలి పూజనీయులు.

కురు సాచివ్యమస్మాకం న నః కార్యమతిక్రమేత్ |
కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ || 98

మా పని మించిపోకముందే నీవు మాకు సహాయపడుము. చేయవలసిన పని చేయనిచో సత్పురుషులు కోపింతురు.

సలిలాదూర్ధ్వముత్తిష్ఠ తిష్ఠత్వేష కపిస్త్వయి |
అస్మాకమతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాంవరః || 99

కపిశ్రేష్ఠుడగు ఈ హనుమ మన కతిథి, పూజనీయుడును. కాన నీవు నీటినుండి పైకి రమ్ము. ఇతనిని నీ శిఖరములపై విశ్రమింపనిమ్ము.

చామీకరమహానాభ దేవగన్ధర్వసేవిత |
హనుమాంస్త్వయి విశ్రాన్తస్తతః శేషం గమిష్యతి || 100

బంగారు శిఖరములు గలవాడవు, దేవతలచే, గంధర్వులచే గూడ సేవింప బడువాడవగు మైనాకుడా! హనుమంతుడు నీపై విశ్రమించి తక్కిన మార్గమును సుఖముగ దాటగలడు.

కాకుత్స్థస్యానృశంస్యం చ మైథిల్యాశ్చ వివాసనమ్ |
శ్రమం చ ప్లవగేన్ద్రస్య సమీక్ష్యోత్థాతుమర్హసి || 101

రామచంద్రునికి సీతపై గల మిక్కిలి దయను, సీతాదేవి పరదేశనివాసమును, హనుమంతుని శ్రమమును ఆలోచించియైన నీవిక లెమ్ము.

హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభసః |
ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతాయుతః || 102

బంగారు శిఖరములు గల మైనాకుడు సముద్రుని మాటలు విని పెద్ద చెట్లు, తీగలతో కూడి శీఘ్రమే సముద్రజలమునుండి పైకి వచ్చెను.

స సాగరజలం భిత్త్వా బభూవాభ్యుత్థితస్తదా |
యథా జలధరం భిత్త్వా దీప్తరశ్మిర్దివాకరః || 103

ప్రకాశమానములగు కిరణములు గల సూర్యుడు మబ్బును చీల్చుకొని వెలువడినట్లు మైనాకుడు సముద్రజలమును చీల్చుకొని అప్పుడే పైకి వచ్చెను.

స మహాత్మా ముహూర్తేన పర్వతః సలిలావృతః |
దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజితః || 104

సముద్రు డట్లు మహాత్ముడగు మైనాకుని ప్రేరింపగా అతడొక్కక్షణములో జలము కార్చుచు పైకి వచ్చి తన శిఖరములను ప్రదర్శించెను.

శాతకుంభనిభైః శృంగైః సకిన్నరమహోరగైః |
ఆదిత్యోదయసంకాశైరాలిఖద్భిరివామ్బరమ్ || 105

కిన్నరులు ఉరగుల కావాసమై ఆకాశము నంటుచున్నట్లున్న తన బంగారు శిఖరములతో సూర్యోదయమువలె ప్రకాశించుచు, మైనాకుడు పైకి వచ్చెను.

తప్తజాంబూనదైః శృంగైః పర్వతస్య సముత్థితైః |
ఆకాశం శస్త్రసంకాశమభవత్కాంచనప్రభమ్ || 106

అట్లు మేలిమి బంగారముతో నిండిన మైనాకుని శిఖరములు సముద్రము నుండి పైపైకి పెరుగగా, వాని కాంతిచే, కత్తివలె నల్లనగు ఆకాశము బంగారు వన్నె గల దయ్యెను.

జాతరూపమయైః శృంగైర్భ్రాజమానైః స్వయంప్రభైః |
ఆదిత్యశతసంకాశః సోఽభవద్గిరిసత్తమః || 107

అట్లు బంగారం తో నిండిన వగుటచే స్వప్రకాశముచేతనే వెలుగొందు శిఖరములు గల మైనాకపర్వతము నూఱ్గురు సూర్యులకు సాటిగా నుండెను.

తముత్థితమసంగేన హనుమానగ్రతః స్థితమ్ |
మధ్యే లవణతోయస్య విఘ్నోఽయమితి నిశ్చితః || 108

ఆ విధముగ సముద్రము నుండి పైకి లేచి, తన యెదుట నిలచిన పర్వతమును హనుమంతుడు తన ప్రయాణము నడుమ కలిగిన విఘ్నముగా తలంచెను.

స తముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపిః |
ఉరసా పాతయామాస జీమూతమివ మారుతః || 109

మహావేగము గల ఆ హనుమ, అధికముగ పైపైకి పెరిగిన ఆ పర్వతమును, గాలి మబ్బును చెదరగొట్టునట్లు తన ఱొమ్ము తాకుతో అనాయాసముగ పడవైచెను.

స తదా పాతితస్తేన కపినా పర్వతోత్తమః |
బుద్ధ్వా తస్య కపేర్వేగం జహర్ష చ ననన్ద చ || 110

అట్లు హనుమంతుడు పడగొట్టగా, శ్రేష్ఠమగు మైనాకపర్వతము అతని వేగము నెఱిగి పులకించి ఆనందించెను.

త మాకాశగతం వీరమాకాశే సముపస్థితః |
ప్రీతో హృష్టమనా వాక్య మబ్రవీత్పర్వతః కపిమ్ |
మానుషం ధారయన్రూపమాత్మనః శిఖరే స్థితః || 111

ఆ మైనాకుడు వెంటనే మనుష్యరూపము ధరించి ఆకాశమున పోవు వీరుడగు హనుమంతునకు చేరువనే తన శిఖరముపై నిలచి, పులకితాంతరంగుడై ప్రీతితో నతని కిట్లనెను.

దుష్కరం కృతవాన్కర్మ త్వమిదం వానరోత్తమ |
నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖమ్ || 112

వానర శ్రేష్ఠుడా! నీవు అన్యుల కలవిగాని ఈ గొప్పపని చేసితివి. కావున నా శిఖరములపై దిగి, సేద తీరువఱకు విశ్రమింపుము.

