పంచుకుందాం – తెలుగు కథ

ఒక రోజొక గురువు గారు తన ఇద్దరు శిష్యుల్నీ పిలిచి, “ఈ రోజు మీరిద్దరూ పొరుగూరికి వెళ్లి రావాలి” అని చెప్పారు. ఒక సంచిలో ఆహారాన్ని నింపి, ఒక శిష్యునికి ఇచ్చి, “ఎవరైనా అవసరం ఉన్న వాళ్లు కనిపిస్తే వారికి ఈ ఆహారాన్ని పంచుకుంటూ వెళ్లు” అన్నాడు. రెండో శిష్యుడికి ఖాళీ సంచి ఇచ్చి ‘దారిలో ఏదైనా విలువైన వస్తువు కనిపిస్తే దాన్ని సంచిలో వేసుకుంటూ వెళ్లు’ అన్నారు.

ఇద్దరూ సంచుల్ని భుజాలకి తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఖాళీ సంచి వాడు ఆడుతూపాడుతూ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్లాక అతనికి ఒక విలువైన రంగు రాయి దొరికింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరం వెళ్లాక మరొకటి కనిపించింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. అలా ఎక్కడ రంగు రాయి కనిపిస్తే దాన్ని తీసుకుని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు. దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అయింది. ఉండేకొద్దీ అడుగు తీసి అడుగేయడమే చాలా కష్టమైపోయింది.

More Telugu kathalu

ఇక రెండోవాడు వెళ్తూ వెళ్తూ దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలోని తిను బండారాలను కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్లాడు. క్రమంగా సంచి బరువు తగ్గి నడక సులభం అయింది. పంచుకుంటూ వెళ్లినవాడు తన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోగలిగాడు. పోగేసుకుంటూ వెళ్లిన వ్యక్తి గమ్యాన్ని చేరుకోలేక పోయాడు. ప్రయాణమూ కష్టంగా సాగింది.

మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి. మీ గమ్యాన్ని ఎలా చేరుకోదలచుకున్నారు?

ఈ కథను తాత్విక దృష్టితో చూసినట్లయితే “విలువగలవైనా, లౌకిక విషయాలను, వస్తు సమాగ్రిని ప్రోగు చేసుకుంటూ వెళితే, జీవితం దుర్భరమవుతుంది. అదే మన ప్రేమనీ , జ్ఞానాన్నీ పంచుకుంటూ జీవన ప్రయాణం సాగిస్తే, మోక్షానికి చేరే మార్గం సుగమం అవుతుంది”. అదే ఈ కథలోని తత్త్వం. మానవునికి అనుసరణీయం.

Kids sharing, kids playing
Follow us on Social Media