Sri Dasarathi Satakam
Bhakta Ramadasu was a Indian aficionado of Sri Ramachandramurthy and a composer of carnatic classical music. He could be a popular Vaggeyakara within the Classical music. He lived within the town of Nelakondapalli close the town of Bhadrachalam and is popular for building a temple in Bhadrachalam for Sri Rama. His ardent verses to Ramachanddramurhty are well known in South Indian. his music is well known as to be specific Ramadaasu Keertanalu. Indeed the artist of South Indian classical music Sami Tyagaraja Swami has learned his music. He too composed “Dasadrathi Satakamu” with “makuTamu” and “Daasarathee Karunaa payonidhee”, which included about 108 lyrics committed to Dasaratha’s child (Sri. Rama)
రామదాసు రచించిన దాశరథి శతకం
దాశరథీ శతకమ్
శ్రీ రామదాసు సంకీర్తన
శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ ‖ 1 ‖
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి – దాశరథీ కరుణాపయోనిధీ ‖ 2 ‖
అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగ నధునీమరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 3 ‖
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ ‖ 4 ‖
శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 5 ‖
ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా
రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ ‖ 6 ‖
మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా
రసనకు~ం బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసం
తసము జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 7 ‖
శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
దార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 8 ‖
దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి
స్ఫురదరవిందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 9 ‖
కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సం
జనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చం
దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 10 ‖
శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 11 ‖
గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్
సరసులమాడ్కి సంతసిల జూలుదురోటుశశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటిస్రవించిన భంగివింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ ‖ 12 ‖
తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచువంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 13 ‖
దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా
చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ ‖ 14 ‖
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ ‖ 15 ‖
ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ ‖ 16 ‖
పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ ‖ 17 ‖
అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ ‖ 18 ‖
పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దండలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ ‖ 19 ‖
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ ‖ 20 ‖
కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటక దైత్యనిర్ధళన దాశరథీ కరుణాపయోనిధీ ‖ 21 ‖
హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటింపజేసితివె దాశరథీ కరుణాపయోనిధీ ‖ 22 ‖
కొంజకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వభూస్ధలిన్
రంజిలద్రవ్వి కంగొనని రామనిధానము నేడు భక్తిసి
ద్ధాంజనమందుహస్తగత మయ్యెబళీ యనగా మదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ ‖ 23 ‖