రాఘవస్య కులే జాతైరుదధిః పరివర్ధితః |
స త్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః || 113

ఈ సాగరుడు రాముని పూర్వులచే పెంపొందింపబడినాడు. కావున రాముని హితము కోరి పోవుచున్న నిన్నాదరించుచున్నాడు.

కృతే చ ప్రతికర్తవ్యమేష ధర్మః సనాతనః |
సోఽయం త్వత్ప్రతికారార్థీ త్వత్తః సంమానమర్హతి || 114

తన కుపకరించిన వానికి ప్రత్యుపకారము చేయవలయును. ఇది సనాతన ధర్మము. కావున నీ వాతిథ్యము స్వీకరింపవలెనని కోరుచున్న సముద్రుని కోర్కెను తీర్చి యతనిని సత్కరింపదగుదువు.

త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ప్రచోదితః |
తిష్ఠ త్వం కపిశార్దూల మయి విశ్రమ్య గమ్యతామ్ || 115

యోజనానాం శతం చాపి కపిరేష సమాప్లుతః |
తవ సానుషు విశ్రాన్తః శేషం ప్రక్రమతామితి || 116

“ఓ మైనాకుడా! ఈ హనుమంతుడు నూరు యోజనముల దూరము ఎగుర నుద్యమించినాడు. నడుమ నీ సానువులం దొకింత విశ్రమించి తక్కిన దూరము దాటగలడు” అని యిట్లు నీ కాతిథ్య మిచ్చుటకై సముద్రుడే నన్ను సగౌరవముగ ప్రోత్సహించినాడు. కావున ఓ కపిశ్రేష్ఠుడా! నాపై యొకింత విశ్రమించి పొమ్ము.

తదిదం గన్ధవత్స్వాదు కన్దమూలఫలం బహు |
తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాన్తోఽనుగమిష్యసి || 117

వానరశ్రేష్ఠుడవగు ఓ హనుమంతుడా! మంచి రుచి, వాసనగల ఈ కందమూలములను, పండ్లను తిని, కొంత తడవు విశ్రమించి, నీ వటుపై మఱల పోవచ్చును.

అస్మాకమపి సమ్బన్ధః కపిముఖ్య త్వయాఽస్తి వై |
ప్రఖ్యాతస్త్రిషు లోకేషు మహాగుణపరిగ్రహః || 118

ఓ వానరముఖ్యుడా! మాకును, నీతో ముల్లోకములలో ప్రసిద్ధమగు ఇచ్చి పుచ్చుకొను సంబంధము లేకపోలేదు. ఇది సజ్జనసమ్మతమైన ఆతిథ్యరూపమగు ధర్మము.

వేగవన్తః ప్లవన్తో యే ప్లవగా మారుతాత్మజ |
తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజర || 119

వాయు తనయుడ వగు కపిశ్రేష్ఠుడా! మహావేగము, ఎగురుటలో కౌశలము గల వానరులలో నిన్ను ప్రధాని తలంతును.

అతిథిః కిల పూజార్హః ప్రాకృతోఽపి విజానతా |
ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్ || 120

ధర్మాచరణమున శ్రద్ధగల పండితునకు అతిథి సామాన్యుడైనను పూజనీయుడు. అట్టిచో వంటి మహాత్ము డతిథియైనచో మా బోంట్లకు పూజనీయుడు కాకుండునా?

త్వం హి దేవవరిష్ఠస్య మారుతస్య మహాత్మనః |
పుత్రస్తస్యైవ వేగేన సదృశః కపికుంజర || 121

ఓ వానర శ్రేష్ఠుడా! నీవు దేవశ్రేష్ఠుడు, మహాత్ముడగు వాయు దేవుని కుమారుడవు. వేగమున నీ వతనికి సాటియైన వాడవు.

పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః |
తస్మాత్త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణమ్ || 122

ధర్మ మెఱిగినవాడా! నిన్ను పూజింతునేని నా తండ్రి వాయుదేవుని పూజించినట్లగును. కావున నీవు నాకు పూజనీయుడవు. నేను నీ తండ్రిని పూజింపవలయును. అందులకు కారణము చెప్పెదను వినుము.

పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణోఽభవన్ |
తే హి జగ్ముర్దిశః సర్వా గరుడానిలవేగినః || 123

నాయనా! పూర్వము కృతయుగమున పర్వతములకు ఱెక్కలు ఉండెడివి. అందువలన అవి గరుత్మంతునివలె, వాయువువలె వేగముగ అన్ని దిక్కులకు పోవుచుండెడివి.

తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాః సహర్షిభిః |
భూతాని చ భయం జగ్ముస్తేషాం పతనశంకయా || 124

పర్వతము లట్లు ఎగురుచుండగా దేవతలు, ఋషులు, సకలజీవరాశులును, ఆ పర్వతములు తమపై పడునేమో యను శంకతో భయపడినవి.

తతః క్రుద్ధః సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః |
పక్షాన్ చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః || 125

అంత నూఱుయాగముల నొనర్చి శతక్రతుడని ప్రసిద్ధుడైన దేవేంద్రుడు పర్వతములపై కోపించెను. తాను సహస్రాక్షుడు (వేయి కన్నులు కలవాడు) అగుటచే ఆయన వెదకి వెదకి ఎచట దొరికిన అచటనే ఆ పర్వతాల రెక్కలు వజ్రాయుధంతో నఱికివైచెను.

స మాముపాగతః క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్ |
తతోఽహం సహసా క్షిప్తః శ్వసనేన మహాత్మనా || 126

దేవేంద్రు డట్లు వజ్రాయుధము నెత్తి నాకడకును వచ్చెను. అపుడు మహాత్ముడగు నీ తండ్రి వాయుదేవుడు శీఘ్రమే నన్ను దూరముగా విసరివైచెను.

అస్మిన్ లవణతోయే చ ప్రక్షిప్తః ప్లవగోత్తమ |
గుప్తపక్షసమగ్రశ్చ తవ పిత్రాఽభిరక్షితః || 127

కపిశ్రేష్ఠుడా! నీ తండ్రి అట్లు విసరివేయగా నే నీ సముద్రమున బడితిని. ఆయన నన్ను రక్షించిన కారణముచే నా ఱెక్కలు చెక్కు చెదరలేదు.

తతోఽహం మానయామి త్వాం మాన్యో హి మమ మారుతః |
త్వయా మే హ్యేష సమ్బన్ధః కపిముఖ్య మహాగుణః || 128

కావున నేను నిన్ను గౌరవించుచున్నాను. నాకు వాయుదేవుడు పూజనీయుడు. కపిశ్రేష్ఠుడా! మన నడుమ ఈ శ్రేష్ఠమగు సంబంధ మున్నదని గుర్తింపుము.

తస్మిన్నేవంగతే కార్యే సాగరస్య మమైవ చ |
ప్రీతిం ప్రీతమనాః కర్తుం త్వమర్హసి మహాకపే || 129

మహాత్ముడవగు ఓ వానరుడా! సాగరునకు, నాకును సంబంధించిన పూర్వవృత్తాంత మిట్లున్నది కనుక నీవు సంతోషముతో మా యభీష్టము నంగీకరింపదగుదువు.

శ్రమం మోక్షయ పూజాం చ గృహాణ కపిసత్తమ |
ప్రీతిం చ బహుమన్యస్వ ప్రీతోఽస్మి తవ దర్శనాత్ || 130

కపిశ్రేష్ఠుడా! నీ విచట విశ్రమించుము. మా సత్కారము స్వీకరింపుము. నేను చూపుచున్న ప్రేమను మన్నింపుము. నిన్ను చూసి నేనెంతో సంతోషించితిని.

ఏవముక్తః కపిశ్రేష్ఠస్తం నగోత్తమమబ్రవీత్ |
ప్రీతోఽస్మి కృతమాతిథ్యం మన్యురేషోఽపనీయతామ్ || 131

ఇట్లు మైనాకుడు పలుకగా హనుమంతు డతని కిట్లనెను. మైనాకుడా! నీ యాదరణమునకు సంతోషించితిని. నీ దర్శనాదులే నా కాతిథ్యతుల్యములైనవి. నీ సత్కారము నంగీకరింపనైతినని కోపింపకుము.

త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే |
ప్రతిజ్ఞా చ మయా దత్తా న స్థాతవ్యమిహాన్తరే || 132

నేను కర్తవ్య మనుష్ఠింపవలసిన సమయము నన్ను తొందర చేయుచున్నది. పగలు గడచిపోవుచున్నది. చీకటి పడకముందే లంకకు పోవలెను కదా. నేను చేసిన ప్రతిజ్ఞ ననుసరించి నడుమ ఎచ్చటను నిలువరాదు. (రాముడు విడచిన బాణము వలె వాయువేగముతో రావణుడు పాలించు లంకకు పోయేదనని హనుమంతుని ప్రతిజ్ఞ).

ఇత్యుక్త్వా పాణినా శైలమాలభ్య హరిపుంగవః |
జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ || 133

అని పలికి పరాక్రమశాలియగు హనుమంతుడు మందహాసము చేయుచు తన హస్తముతో మైనాకుని తాకి, ఆకాశమున కెగసి పోయెను.

స పర్వతసముద్రాభ్యాం బహుమానాదవేక్షితః |
పూజితశ్చోపపన్నాభిరాశీర్భిరనిలాత్మజః || 134

మైనాకుడు, సముద్రుడును వాయుపుత్రుడగు ఆ హనుమంతుని మిక్కిలి ఆదరముతో చూచిరి. ‘నీవలన రాముని కార్యము సఫలము కావలె’నని కార్యసిద్ధికి తగినట్లు ఆశీస్సులతో అభినందించిరి.

అథోర్ధ్వం దూరముత్ప్లుత్య హిత్వా శైలమహార్ణవౌ |
పితుః పన్థానమాస్థాయ జగామ విమలేఽమ్బరే || 135

హనుమంతుడు మానవాకృత దాల్చిన మైనాక, సముద్రులను వీడ్కొని అట నుండి పైపైకి యెగసి వాయుమార్గమును చేరి, నిర్మలాకాశమున పయనించెను.

భూయశ్చోర్ధ్వగతిం ప్రాప్య గిరిం తమవలోకయన్ |
వాయుసూనుర్నిరాలమ్బే జగామ విమలేఽమ్బరే || 136

అతడు ఇంకను పైపైకి పోయి, అచటనుండి మైనాకుని చూచుచు నిరాధారమగు నిర్మలాకాశమున పయనించెను.

తద్ద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరమ్ |
ప్రశశంసుః సురాః సర్వే సిద్ధాశ్చ పరమర్షయః || 137

మిక్కిలి అసాధ్యమైన మైనాక జయమను హనుమంతుని రెండవ కార్యమును చూచి సకల దేవతలు, సిద్ధులు, మహర్షులును మెచ్చుకొనిరి. (సముద్రలంఘనము హనుమంతుని మొదటి దుష్కరమైన కర్మ).

దేవతాశ్చాభవన్ హృష్టాస్తత్రస్థాస్తస్య కర్మణా |
కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవః || 138

స్వర్ణమయములగు ఉత్తమశిఖరములు కల మైనాకపర్వతము చేసిన హనుమత్సాహాయ్య రూపమగు పనిని చూచి దేవతలందఱును ఆనందించిరి. వేయి కన్నులతో దానిని చూచిన దేవేంద్రుడు ప్రీతుడయ్యెను.

ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్సగద్గదమ్ |
సునాభం పర్వతశ్రేష్ఠం స్వయమేవ శచీపతిః || 139

ప్రశస్తమైన బుద్ధిగల దేవేంద్రుడు, సంతోషము కారణముగా డగ్గుత్తికతో కూడిన కంఠస్వరము కలవాడై శ్రేష్ఠములగు శిఖరములు గల ఆ మైనాకునితో స్వయముగా ఇట్లు పలికెను.

హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోఽస్మి తే భృశమ్ |
అభయం తే ప్రయచ్ఛామి తిష్ఠ సౌమ్య యథాసుఖమ్ || 140

“సౌమ్యుడవు, బంగారు శిఖరములు కలవాడవగు ఓ పర్వతశ్రేష్ఠుడా! నీ యెడల నేను సంతుష్టుడనైతిని. నీ కిటుపై నా వలన అపకారము జరుగదని అభయ మిచ్చుచున్నాను. నీ వింక జంకు విడచి సుఖముగా నుండుము.

సాహ్యం కృతం తే సుమహద్విక్రాన్తస్య హనూమతః |
క్రమతో యోజనశతం నిర్భయస్య భయే సతి || 141

హనుమంతు డాకాశమార్గమున నూరు యోజనముల దూరము దాటి పోవుచుండగా అతని కేమగునో యని మే మెల్లరము భయపడితిమి. అట్టి సందర్భమున కూడ భయపడని హనుమకు నీవు చాల సహాయము చేసితివి.

రామస్యైష హితాయైవ యాతి దాశరథేర్హరిః |
సత్క్రియాం కుర్వతా తస్య తోషితోఽస్మి దృఢం త్వయా || 142

ఈ హనుమ దశరథమహారాజు కుమారుడగు రాముని పనుపున దూతగా పోవుచున్నాడు. నీ వతనికి చేసిన సత్కారము నన్నెంతో సంతోషింపజేసినది.

తతః ప్రహర్షమగమద్విపులం పర్వతోత్తమః |
దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్టం శతక్రతుమ్ || 143

దేవరాజగు ఇంద్రు డట్లు సంతసించుట చూచి పర్వతశ్రేష్ఠుడు మైనాకుడు మిక్కిలి ఆనందించెను.

స వై దత్తవరః శైలో బభూవావస్థితస్తదా |
హనుమాంశ్చ ముహూర్తేన వ్యతిచక్రామ సాగరమ్ || 144

మైనాకు డట్లు దేవేంద్రునిచే నభయము పొంది, (హనుమంతుడు మఱలి వచ్చుటను ప్రతీక్షించుచు నీటిలో మునుగక) యట్లే నిలిచి యుండెను. హనుమంతుడు ముహూర్త కాలములో ఆ (సముద్ర) ప్రదేశమును గడచి ముందుకు పోయెను.

తతో దేవాః సగన్ధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః |
అబ్రువన్ సూర్యసంకాశాం సురసాం నాగమాతరమ్ || 145

అంత దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సూర్యుని వలె ప్రకాశించు నాగమాత యగు సురస యను నామె కిట్లనిరి.

అయం వాతాత్మజః శ్రీమాన్ ప్లవతే సాగరోపరి |
హనుమాన్నామ తస్య త్వం ముహూర్తం విఘ్నమాచర || 146

రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపమమ్ |
దంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమమ్ || 147

వాయుపుత్రుడగు ఈ హనుమ సుదూరప్రయాణముచే గూడ అలసిపోక సముద్రంపై ఎగురుచున్నాడు. నీవు పెనుకోరలతో, గోరోచనపు వన్నెగల కన్నులతో భయంకరమైన పర్వతమువలె విశాలమగు రాక్షసరూపము దాల్చి, నోటి నాకాశమువలె విపుల మొనర్చి హనుమంతుని గమనమునకు ముహూర్తకాలము విఘ్నము కలిగించుము.

బలమిచ్ఛామహే జ్ఞాతుం భూయ శ్చాస్య పరాక్రమమ్ |
త్వాం విజేష్య త్యుపాయేన విషాదం వా గమిష్యతి || 148

మేము హనుమంతుని బలమును, శత్రువులను జయింపజాలిన అతని పరాక్రమమును తెలియగోరుచున్నాము. అతడు నిన్ను ఉపాయముతో జయించునో లేక భీతిల్లి విషాదము నొందునో చూచెదము.

ఏవముక్తా తు సా దేవీ దైవతైరభిసత్కృతా |
సముద్రమధ్యే సురసా బిభ్రతీ రాక్షసం వపుః || 149

వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహమ్ |
ప్లవమానం హనూమన్తమావృత్యేదమువాచ హ || 150

అని దేవత లట్లు తన్ను కోరి సత్కరించగా ఆ సురసాదేవి సముద్రమధ్యమున అసహజము, వికృతము, ఎల్లరకు భయంకరము అగు రాక్షసరూపము దాల్చి ఎగురుచున్న హనుమంతుని మార్గమునకు అడ్డు నిలచి యిట్లనెను.

మమ భక్ష్యః ప్రదిష్ట స్త్వ మీశ్వరై ర్వానరర్షభ |
అహం త్వా భక్షయిష్యామి ప్రవిశేదం మమాననమ్ || 151

ఓ వానర శ్రేష్ఠుడా! దేవతలు నిన్ను నా కాహారము నిర్దేశించారు. నే నిదే నిన్ను భక్షింతును. నీవు నా నోట ప్రవేశింపుము.

ఏవముక్తః సురసయా ప్రాంజలిర్వానరర్షభః |
ప్రహృష్టవదనః శ్రీమానిదం వచనమబ్రవీత్ || 152

అని యిట్లు సురస పలుకగా ఆ వానరశ్రేష్ఠుడు, మిక్కిలి హర్షముతో ప్రకాశమానుడై ఆమెకు ప్రణామము చేసి ఇట్లనెను.

రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకావనమ్ |
లక్ష్మణేన సహభ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా || 153

దశరథ మహారాజు తనయుడగు రాముడు తమ్ముడగు లక్ష్మణునితోడను, భార్య సీతతోడను దండకారణ్యమున ప్రవేశించినాడు.

అన్యకార్యవిషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః |
తస్య సీతా హృతా భార్యా రావణేన యశస్వినీ || 154

శూర్పణఖ ముక్కు, చెవులు కోయుట మున్నగు పనులచే రాక్షసులతో శత్రుత్వమును పొందిన రాముడు మాయామృగమును పట్టుటకై పోగా, అతని భార్య, యశస్విని యగు సీతను రావణుడు అపహరించినాడు.