రాము~ండు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడు షడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
ద్దాము~ండు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం
దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ ‖ 24 ‖
చక్కెరమానివేముదిన జాలినకైవడి మానవాధముల్
పెక్కురు ఒక్క దైవముల వేమఱుగొల్చెదరట్ల కాదయా
మ్రొక్కిననీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీవయీవలెం
దక్కినమాట లేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 25 ‖
‘రా’ కలుషంబులెల్ల బయలంబడద్రోచిన ‘మా’క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్న~ందదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువ~ంగానరు గాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ ‖ 26 ‖
రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ
రామహరేయటంచు మది రంజిల భేకగళంబులీల నీ
నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం
ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ ‖ 27 ‖
చక్కెర లప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం
జొక్కపుజుంటి తేనియకు జొక్కులుచుంగన లేరు గాక నే
డక్కట రామనామమధు రామృతమానుటకంటె సౌఖ్యామా
తక్కినమాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 28 ‖
అండజవాహ నిన్ను హృదయంబుననమ్మిన వారి పాపముల్
కొండలవంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్ష లక్ష్మికై
దండయొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ ‖ 29 ‖
చిక్కనిపాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కినభంగి మీవిమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పళ్లేరంబున సమాహిత దాస్యము నేటిదో యిటన్
దక్కెనటంచు జుర్రెదను దాశరథీ కరుణాపయోనిధీ ‖ 30 ‖
సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడార్తిసో
దరుడు సుమిత్రసూతి దురితంబులుమానుప రామ నామముం
గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 31 ‖
హలికులిశాంకుశధ్వజ శరాసన శంఖరథాంగ కల్పకో
జ్వలజలజాత రేఖలను సాంశములై కనుపట్టుచున్న మీ
కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
తలపున జేర్చికావగదె దాశరథీ కరుణాపయోనిధీ ‖ 32 ‖
జలనిధిలోనదూఱి కుల శైలముమీటి ధరిత్రిగొమ్మునం
దలవడమాటిరక్కసుని యంగముగీటిబలీంద్రునిన్ రసా
తలమునమాటి పార్ధివక దంబముగూఱ్చిన మేటిరామ నా
తలపుననాటి రాగదవె దాశరథీ కరుణాపయోనిధీ ‖ 33 ‖
భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ ‖ 34 ‖
అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ, జానకీ
కువలయనేత్ర గబ్బిచనుకొండల నుండు ఘనంబ మైధిలీ
నవనవ యౌవనంబను వనంబుకున్ మదదంతి వీవెకా
దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ కరుణాపయోనిధీ ‖ 35 ‖
ఖరకరవంశజా విను ముఖండిత భూతపిశాచఢాకినీ
జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ ని
స్పుర దురువజ్రపంజరముజొచ్చితి, నీయెడ దీన మానవో
ధ్ధర బిరుదంక మేమఱుకు దాశరథీ కరుణాపయోనిధీ ‖ 36 ‖
జుర్రెదమీక థామృతము జుర్రెదమీపదకంజతో యమున్
జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబ నే
జుర్రెద జుర్రుజుర్రు~ంగ రుచుల్ గనువారిపదంబు గూర్పవే
తుర్రులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ ‖ 37 ‖
ఘోరకృతాంత వీరభట కోటికి గుండెదిగుల్ దరిద్రతా
కారపిశాచ సంహరణ కార్యవినోది వికుంఠ మందిర
ద్వార కవాట భేది నిజదాస జనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ ‖ 38 ‖
విన్నపమాలకించు రఘువీర నహిప్రతిలోకమందు నా
కన్నదురాత్ముడుం బరమ కారుణికోత్తమ వేల్పులందు నీ
కన్న మహాత్ముడుం బతిత కల్మషదూరుడు లేడునాకువి
ద్వన్నుత నీవెనాకు గతి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 39 ‖
పెంపున~ందల్లివై కలుష బృందసమాగమ మొందుకుండు ర
క్షింపనుదండ్రివై మెయు వసించుదు శేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జవై కృప గుఱించి పరంబు దిరబుగా~ంగ స
త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 40 ‖