తస్యాః సకాశం దూతోఽహం గమిష్యే రామశాసనాత్ |
కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాసినీ || 155

నేను రామునాజ్ఞ తల దాల్చి దూతనై సీతాదేవి కడ కేగెదను. నీవు రాముని రాజ్యమందున్నదానవు. కావున రామునకు సహాయం చేయదగుదువు.

అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణమ్ |
ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే || 156

అట్లు కాదేని, సీతాదేవిని చూచి, పిమ్మట అవలీలగా కార్యములు సాధించు రాముని దర్శించి వచ్చి నీ నోట పడెదను. నా మాట నిజము. నీ కిదే ప్రతిజ్ఞ చేయుచున్నాను.

ఏవముక్తా హనుమతా సురసా కామరూపిణీ |
అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేష వరో మమ || 157

అని యిట్లు హనుమ పలుకగా కామరూపిణియగు ఆ సురస “ఓయీ! నన్నతిక్రమించి యెవ్వడును పోజాలడు. నా కట్టి వరమున్నది” అనెను.

157 వ శ్లోకం తరువాత కొన్ని ప్రతులలో కాననగు క్రింది శ్లోకములు ప్రక్షిప్తములు, అసంగతములును. నూరు యోజనములు హనుమ పెరుగుచో సముద్రము వెడల్పును అంటే కనుక ఇటు వానరులు, అటు రాక్షసులును హనుమంతుని తప్పక తెలిసికొని యుండెడివారు (గోవిందరాజీయము). ఆ శ్లోకము లివి –

తం ప్రయాన్తం సముద్వీక్ష్య సురసా వాక్యమబ్రవీత్ |
బలం జిజ్ఞాసమానా వై నాగమాతా హనూమతః || 1

ప్రవిశ్య వదనం మేఽద్య గన్తవ్యం వానరోత్తమ |
వర ఏష పురా దత్తో మమ ధాత్రేతి సత్వరా |
వ్యాదాయ వక్త్రం విపులం స్థితా సా మారుతేః పురః || 2

ఏవముక్తః సురసయా క్రుద్ధో వానరపుంగవః |
అబ్రవీత్కురు వై వక్త్రం యేన మాం విషహిష్యసే || 3

ఇత్యుక్త్వా సురసాం క్రుద్ధో దశయోజనమాయతః |
దశయోజనవిస్తారో బభూవ హనుమాంస్తదా || 4

తం దృష్ట్వా మేఘసంకాశం దశయోజనమాయతమ్ |
చకార సురసా చాస్యం వింశద్యోజనమాయతమ్ || 5

హనుమాంస్తు తతః క్రుద్ధస్త్రింశద్యోజనమాయతః |
చకార సురసా వక్త్రం చత్వారింశత్తథోచ్ఛ్రితమ్ || 6

బభూవ హనుమాన్వీరః పంచాశద్యోజనోచ్ఛ్రితః |
చకార సురసా వక్త్రం షష్టియోజనమాయతమ్ || 7

తథైవ హనుమాన్వీరః సప్తతీయోజనోచ్ఛ్రితః |
చకార సురసా వక్త్రమశీతీయోజనాయతమ్ || 8

హనుమా నచలప్రఖ్యో నవతీయోజనోచ్ఛ్రితః |
చకార సురసా వక్త్రం శతయోజనమాయతమ్ || 9

వీని భావమిది: నాగమాత సురస, ఆకాశమున పోవుచున్న హనుమంతుని చూచి, అతని బలమెట్టిదో తెలిసికొన దలచి అతనితో “ఓ వానరోత్తమా! నీవిపుడు నా నోట ప్రవేశించియే పోవలెను. నాకిది వెనుక బ్రహ్మ యిచ్చిన వరము” అని పలికి శీఘ్రమే తన విశాలమగు నోరు తెఱచి హనుమంతుని యెదుట నిలచెను. సురస మాటలు విని హనుమంతుడు కోపించి “నీవు నన్ను మ్రింగ కోరితివి గదా. దానికి తగినట్లు నీ నోరు తెఱచి చూపు” మని పలికి పది యోజనములు పెరిగెను. అట్లు పదియోజనములు పెరిగి మేఘమువలె నున్న హనుమాన్ చూచి సురస తన నోటి నిరువది యోజనాలు విస్తరింప జేసెను. దానిని చూచి కోపించిన హనుమ ముప్పది యోజనములు పెరిగెను. అంత సురస తన నోటిని నలుబది యోజనములు పెంచెను. అంత హనుమంతుడు ఏబది యోజనములు శరీరము పెంచెను. సురస అరువది యోజనములు నోరు పెంచెను. వీరుడగు హనుమంతుడు డెబ్బది యోజనములు శరీరము పెంచెను. సురస తన నోటిని ఎనుబది యోజనములు విస్తరింపజేసెను. కొండవలె నున్న హనుమంతుడు తన శరీరాన్ని తొంబది యోజనములు పెంచెను. సురస తన నోటిని నూరు యోజనములు పెంచెను.

తద్దృష్ట్వా వ్యాదితం త్వాస్యం వాయుపుత్రః సుబుద్ధిమాన్ |
సుసంక్షిప్యాత్మనః కాయం బభూవాంగుష్ఠమాత్రకః || 158

బుద్ధిమంతుడగు హనుమంతు డట్లు తెఱచిన ఆమె నోటిని చూచి, తన శరీరమును మిక్కిలి తగ్గించుకొని బొటనవ్రేలి పరిమాణము కలవాడయ్యెను.

సోఽభిపత్యాశు తద్వక్త్రం నిష్పత్య చ మహాజవః |
అంతరిక్షే స్థితః శ్రీమా నిదం వచనమబ్రవీత్ || 159

మహావేగము గల హనుమంతుడు శీఘ్రమే యామె నోట ప్రవేశించి, బయటకువచ్చి, ఆకాశమున నిలచి ఉత్సాహముతో ప్రకాశమానుడై యిట్లనెను.

ప్రవిష్టోఽస్మి హి తే వక్త్రం దాక్షాయణి నమోఽస్తు తే |
గమిష్యే యత్ర వైదేహీ సత్యశ్చాసీ ద్వర స్తవ || 160

ఓ దాక్షాయణీ! నీ కిదే నమస్కారము. నేను నీ నోట ప్రవేశించి వెలువడుటచే బ్రహ్మావర మిపుడు సత్యమయ్యెను కదా. నే నిపుడు సీతమ్మ కడ కేగెదను.

తం దృష్ట్వా వదనాన్ముక్తం చంద్రం రాహుముఖాదివ |
అబ్రవీత్సురసా దేవీ స్వేన రూపేణ వానరమ్ || 161

అంతట సురస తన సహజరూపము దాల్చి, రాహువు నోటినుండి వెలికి వచ్చిన చంద్రునివలె తన నోటినుండి వెలువడిన హనుమంతునితో యిట్లనెను.

అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్ఛ సౌమ్య యథాసుఖమ్ |
సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా || 162

‘ఋజు ప్రవర్తన గల ఓ కపిశ్రేష్ఠుడా! నీ వింక సుఖముగ పోయి రమ్ము. సీతాదేవిని మహాత్ముడగు రాముని కొడుకు చేర్చుము.’

తత్తృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరమ్ |
సాధుసాధ్వితి భూతాని ప్రశశంసు స్తదా హరిమ్ || 163

మిక్కిలి దుష్కరమగు హనుమంతుని యా మూడవ కార్యమును చూచి భూతములు బాగు బాగని అతనిని ప్రశంసించినవి.

స సాగరమనాధృష్యమభ్యేత్య వరుణాలయమ్ |
జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమః || 164

వేగమున గరుడునకు సాటియగు హనుమంతుడును ఆకాశమార్గము జేరి ఎదిరింపరాని ఆ సముద్రముపై యెప్పటివలె వెడలిపోయెను.

సేవితే వారిధారాభిః పతగైశ్చ నిషేవితే |
చరితే కైశికాచార్యైరైరావతనిషేవితే || 165

సింహకుంజరశార్దూలపతగోరగవాహనైః |
విమానైః సంపతద్భిశ్చ విమలైః సమలంకృతే || 166

వజ్రాశనిసమాఘాతైః పావకైరుపశోభితే |
కృతపుణ్యైర్మహాభాగైః స్వర్గజిద్భిరలంకృతే || 167

వహతా హవ్యమత్యర్థం సేవితే చిత్రభానునా |
గ్రహనక్షత్రచంద్రార్కతారాగణవిభూషితే || 168

మహర్షిగణగన్ధర్వ నాగయక్షసమాకులే |
వివిక్తే విమలే విశ్వే విశ్వావసునిషేవితే || 169

దేవరాజగజాక్రాన్తే చంద్రసూర్యపథే శివే |
వితానే జీవలోకస్య వితతే బ్రహ్మనిర్మితే || 170

బహుశః సేవితే వీరైర్విద్యాధరగణైర్వరైః |
జగామ వాయుమార్గే తు గరుత్మానివ మారుతిః || 171

అతడు, మేఘములు కురిపించు వర్షధారలతో కూడినది, పక్షులు సంచరించునది, కైశికరాగ మాలపించు విద్యాధరులు విహరించునది, ఇంద్రధనుస్సు తో కూడినది, (లేదా ఐరావతము ఇంద్రుని ఏనుగు విహరించునది), సింహాలు, ఏనుగులు, పులులు, పక్షులు, సర్పములు లాగుచుండగా వేగముగ పోవు సుందర విమానాలు కలది, వజ్రము, పిడుగులు ఢీకొన్నట్లు అగ్నులు (తేజోవంతములగు నక్షత్రములు) ఢీకొనుట వల్ల ఏర్పడిన వెలుగులు కలది, పుణ్యము చేసి, స్వర్గమును సాధించిన మహాత్ములతో శోభిల్లునది, తక్కిన దేవతలకు హవిస్సును చేర్చుటకు అగ్నిదేవుడు తిరుగాడునది, గ్రహాలు, అశ్విన్యాదిసప్తవింశతి (27) ప్రసిద్ధ నక్షత్రాలు, సూర్యచంద్రులు, తక్కిన నక్షత్రములు ప్రకాశించునది, మహామునులు, గంధర్వులు, నాగులు యక్షులు అంతటను కలది, వ్యాపనశీలమైనది అగుటచే జనసమ్మర్దం లేక నిర్మలమైనది, విశ్వావసు వను గంధర్వరాజు విహరించునది, దేవేంద్రుని ఐరావత మను యేనుగు తిరుగాడునది, చంద్రసూర్యులు పయనించు మార్గమైనది, శుభకరమైనది, విస్తృతమై జీవుల కెల్లరికి పైభాగమున బ్రహ్మచే నిర్మితమైన చాందినీ అయినది, వీరులు, శ్రేష్ఠులగు విద్యాధరుల కాటపట్టయినది అగు వాయుమార్గమున గరుత్మంతునివలె పోయెను.

ప్రదృశ్యమానః సర్వత్ర హనుమాన్మారుతాత్మజః |
భేజేఽమ్బరం నిరాలంబం లంబపక్ష ఇవాద్రిరాట్ || 172

వాయునందనుడగు హనుమంతుడు పొడవైన రెక్కలు కల పర్వతరాజు వలె అన్నివైపులకును అగపడుచు నిరాధారమగు ఆకాశమున పయనించెను.

ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ |
మనసా చిన్తయామాస ప్రవృద్ధా కామరూపిణీ || 173

కోరిన రూపము పొందగల సింహక అను రాక్షసి అట్లు సముద్రము దాటుచున్న హనుమంతుని చూచి సంతోషముతో నుప్పొంగి తన మదిలో నిట్లు తలంచెను.

అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాశితా |
ఇదం హి మే మహత్సత్వం చిరస్య వశమాగతమ్ || 174

“చాలకాలమునకు పిమ్మట నేడు నాకు ఆహారము తినని లోటు తీరుతున్నది. చిరకాలమునకు నా కీ పెద్ద ప్రాణి చేత జిక్కి నది”.