కుక్షినజాండపం క్తులొన గూర్చి చరాచరజంతుకోటి సం
రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా
పక్షము నీవుగావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్తవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ ‖ 41 ‖
గద్దరియో గిహృత్కమల గంధర సానుభవంబు~ంజెందు పె
న్నిద్దవు గండు~ం దే~ంటి థరణీసుత కౌ~ంగిలిపంజరంబునన్
ముద్దులుగుల్కు రాచిలుక ముక్తినిధానమురామరా~ంగదే
తద్దయు నే~ండు నాకడకు దాశరథీ కరుణాపయోనిధీ ‖ 42 ‖
కలియుగ మర్త్యకోటినిను గంగొన రానివిధంబో భక్తవ
త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధి గ్రుంకుచో
బిలిచిన బల్క వింతమఱపీ నరులిట్లనరాదు గాక నీ
తలపున లేదె సీత చెఱ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 43 ‖
జనవర మీక థాలి వినసై~ంపక కర్ణములందు ఘంటికా
నినద వినోదముల్ సులుపునీచునకున్ వరమిచ్చినావు ని
న్ననయమునమ్మి కొల్చిన మహాత్మునకేమి యొసంగు దోసనం
దననుత మాకొసంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 44 ‖
పాపము లొందువేళ రణపన్నగ భూత భయజ్వారాదులన్
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్
బ్రాపుగ నీవుదమ్ము డిరుపక్కియలన్ జని తద్విత్తి సం
తాపము మాంపి కాతురట దాశరథీ కరుణాపయోనిధి ‖ 45 ‖
అగణిత జన్మకర్మదురి తాంబుధిలో బహుదుఃఖవీచికల్
దెగిపడవీడలేక జగతీధర నీపదభక్తి నావచే
దగిలి తరింపగోరితి బదంపబడి నదు భయంభు మాంపవే
తగదని చిత్తమం దిడక దాశరథీ కరుణాపయోనిధీ ‖ 46 ‖
నేనొనరించు పాపముల నేకములైనను నాదుజిహ్వకుం
బానకమయ్యెమీపరమ పావననామముదొంటి చిల్కరా
మాననుగావుమన్న తుది మాటకు సద్గతి జెందెగావునన్
దాని ధరింపగోరెదను దాశరథీ కరుణాపయోనిధీ ‖ 47 ‖
పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్న మబ్బినన్
మురిపమ కానిమీ~ందనగు మోసమెఱుంగదు మానసంబు
స్తరమదికాలకింకర గదాహతి పాల్పడనీక మమ్ము నేదు
తఱిదరిజేర్చి కాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 48 ‖
చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్
చేసితి నన్యదైవముల~ం జేరి భజించిన వారిపొందు నే~ం
జేసిన నేరముల్ దల~ంచి చిక్కుల~ంబెట్టకుమయ్యయయ్య నీ
దాసు~ండనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 49 ‖
పరుల ధనంబు~ంజూచిపర భామలజూచి హరింపగోరు మ
ద్గురుతరమానసం బనెడు దొంగనుబట్టినిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశముల~ం జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువునగట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ ‖ 50 ‖
సలలిత రామనామ జపసార మెఱుంగను గాశికాపురీ
నిలయుడగానుమీచరణ నీరజరేణు మహాప్రభావముం
దెలియనహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముం
దలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్
దలచినుతింప నాతరమె దాశరథీ కరుణాపయోనిధీ ‖ 51 ‖
పాతకులైన మీకృపకు బాత్రులు కారెతలంచిచూడ జ
ట్రాతికిగల్గె బావన మరాతికి రాజ్యసుఖంబుగల్గె దు
ర్జాతికి బుణ్యమబ్బెగపి జాతిమహత్త్వమునొందెగావునం
దాతవ యెట్టివారలకు దాశరథీ కరుణాపయోనిధీ ‖ 52 ‖
మామక పాతక వజ్రము మ్రాంపనగణ్యము చిత్రగుప్తులే
యేమని వ్రాతురో? శమనుడేమి విధించునొ? కాలకింకర
స్తోమ మొనర్చిటేమొ? వినజొప్పడ దింతకమున్నెదీనచిం
తామణి యొట్లు గాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 53 ‖
దాసిన చుట్టూమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుని దాసుడా? గుహుడు తావకదాస్య మొసంగినావు నే
జేసిన పాపమో! వినుతి చేసినగావవు గావుమయ్య! నీ
దాసులలోన నేనొక~ండ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 54 ‖
దీక్షవహించి నాకొలది దీనుల నెందఱి గాచితో జగ
ద్రక్షక తొల్లియా ద్రుపద రాజతనూజ తలంచినంతనే
యక్షయమైన వల్వలిడి తక్కట నామొఱజిత్తగించి
ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 55 ‖
నీలఘనాభమూర్తివగు నిన్ను గనుంగొనికోరి వేడినన్
జాలముసేసి డాగెదవు సంస్తుతి కెక్కిన రామనామ మే
మూలను దాచుకోగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు
ద్దాలముగాదె మాయెడల దాశరథీ కరుణాపయోనిధీ ‖ 56 ‖
వలదు పరాకు భక్తజనవత్సల నీ చరితంబు వమ్ముగా
వలదు పరాకు నీబిరుదు వజ్రమువంటిది గాన కూరకే
వలదు పరాకు నాదురిత వార్ధికి దెప్పవుగా మనంబులో
దలతుమెకా నిరంతరము దాశరథీ కరునాపయోనిధీ ‖ 57 ‖
తప్పులెఱుంగ లేక దురితంబులు సేసితినంటి నీవుమా
యప్పవుగావు మంటి నికనన్యులకున్ నుదురంటనంటినీ
కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బటవంటి నా
తప్పుల కెల్ల నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 58 ‖
ఇతడు దురాత్ముడంచుజను లెన్న~ంగ నాఱడి~ంగొంటినేనెపో
పతితు~ండ నంటినో పతిత పావనమూర్తివి నీవుగల్ల నే
నితిరుల వే~ండనంటి నిహ మిచ్చిననిమ్ముపరంబొసంగుమీ
యతులిత రామనామ మధు రాక్షర పాళినిరంతరం బహృ
ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ కరుణాపయోనిధీ ‖ 59 ‖
అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షించిన జాలుదాననిర సించెదనాదురితంబు లెల్లదూ
లించెద వైరివర్గ మెడలించెద గోర్కులనీదుబంటనై
దంచెద, గాలకింకరుల దాశరథీ కరుణాపయోనిధీ ‖ 60 ‖
జలనిధు లేడునొక్క మొగి~ం జక్కికిదెచ్చెశరంబు, ఱాతినిం
పలర~ంగ జేసెనాతిగ~ంబ దాబ్జపరాగము, నీ చరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయ~ంగ లేరు గావునం
దలపనగణ్యమయ్య యిది దాశరథీ కరుణాపయోనిధీ ‖ 61 ‖
కోతికిశక్యమా యసురకోటుల గెల్వను గాల్చెబో నిజం
బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివింత? మా
సీతపతివ్రతా మహిమసేవకు భాగ్యముమీకటాక్షము
ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 62 ‖
భూపలలామ రామరఘుపుంగవరామ త్రిలోక రాజ్య సం
స్ధాపనరామ మోక్షఫల దాయక రామ మదీయ పాపముల్
పాపగదయ్యరామ నిను బ్రస్తుతి చేసెదనయ్యరామ సీ
తాపతిరామ భద్రగిరి దాసరథీ కరుణాపయోనిధీ ‖ 63 ‖
నీసహజంబు సాత్వికము నీవిడిపట్టు సుధాపయోధి, ప
ద్మాసనుడాత్మజుండు, గమలాలయనీ ప్రియురాలు నీకు సిం
హాసనమిద్ధరిత్రి; గొడుగాక సమక్షులు చంద్రబాస్కరుల్
నీసుమతల్పమాదిఫణి నీవె సమస్తము గొల్చినట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 64 ‖
చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవింత, సు
స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ
స్మరణ దనర్చుమానవులు సద్గతి జెందిన దెంతవింత? యీ
ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 65 ‖
దైవము తల్లిదండ్రితగు దాత గురుండు సఖుండు నిన్నె కా
భావన సేయుచున్నతఱి పాపములెల్ల మనోవికార దు
ర్భావితుజేయుచున్నవికృపామతివైనను కావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 66 ‖
వాసవ రాజ్యభోగ సుఖ వార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
యాసకుమేర లేదు కనకాద్రిసమాన ధనంబుగూర్చినం
గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్
వీసరబోవ నీవు పదివేలకు జాలు భవంబునొల్ల నీ
దాసునిగాగ నేలుకొను దాశరథీ కరుణాపయోనిధీ ‖ 67 ‖
సూరిజనుల్ దయాపరులు సూనృతవాదు లలుబ్ధమానవుల్
వేరపతిప్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్ మహా
భారముదాల్పగా జనులు పావనమైన పరోపకార స
త్కార మెఱుంగులే రకట దాశరథీ కరుణాపయోనిధీ ‖ 68 ‖
వారిచరావతారము వారిధిలో జొఱబాఱి క్రోధ వి
స్తారగుడైన యా నిగమతస్కరవీర నిశాచరేంద్రునిం
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికి మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ ‖ 69 ‖
కరమనుర క్తిమందరము గవ్వముగా నహిరాజుద్రాడుగా
దొరకొన దేవదానవులు దుగ్ధపయోధిమథించుచున్నచో
ధరణిచలింపలోకములు తల్లడమందగ గూర్మమై ధరా
ధరము ధరించితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ ‖ 70 ‖
ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుడ
వ్వారిధిలోనదాగినను వానివధించి వరాహమూర్తివై
ధారుణిదొంటికై వడిని దక్షిణశృంగమున ధరించి వి
స్తార మొనర్చితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ ‖ 71 ‖
పెటపెటనుక్కు కంబమున భీకరదంత నఖాంతర ప్రభా
పటలము గప్ప నుప్పతిలి భండనవీధి నృసింహభీకర
స్ఫుటపటుశక్తి హేమకశిపు విదళించి సురారిపట్టి నం
తటగృపజూచితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ ‖ 72 ‖
పదయుగళంబు భూగగన భాగముల వెసనూని విక్రమా
స్పదమగునబ్బలీంద్రునొక పాదమునందల క్రిందనొత్తిమే
లొదవజగత్త్రయంబు బురు హూతునికియ్యవటుండవైనచి
త్సదమలమూర్తి వీవెకద దాశరథీ కరుణాపయోనిధీ ‖ 73 ‖
ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్లవధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృకతర్పణ మొప్పజేసి భూ
సురవరకోటికి ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ ‖ 74 ‖
దురమున దాటకందునిమి ధూర్జటివిల్ దునుమాడిసీతనుం
బరిణయమంది తండ్రిపనుప ఘన కాననభూమి కేగి దు
స్తరపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ
ధరముల గూల్చితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ ‖ 75 ‖
అనుపమయాదవాన్వయసు ధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తినీ
కనుజుడుగాజనించి కుజనావళినెల్ల నడంచి రోహిణీ
తనయుడనంగ బాహుబల దర్పమున బలరామ మూర్తివై
తనరిన వేల్పవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ ‖ 76 ‖
సురలునుతింపగా ద్రిపుర సుందరుల వరియింపబుద్ధరూ
పరయగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించునప్పుడా
హరునకుదోడుగా వరశ రాసన బాణముఖో గ్రసాధనో
త్కర మొనరించితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ ‖ 77 ‖
సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స
ర్వంకషలీల ను త్తమ తురంగమునెక్కి కరాసిబూని వీ
రాంకవిలాస మొప్ప గలి కాకృత సజ్జనకోటికి నిరా
తంక మొనర్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ ‖ 78 ‖
మనముననూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్
దనువుననంటి మేనిబిగి దప్పకమున్నెనరుండు మోక్ష సా
ధన మొనరింప~ంగావలయు~ం దత్త్వవిచారము మానియుండుట
ల్తనువునకు విరోధమిది దాశరథీ కరుణాపయోనిధీ ‖ 79 ‖
ముదమున కాటపట్టుభవ మోహమద్వ దిరదాంకుశంబు సం
పదల కొటారు కోరికల పంట పరంబున కాది వైరుల
న్నదన జయించుత్రోవ విపదబ్ధికినావగదా సదాభవ
త్సదమలనామసంస్మరణ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 80 ‖
దురిత లతానుసార భయ దుఃఖ కదంబము రామనామభీ
కరతల హేతిచే~ం దెగి వకావకలై చనకుండ నేర్చునే
దరికొని మండుచుండు శిఖ దార్కొనిన శలబాదికీటకో
త్కరము విలీనమైచనవె దాశరథీ కరుణాపయోనిధీ ‖ 81 ‖
హరిపదభక్తినింద్రియజ యాన్వితుడుత్తము~ండింద్రిమంబులన్
మరుగక నిల్పనూదినను మధ్యము~ండింద్రియపారశ్యుడై
పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా
దరమున నెట్లుకాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 82 ‖
వనకరిచిక్కు మైనసకు పాచవికిం జెడిపోయె మీనుతా
వినికికి~ంజిక్కె~ంజిల్వగను వే~ందుఱు~ం జెందెను లేల్లు తావిలో
మనికినశించె దేటితర మాయిరుమూ~ంటిని గెల్వనై దుసా
ధనములనీ వె కావనగు దాశరథీ కరుణాపయోనిధీ ‖ 83 ‖
కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుండనాస మీ
యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో
త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ ‖ 84 ‖
చిరతరభక్తి నొక్కతుళసీదళ మర్పణ చేయువాడు ఖే
చరగరు డోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సధా భవత్
సురుచిర ధీంద పాదముల బూజలొనర్చిన వారికెల్లద
త్పర మరచేతిధాత్రిగద దాశరథీ కరుణాపయోనిధీ ‖ 85 ‖
భానుడు తూర్పునందుగను పుట్టిన~ం బావక చంద్ర తేజముల్
హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్న~ం బర దైవమరీచులడంగకుండు నే
దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ ‖ 86 ‖
నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుంకులాడకవృ థాతనుకష్టముజెంది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ
తామసపంకముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ ‖ 87 ‖
నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుంకులాడకవృ థాతనుకష్టముజెంది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ
తామసపంకముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ ‖ 88 ‖
కాంచన వస్తుసంకలిత కల్మష మగ్ని పుటంబు బెట్టెవా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భ క్తియోగ దహ నార్చి~ందగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 89 ‖
నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషంబుగా
నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై
నీసుతుడిచ్చు నాయువులు నిన్న భుజించిన~ం గల్గకుండునే
దాసులకీప్సి తార్థముల దాశరథీ కరుణాపయోనిధీ ‖ 90 ‖
వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం
దారయ రొంపిలోన దను వంటని కుమ్మరపుర్వురీతి సం
సారమున మెలంగుచు విచారడైపరమొందుగాదెస
త్కార మెఱింగి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ ‖ 91 ‖
ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం
బెక్కడ జీవు~ండెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా
డొక్కడెపాప పుణయ ఫల మొందిన నొక్కడె కానరాడువే
ఱొక్కడు వెంటనంటిభవ మొల్లనయాకృప జూడువయ్యనీ
టక్కరి మాయలందిడక దాశరథీ కరుణా పయోనిధీ ‖ 92 ‖
దొరసినకాయముల్ముదిమి తోచిన~ంజూచిప్రభుత్వముల్సిరు
ల్మెఱపులుగాగజూచిమఱి మేదినిలో~ందమతోడివారుముం
దరుగుటజూచిచూచి తెగు నాయువెఱుంగక మోహపాశము
ళరుగనివారికేమిగతి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 93 ‖
సిరిగలనా~ండు మైమఱచి చిక్కిననా~ండుదలంచి పుణ్యముల్
పొరి~ంబొరి సేయనైతినని పొక్కిన~ం గల్గు నెగాలిచిచ్చుపై~ం
గెరలిన వేళ~ందప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త
త్తరమున~ం ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ ‖ 94 ‖
జీవనమింక~ం బంకమున జిక్కిన మీను చలింపకెంతయు
దావుననిల్చి జీవనమె దద్దయు~ం గోరువిధంబు చొప్పడం
దావలమైన~ంగాని గుఱి తప్పనివా~ండు తరించువా~ండయా
తావకభక్తియో గమున దాశరథీ కరుణాపయోనిధీ ‖ 95 ‖
సరసునిమానసంబు సర సజ్ఞుడెరుంగును ముష్కరాధముం
డెఱి~ంగిగ్రహించువాడె కొల నేకనిసము~ం గాగదుర్దురం
బరయ~ంగ నేర్చునెట్లు విక చాబ్దమరంద రసైక సౌరభో
త్కరముమిళింద మొందుక్రియ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 96 ‖
నో~ంచినతల్లిదండ్రికి~ం దనూభవు~ండొక్కడెచాలు మేటిచే
చా~ంచనివాడు వేఱొక~ండు చాచిన లేదన కిచ్చువా~ండునో
రా~ంచినిజంబకాని పలు కాడనివా~ండు రణంబులోన మేన్
దాచనివా~ండు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ‖ 97 ‖
శ్రీయుతజానకీరమణ చిన్నయరూప రమేశరామ నా
రాయణ పాహిపాహియని బ్రస్తుతి~ం జేసితి నామనంబునం
బాయక కిల్బిషవ్రజ వి పాటనమంద~ంగ జేసి సత్కళా
దాయి ఫలంబునాకియవె దాశరథీ కరుణాపయోనిధీ ‖ 98 ‖
ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్
సంతసమంద~ం జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ ‖ 99 ‖
బొంకనివా~ండెయోగ్యుడరి బృందము లెత్తిన చోటజివ్వకుం
జంకనివా~ండెజోదు రభసంబున నర్థి కరంబుసా~ంచినం
గొంకనివా~ండెదాత మిము~ం గొల్చిభజించిన వా~ండె పోనిరా
తంక మనస్కు~ం డెన్న గను దాశరథీ కరుణాపయోనిధీ ‖ 100 ‖
భ్రమరముగీటకంబు~ం గొని పాల్పడి ఝాంకరణో కారియై
భ్రమరముగానొనర్చునని పల్కుట~ం జేసి భవాది దుఃఖసం
తమసమెడల్చి భక్తిసహి తంబుగ జీవుని విశ్వరూప త
త్త్వమునధరించు టేమరుదు దాశరథీ కరుణాపయోనిధీ ‖ 101 ‖
తరువులు పూచికాయలగు దక్కుసుమంబులు పూజగాభవ
చ్చరణము సోకిదాసులకు సారములో ధనధాన్యరాశులై
కరిభట ఘోటకాంబర నకాయములై విరజా సము
త్తరణ మొనర్చుజిత్రమిది దాశరథీ కరుణాపయోనిధీ ‖ 102 ‖
పట్టితిభట్టరార్యగురు పాదములిమ్మెయినూర్ధ్వ పుండ్రముల్
వెట్టితిమంత్రరాజ మొడి బెట్టితి నయ్యమకింక రాలికిం
గట్టితిబొమ్మమీచరణ కంజలందు~ం దలంపుపెట్టి బో
దట్టితి~ం బాపపుంజముల దాశరథీ కరుణాపయోనిధీ ‖ 103 ‖
అల్లన లింగమంత్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం
చెర్ల కులోద్బవుం దంబ్రసిద్ధిడనై భవదంకితంబుగా
నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
ద్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ ‖ 104 ‖
Sri Dasarathi Satakam
Follow us on Social Media