ఇతి సంచిన్త్య మనసా ఛాయామస్య సమాక్షిపత్ |
ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః || 175

అని మదిలో తలచి ఆ సింహిక హనుమంతుని నీడను పట్టి లాగెను. అట్లు లాగుచుండగా హనుమంతు డిట్లు తలంచెను.

సమాక్షిప్తోఽస్మి సహసా పంగూకృతపరాక్రమః |
ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే || 176

“సముద్రమున ఎదురు గాలిచే పెద్ద ఓడవలె, వేగమంతయు కోల్పోతిని. ఒక్కమారుగా నన్నెవరో పట్టి (వెనుకకు) లాగి వేయుచున్నారు.”

తిర్యగూర్ధ్వమధశ్చైవ వీక్షమాణస్తతః కపిః |
దదర్శ స మహత్సత్వముత్థితం లవణామ్భసి || 177

పిమ్మట హనుమంతుడు ప్రక్కలకు, పైకి, క్రిందకు చూచుచు తుదకు సముద్రము నుండి పైకి లేచిన యొక పెద్ద జంతువును చూచెను.

తద్దృష్ట్వా చిన్తయామాస మారుతిర్వికృతాననమ్ || 178

వికృతమగు ముఖం గల దానిని చూచి హనుమంతు డిట్లు తలంచెను.

కపిరాజేన కథితం సత్త్వమద్భుతదర్శనమ్ |
ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయః || 179

చూచుటకు ఆశ్చర్యము కలిగించుచు, మహాపరాక్రమము కలదై, ఏ జీవినైనను దాని నీడను పట్టి తనవైపు లాగగల ఈ జంతువు సుగ్రీవుడు తెలిపినదే. ఇందు సందేహము లేదు.

స తాం బుద్ధ్వాఽర్థతత్త్వేన సింహికాం మతిమాన్కపిః |
వ్యవర్ధత మహాకాయః ప్రావృషీవ బలాహకః || 180

బుద్ధిశాలియగు హనుమంతుడు తన నీడను పట్టి లాగుట అను కార్యముచే అది సింహికయే యని గుర్తించి వర్షాకాలపు మేఘమువలె తన దేహమును పెంచెను.

తస్య సా కాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపేః |
వక్త్రం ప్రసారయామాస పాతాలాన్తరసన్నిభమ్ |
ఘనరాజీవ గర్జన్తీ వానరం సమభిద్రవత్ || 181

స దదర్శ తత స్తస్యా వివృతం సుమహ న్ముఖమ్ |
కాయమాత్రం చ మేధావీ మర్మాణి చ మహాకపిః || 182

సింహికయు ఆ పెనుకోతి యగు హనుమంతుని శరీర మట్లు పెరుగుట చూసి పాతాళబిలము వంటి తన నోరు తెఱచెను. మేఘపంక్తివలె గర్జించుచు హనుమంతుని వెంబడించెను. అంతట మేధావి యగు హనుమంతుడు తన్ను కబళింపజాలునట్లు తెఱచిన ఆమె పెద్ద నోటిని, దేహపరిమాణమును, ప్రాణస్థానములను చూచెను.

స తస్యా వివృతే వక్త్రే వజ్రసంహననః కపిః |
సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః || 183

వజ్రము వలె కఠినమైన దేహము గల మహాబలుడగు హనుమంతుడు తన శరీరాన్ని క్రమముగా తగ్గించుకొనుచు పోయి, తెఱచుకొన్న యామె నోట ప్రవేశించెను.

ఆస్యే తస్యా నిమజ్జన్తం దదృశుః సిద్ధచారణాః |
గ్రస్యమానం యథా చన్ద్రం పూర్ణం పర్వణి రాహుణా || 184

అట్లామె నోటపడుచు పర్వసమయమున రాహువు మ్రింగు పూర్ణచంద్రునివలె నున్న హనుమంతుని సిద్ధులు, చారణులును చూచిరి.

తతస్తస్యా నఖైస్తీక్ష్ణైర్మర్మాణ్యుత్కృత్య వానరః |
ఉత్పపాతాథ వేగేన మనః సంపాతవిక్రమః || 185

పిమ్మట హనుమంతు డామె ఆయువుపట్టును తన వాడి గోళ్ళతో చీల్చి, మనోగమనమును పోలిన వేగముతో (ఆమె తన నోరు మూసికొనుటకు పూర్వమే) పై కెగసెను.

తాం తు దృష్ట్వా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ |
స కపిప్రవరో వేగాద్వవృధే పునరాత్మవాన్ || 186

హృతహృత్సా హనుమతా పపాత విధురాంభసి || 187

ప్రశస్తమగు బుద్ధిగల హనుమంతుడామెను దూరమునుండియే చూచుట చేతను, ధైర్యముచేతను, సామర్థ్యముచేతను పడవైచి, మఱల వేగముగ పెరిగెను. అతడట్లు గుండెను చీల్చగా ఆ సింహిక మృతినొంది నీటబడెను.

తాం హతాం వానరేణాశు పతితాం వీక్ష్య సింహికామ్ |
భూతాన్యాకాశచారీణీ తమూచుః ప్లవగోత్తమమ్ || 188

అట్లు హనుమంతుడు చంపగా నీటబడిన సింహికను చూచి ఆకాశసంచారులగు భూతము లతని కిట్లనెను.

భీమమద్య కృతం కర్మ మహత్సత్త్వం త్వయా హతమ్ |
సాధయార్థమభిప్రేతమరిష్టం ప్లవతాం వర || 189

వానరశ్రేష్ఠుడా! నీ విపు డొక గొప్ప జంతువును సంహరించి భీకర కార్యము సాధించితివి ఇటుపై నీ యభీష్టమును శుభముగా సాధింపుము.

యస్య త్వేతాని చత్వారి వానరేన్ద్ర యథా తవ |
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు న సీదతి || 190

ఓ వానరశ్రేష్ఠుడా! నీవలె ధైర్యము, సూక్ష్మదృష్టి, ఋద్ధి కుశలత, సామర్థ్యము కలవాడు తాను చేపట్టిన పనులలో ఎన్నడును చెఱుపు నొందడు.

స తైః సంభావితః పూజ్యః ప్రతిపన్నప్రయోజనః |
జగామాకాశమావిశ్య పన్నగాశనవత్కపిః || 191

ఈ విధముగా సురస జయించి, సింహికను సంహరించి, తన పని కడ్డు తొలగించుకొనిన పూజనీయుడగు హనుమంతుని ఆకాశచారులగు భూతములు గౌరవించినవి. పిమ్మట హనుమ ఆకాశమున కెగసి గరుడునివలె సాగిపోయెను.

ప్రాప్తభూయిష్ఠపారస్తు సర్వతః ప్రతిలోకయన్ |
యోజనానాం శతస్యాన్తే వనరాజిం దదర్శ సః || 192

హనుమంతు డట్లు నూఱు యోజనములు గడచి, ఇంచుమించుగా సముద్రపు అవ్వలి తీరమును చేరి అన్ని దిక్కులు పరికించి తీరమందు అడవుల వరుసను చూచెను.

దదర్శ చ పతన్నేవ వివిధద్రుమభూషితమ్ |
ద్వీపం శాఖామృగశ్రేష్ఠో మలయోపవనాని చ || 193

సాగరం సాగరానూపం సాగరానూపజాన్ ద్రుమాన్ |
సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ || 194

అత డట్లాకాశమున పోవుచునే పలువిధములగు చెట్లతో గూడిన ద్వీపమును, మలయపర్వతముపై తోటలను, సముద్రమును, దాని తీరమందలి నీటిమడుగులను, వాని ప్రక్క మొలచిన చెట్లను, నదీముఖములను చూచుచు పోయెను.

స మహామేఘసంకాశం సమీక్ష్యాత్మానమాత్మవాన్ |
నిరున్ధన్తమివాకాశం చకార మతిమాన్మతిమ్ || 195

పిమ్మట మహామేఘసదృశమై ఆకాశము నడ్డగించుచున్నటులున్న తన పెద్ద దేహమును చూచుకొని బుద్ధిశాలి కావున హనుమ ఇట్లు తలంచెను.

కాయవృద్ధిం ప్రవేగం చ మమ దృష్ట్వైవ రాక్షసాః |
మయి కౌతూహలం కుర్యురితి మేనే మహాకపిః || 196

“పెరిగిన నా యీ శరీరము, వేగమును చూడగనే రాక్షసులకు నేనెవ్వరో తెలిసికొనవలెనని, నన్ను పట్టవలెనని కుతూహలము కలుగక మానదు”.

తతః శరీరం సంక్షిప్య తన్మహీధరసన్నిభమ్ |
పునః ప్రకృతిమాపేదే వీతమోహ ఇవాత్మవాన్ || 197

అట్లు తలంచి, పర్వతాకారమగు తన శరీరమును చిన్నదిగా చేసికొని హనుమంతుడు, అజ్ఞానము తొలగిన జీవునివలె తన సహజరూపమును పొందెను.

తద్రూపమతిసంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః |
త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్యహరో హరిః || 198

హనుమంతుడు, మూడడుగులు వైచినంత మాత్రముననే బలిచక్రవర్తి పరాక్రమగర్వము నణచి వామనుడు తన పూర్వరూపము దాల్చినట్లు తన రూపమును మిక్కిలి తగ్గించుకొని సహజరూపము దాల్చెను.

స చారునానావిధరూపధారీ, పరం సమాసాద్య సముద్రతీరమ్ |
పరైరశక్యః ప్రతిపన్నరూపః, సమీక్షితాత్మా సమవేక్షితార్థః || 199

సుందరములగు వివిధ రూపములు దాల్చగల హనుమంతు డట్లు అన్యుల కలవికానివాడై సముద్రపు టవ్వలి యొడ్డున కేగి, తన పెనుశరీరమును చూచుకొని, తాను చేయవలసిన పని నూహించి, తన సహజరూపము దాల్చెను.

తతః స లంబస్య గిరేః సమృద్ధే, విచిత్రకూటే నిపపాత కూటే |
సకేతకోద్దాలకనాళికేరే, మహాద్రికూటప్రతిమో మహాత్మా || 200

అంత గొప్ప కొండశిఖరము వలె నున్న మహాత్ముడగు ఆ హనుమంతుడు, వివిధశిఖరములతో ఒప్పుచు, మొగలిపొదలు విరిగి చెట్లు కొబ్బరి చెట్లతో సుసంపన్నమై, ఆకాశమునుండి వ్రేలాడుచున్నదో అన్నట్లు కొనలు తెలియరాకున్నదై వివిధాశ్చర్యములకు ఆలవాలమైన పర్వత శ్రేణికి చెందిన ఒక శిఖరం పై దిగెను.

తతస్తు సంప్రాప్య సముద్రతీరం, సమీక్ష్య లంకాం గిరివర్యమూర్ధ్ని |
కపిస్తు తస్మిన్నిపపాత పర్వతే, విధూయ రూపం వ్యథయన్మృగద్విజాన్ || 201

అట్లు తన రూపమును సంక్షేపించుకొనిన హనుమంతుడు సముద్రతీరమును చేరి, లంబపర్వతశిఖరముపై నున్న లంకానగరమును చూచి, అచటి మృగములకు, పక్షులకు భయము కలిగించుచు ఆ కొండపై దిగెను.

స సాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినమ్ |
నిపత్య తీరే చ మహోదధేస్తదా దదర్శ లంకామమరావతీమివ || 202

హనుమంతు డట్లు దానవులు, పన్నగులు కలదై, పెద్ద పెద్ద అలల వరుసలతో కూడిన సముద్రమును తన బలముతో దాటి, తీరము చేరి యచట అమరావతివలె నున్న లంకానగరమును చూచెను.

ఇత్యర్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే ప్రథమః సర్గః ||

ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణమందు సుందరకాండమున ప్రథమసర్గము.

Follow us on Social Media